కాజీపేటలో దారుణం
సుబేదారి, ప్రజాతంత్ర, మే 19 : శుక్రవారం ఉదయం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాజీపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాజీపేట రైల్వే ఆవరణలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద ఆరు సంవత్సరాల బాలునిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వీధి కుక్క ఆ బాలుడి మెడను పట్టుకోవడంతో గాయపడి రక్తస్త్రావమై చిన్నారి విలవి)లాడి పోయాడు. బతుకు దెరువు కోసమై ఉత్తరప్రదేశ్‌కు చెందిన చోటు కుటుంబం వరంగల్‌కు వచ్చింది. కాజీపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో రోడ్లపైనే ఉంటూ, వీధుల్లో చేతి ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కుక్క కాటుకు మృత్యువాత పడ్డ అన్నను లేవమంటూ చిన్నారి చేస్తున్న రోదనలు చూపరుల కంటతడి పెట్టించాయి. బతుకు దేరువు కోసం వచ్చి కన్న కొడుకును పోగొట్టుకున్న వలస జీవి చోటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దజాస్యామ్ వినయ్ భాస్కర్ కాళ్లపై పడి కన్నీరు మున్నీరుగా రోధించారు. సర్కార్ పక్షాన సహాయం చేస్తామని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. వైద్యం కోసం ప్రయత్నించే క్రమంలోనే అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకొన్న బాలుడు మృతి చెందాడు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కారణంగానే అభంశుభం తెలియని ఆరేళ్ల బాలుడు కన్నుమూశాడని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.
వరంగల్ లో కుక్కల స్వైర వివాహారం చేస్తూ, నగరంలో హల్ చల్ చేస్తున్న బల్దియా అధికారులు ఏం చేస్తున్నారని నగర వాసులు నిలదీస్తున్నారు. ఇప్పటి నుండైన చిన్నారులను ఒంటరిగా బయటకు వెళ్లకుండా చేసుకోవడంతో పాటు, శునకాలు సంచరించే ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాలుడి మృతితో కళ్లు తెరిచారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు. చిన్నారి చనిపోయాక మున్సిపల్ సిబ్బంది తీరిగ్గా కుక్కల వేట మొదలుపెట్టారు. ఒక ప్రాణం పోతేగాని స్పందించారా అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట్, హన్మకొండలో వీధి కుక్కల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుక్కల కోసం మున్సిపల్ సిబ్బంది వేటాడుతోంది. కుక్కలను పట్టుకుని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత కుక్కలను సిటీకి దూరంగా వదిలేస్తున్నారు..కుక్కల దాడిలో మరణించిన బాలుడి డెడ్ బాడీని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ లు పరిశీలించారు. బాధిత కుటుంబానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.లక్ష పరిహారం ప్రకటించారు.
ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నయన్నారు చీఫ్ విప్ వినయ్ భాస్కర్. కుక్కలను చంపడం నేరం.. కానీ వాటి బర్త్ కంట్రోల్ చేస్తామని తెలిపారు. నగరంలో మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నారు. కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు వినయ్ భాస్కర్. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీమ్ ను రప్పిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వినయ్ భాస్కర్ హా ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కుక్కల దాడిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ బాలుడి డెడ్ బాడీని పరిశీలించారు. కుక్కల నియంత్రణలో పాలకులు విఫలమయ్యారని.. ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు.