- ధాన్య సేకరణపై జాతీయ విధానానికి డిమాండ్
- ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల హెచ్చరిక
ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రసమితి ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు పార్లమెంట్‌ను బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం పార్లమెంట్ ఉభయసభలకు టీఆర్ఎస్ సభ్యులు నల్ల దుస్తులు ధరించి హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదాపడింది. లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఉభయసభలకు చెందిన టీఆర్ఎస్ సభ్యులు కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం సమగ్ర విధానం తీసుకురావాలని, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని, రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
ఈ మేరకు తమ డిమాండ్లను ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. పార్లమెంట్లో ఆదినుంచీ టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. మంగళవారం కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం కుళ్లిపోయే పరిస్థితి వొచ్చిందని, ఆ ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని రాజ్యసభ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరారు. యాసంగి ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపుతుందని కేకే అన్నారు.
బిజెపిది రైతు వ్యతిరేక ప్రభుత్వం…ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల హెచ్చరిక
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని ఎంపీలు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు, నామా నాగేశ్వరరావులు వి•డియాతో మాట్లాడుతూ మోడీది ఫాసిస్ట్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీపై తిరుగు బాటు చేసేలా సమాయత్తం చేస్తామన్నారు.
టీఆర్ఎస్ ఆందోళనలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. చట్టసభను బాయ్‌కాట్ చేయడం బాధ కలిగించే విషయమే..కానీ కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్ చేస్తున్నామని ఎంపీ కేకే స్పష్టం చేశారు. సభను బాయ్‌కాట్ చేయాలని ఎవరూ కోరుకోరని ఆయన పేర్కొన్నారు. ‘రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వొస్తుంది. వాతావరణ పరిస్థితుల వల్ల రబీలో రా రైస్ రాదు. రబీ ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుంది. రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మారుస్తాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తుంది. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతున్నారు’ అని ఎంపీ కేకే పేర్కొన్నారు.