Take a fresh look at your lifestyle.

పొరుగు దేశాలతో సమస్యాత్మకంగా మారిన .. సరిహద్దు వివాదాలు

“చైనాతో భారతదేశానికి దీర్ఘకాలంగా  ఉన్న సరిహద్దు సమస్యలు పరిష్కారానికి అందనంతగా ముదిరిపోయాయి. ఇరుదేశాలకు వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రాంతం అక్సాయ్‌ ‌చిన్‌. ‌టిబెటన్‌ ‌పీఠభూమికి వాయువ్య భాగంలో సుమారు 35,241 చదరపు కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ప్రాంతం తమదేశంలోని జిన్‌ ‌జియాంగ్‌ అటానమస్‌ ‌రీజియన్లో భాగమని చైనా చెబుతుండగా, తన కేంద్ర పాలిత ప్రాంతమైన  లడఖ్లో ఒక భాగమని  భారతదేశం వాదిస్తోంది. డెప్సాంగ్‌ ‌మైదానాలు లడఖ్‌ ‌మరియు వివాదాస్పద ప్రాంతమైన అక్సాయ్‌ ‌చిన్‌  ‌సరిహద్దులలో ఉన్నాయి.”

భారతదేశం స్వాతంత్రం పొందిన నాటి నుంచి పొరుగుదేశాలతో సరిహద్దు సమస్యలతో సతమవుతూనే ఉంది. బ్రిటిష్‌ ‌పాలనా కాలంలో సరిహద్దు దేశాలతో చేసుకున్న అనేక సంధులు, ఒప్పందాలు స్వాతం త్రానం తరం క్రమేణా ఉల్లంఘించ బడి ఇండియాకు తలకు మించిన భారంలా పరిణ మించాయి. ఇటీవలే గాల్వాన్‌ ‌లోయ ప్రాంతంలో చైనా దురాక్రమణకు పాల్పడడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి అంతర్జాతీయంగా ఉత్కంఠతా వాతవరణానికి తెరలేచింది. భారతదేశం తన పొరుగువారితో మొదటి నుంచి ప్రాదేశిక సమస్యలను ఎదుర్కొంటోంది. గత 70 సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌, ‌శ్రీలంక దేశాలతో మాత్రమే తన సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో విజయవంతమైంది. మయన్మార్‌, ‌భూటాన్‌ ‌మరియు ఇటీవల చైనా, పాకిస్తాన్‌ ‌మరియు నేపాల్‌ ‌లతో ‘‘గుర్తించబడని సరిహద్దు’’ ప్రాంతాలలో తరచూ అలజడులు నెలకొంటున్నాయి.

భారత్‌-‌శ్రీలంక దేశాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిన కత్చతీవు ద్వీప సమస్యను ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవడం ముదావాహం. ఈ ద్వీపం అంతకుముందు భారతదేశంలోని మదురై జిల్లాలో ఉన్న రామ్నాడ్‌ ‌రాజ్యంలో భాగం. బ్రిటీష్‌ ‌పాలనా కాలంలో భారత ఉపఖండంలో చేర్చబడి మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలో కలపబడింది. నాటి నుంచి 1974 వరకు ఈ ద్వీప పరిపాలన రెండు దేశాలు నిర్వహిస్తున్నందున ఈ అంశం వివాదస్పదంగా మారింది. 235 ఎకరాల జనవాసాలు లేని ఈ ప్రాంతం మీద శ్రీలంక అధికారాన్ని భారతదేశం గుర్తించడంతో ఈ సమస్య సమసిపోయింది. కాని, కట్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు కట్టబెడుతూ 1974, 1976లలో భారత-శ్రీలంక దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధమని 2011 జూన్‌ ‌లో, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. అయితే భారత భూభాగాన్ని వేరొక దేశానికి అప్పగించడాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదించాల్సి ఉందని బెరుబారి కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది.

భారతదేశానికి బంగ్లాదేశ్‌ ‌తో సైతం తీరప్రాంత సరిహద్దుల మీద సమస్యలు ఉత్పన్నమయ్యాయి. బంగాళా ఖాతంలోని జనావాసాలు లేని చిన్న తీరప్రాంతమైన బంగబందుగా పిలవబడే దక్షిణ తాల్పట్టి ద్వీపం విషయంలో ఎదురైన సమస్యను పరిష్కరించుకోవడంలో భారత్‌ ‌సఫలీకృతమైంది. ప్రాదేశిక జలాలను గుర్తించే సమస్య ఇరు దేశాల మధ్య తీవ్రమైన విభేదాలకు దారితీసింది. 1975 లో రెండు దేశాల సరిహద్దులోని హరిభాంగా నది ఒడ్డున ఉపగ్రహ చిత్రం ద్వారా గుర్తించబడిన బంగ్లాదేశ్లోని సౌత్‌ ‌తల్పట్టి మరియు భారతదేశంలోని న్యూ మూర్‌ (‌పుర్బాషా ) అని పిలువబడే కొత్తగా కనుగొనబడిన ద్వీపంపై అధికారం ఏవరిదనే అంశం ఈద వివాదం మొదలైంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ జలాల ఆధారంగా నది యొక్క మార్గాల ప్రవాహాన్ని నిర్ణయించడానికి, వివాదాన్ని పరిష్కరించడానికి ఒక ఇండో-బంగ్లాదేశ్‌ ‌బృందాన్ని పంపాలని బంగ్లాదేశ్‌ ‌ప్రతిపాదించింది. 1981లో ద్వీపంలో భారత్‌ ‌తన నావికా దళాలను నిలబెట్టడం వివాదాస్పదమైంది. ఎట్టకేలకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి భారతదేశం అంగీకరించింది. అయితే ఇప్పటి వరకు కూడ ఈద్వీపం మీద ఏదేశం యొక్క అధికారం ఏర్పాటుచేయబడలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశం బంగ్లాదేశ్తో 4351 కి.మీ.యొక్క భూసరిహద్దును కలిగి ఉంది. రెండు దేశాల మధ్య భూసరిహద్దును గుర్తించే అంశం మీద 1974 మే నెలలో షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహ్మాన్‌ ‌మరియు శ్రీమతి ఇందిరాగాంధీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సమగ్ర ఒప్పందం రెండు దేశాలపై చరిత్ర చేసిన దీర్ఘకాలిక గాయాలకు ఉపశమనానికి, అనేక ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్ధేశించబడింది. కానీ ఆచరణలో రెండు ప్రభుత్వాలు విఫల మయ్యాయి.

చైనాతో భారతదేశానికి దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్యలు పరిష్కారానికి అందనంతగా ముదిరిపోయాయి. ఇరుదేశాలకు వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రాంతం అక్సాయ్‌ ‌చిన్‌. ‌టిబెటన్‌ ‌పీఠభూమికి వాయువ్య భాగంలో సుమారు 35,241 చదరపు కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ప్రాంతం తమదేశంలోని జిన్‌ ‌జియాంగ్‌ అటానమస్‌ ‌రీజియన్లో భాగమని చైనా చెబుతుండగా, తన కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఒక భాగమని భారతదేశం వాదిస్తోంది. డెప్సాంగ్‌ ‌మైదానాలు లడఖ్‌ ‌మరియు వివాదాస్పద ప్రాంతమైన అక్సాయ్‌ ‌చిన్‌ ‌సరిహద్దులలో ఉన్నాయి. 1962 లో భారతదేశంతో జరిగిన యుద్ధంలో చైనా సైన్యం ఈ మైదానాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే ఈ మైదానాల పశ్చిమ భాగాన్ని భారతదేశం నియంత్రిస్తోంది. షాక్స్గామ్‌ ‌నదికి ఇరువైపులా దాదాపు 5,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ట్రాన్స్-‌కరాకోరం ట్రాక్ట్ ‌ప్రాంతాన్ని, జిన్‌ ‌జియాంగ్‌ అటానమస్‌ ‌రీజియన్‌ ‌లో భాగంగా చైనా నియంత్రణలో ఉంచుకుంది. దీనిని 1963 వరకు పాకిస్తాన్‌ ‌తన భూభాగంగా పేర్కొనగా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో భాగమని భారతదేశం పేర్కొంది. కాశ్మీర్‌ ‌వివాదం యొక్క తుది పరిష్కారానికి లోబడి ఉండాలనే నిబంధనతో 1963 లో చైనాతో సరిహద్దు ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ ఈ ‌ప్రాంతంపై తన వాదనను విరమించుకుంది. అదేవిధంగా లడఖ్లోని లేహ్‌ ‌జిల్లాలో గల డెమ్చోక్‌, ‌కుమార్‌ ‌ప్రాంతాలు, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లోని కిన్నౌర్‌ ‌జిల్లాలోగల కౌరిక్‌, ‌షిప్కి లా కనుమలు కూడ చైనాతో వివాదాలకు కేంద్ర బిందువులయ్యాయి.ఉత్తరాఖండ్‌ ‌లోని ఉత్తర కాశి జిల్లాలోని నెలాంగ్‌, ‌పులం సుమ్దా, సాంగ్‌, ‌జాదంగ్‌ ‌మరియు లాప్తాల్‌ ‌ప్రాంతాలు, అదేవిధంగా ఉత్తరాఖండ్‌ ‌లోని చమోలి జిల్లాలో గల బారాహాతి పచ్చికబయళ్ళు కూడ రెండుదేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. నిజానికి ఆయా ప్రాంతాలన్ని భారత భూభాగంలో ఉన్నప్పటికిని చైనా వాటి మీద కన్నేసింది. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ఏర్పాటుతో కలత చెందిన చైనా, సిక్కీం భారతదేశంలో కలవడం జీర్ణించుకోలేకపోతోంది. అవకాశం ఉన్న ప్రతిసారి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. 1967లో నాథూలా, చోలా కనుమ ప్రాంతంలో ఘర్షణలు, 2017లో డోకాలా పాస్‌ ‌సమీపంలోని వివాదాస్పద భూభాగమైన డోక్లాంలో జరిగిన సైనిక వివాదం చైనా యుద్ధకాంక్షకు పరాకాష్ఠ.

దేశ విభజన నాటి నుంచి పాకిస్తాన్‌ ‌తో సరిహద్దు సమస్యలను భారతదేశం ఎదుర్కుంటూనే ఉంది. రెండు దేశాల మధ్య వివాదానికి ప్రధాన కేంద్రం జమ్మూ కాశ్మీర్‌. ‌కేవలం ఈ ప్రాంతం కోసమే ఇరుదేశాల మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. భారత-పాకిస్తాన్‌ ‌దేశాల వివాదానికి మరో కేంద్రం సియాచిన్‌ ‌హిమానీనదం. ఇది హిమాలయాలలోని తూర్పు కరాకోరంలలో భారతదేశం-పాకిస్తాన్‌ ‌మధ్య వాస్తవ గ్రౌండ్‌ ‌పొజిషన్‌ ‌లైన్‌ ‌కు తూర్పున ఉంది. అన్ని ఉపనది హిమానీనదాలతో సహా సియాచిన్‌ ‌గ్లేషియర్‌ ‌మొత్తాన్ని భారతదేశం తన నియంత్రణలో ఉంచుకుంది. దాదాపు 70 కిమీ ఎత్తులో కరాకోరంలో రీజియన్‌ ‌లో పొడవైన ఈ హిమానీనదం, ప్రపంచంలో ధ్రువ రహిత ప్రాంతాలలో రెండవ ఎత్తైనది. రెండు దేశాల సరిహద్దు వివాదానికి మరో కారణం సాల్టోరో రిడ్జ్. ‌సియాచిన్‌ ‌హిమానీనదానికి నైరుతి వైపున, కరాకోరం నడిబొడ్డున గల పర్వతాలు ఇవి. ఈ పర్వతాలను లడఖ్‌ ‌లో భాగంగా భారతదేశం చూపిస్తుండగా, తమదేశంలోని గిల్గిట్‌-‌బాల్టిస్తాన్‌ ‌లో భాగమని పాకిస్తాన్‌ ‌వాదిస్తోంది. పాకిస్తాన్‌ ‌దళాలు పశ్చిమ వైపున హిమనదీయ లోయల్లోకి రావడంతో, 1984లో ఈ శ్రేణి యొక్క ప్రధాన శిఖరాలు, వాటి మార్గాలపై భారత్‌ ‌సైనిక నియంత్రణ చేపట్టింది. ఇండో-పాకిస్తాన్‌ ‌ల మధ్య మరో సరిహద్దు సమస్య సర్‌ ‌క్రీక్‌. ఇది రాన్‌ ఆఫ్‌ ‌కచ్‌ ‌చిత్తడి నేలలలో భారత్‌ ‌పాకిస్తాన్‌ ‌మధ్య వివాదాస్పదమైన 96 కి.మీ నీటిపాయ. ఈ నదిసంగమ తూర్పు భాగాన్ని పాకిస్తాన్‌ ‌తనదని వాదిస్తుండగా, మధ్య ప్రాంతాన్ని భారత్‌ ‌తనదని చెబుతోంది.

ఇటీవలే భారతదేశానికి సమస్యాత్మకంగా పరిణమించిన మరో పొరుగుదేశం నేపాల్‌. ఇం‌డియాతో దాదాపు 1751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు గల నేపాల్‌, అనుకూల వైఖరిని ప్రదిర్శిస్తూనే అప్పుడప్పుడు సరిహద్దు వివదాలాను లేవనెత్తుతోంది. ఇండియా-నేపాల్‌-‌చైనా మూడు దేశాల సంయోగ ప్రాంతమైన కాలాపానీ, మరియు సుస్తాలు ఇరుదేశాల సరిహద్దు వివాధానికి ప్రధాన కారణం. కాలాపానీకి పశ్చిమాన ప్రవహించే నది కాళినదికి ప్రధాన నది కాబట్టి ఈ ప్రాంతం తమదేనని నేపాల్‌ ‌వాదిస్తోంది. అయితే కాలాపానీకి పశ్చిమాన ఉన్న నది ప్రధాన కాళినది కాదని, అందువల్ల నదికి తూర్పున ఉన్న ఓం పర్వత్‌ ‌పర్వతాల శిఖరాల రేఖల ఆధారంగా అక్కడి సరిహద్దు ఉండాలి అని భారతదేశం పేర్కొంది. ఈ నది నేపాల్‌ ‌లోని సుదూర్‌ ‌పశ్చీం ప్రావిన్స్, ‌భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ ‌లోని పిథూర్‌ ‌ఘడ్‌ ‌జిల్లా సరిహద్దులలో ఉంది. బ్రిటీష్‌ ఇం‌డియా-నేపాల్‌ ‌ల మధ్య 1816 మార్చి 4న జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీనది నేపాల్‌ ‌పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు.నది మూలాన్ని గుర్తించడంలో గల వ్యత్యాసం భారతదేశం, నేపాల్‌ ‌మధ్య సరిహద్దు వివాదాలకు దారితీసింది. రెండు దేశాలు తమ సొంత వాదనలకు మద్దతుగా పటాలను తయారు చేస్తూ వివాదాన్ని మరింతగా పెంచేసాయి.చిన్నదేశాలతో సైతం భారతదేశానికి సరిహద్దు సమస్యలున్నాయి. 699 కిలోమీటర్ల సరిహద్దు గల భూటాన్‌ ‌తో 1973-1984 మధ్యకాలంలో చర్చల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకుంది. అయితే కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సరిహద్దులో గల సర్భాంగ్‌, ‌గైలెగ్ఫగ్‌ ‌ప్రాంతాలు గుర్తించబడని ప్రాంతాలు నిర్వచించబడ్డాయి. భారతదేశం 1643 కిలోమీటర్ల ప్రాదేశిక సరిహద్దును మయాన్మార్‌ ‌తో పంచుకుంటుంది. భారతదేశంలోని మణిపూర్‌ ‌రాష్ట్రంలోని మోరే ప్రాంతంలో గల హోలెన్ఫాయ్‌ ‌గ్రామానికి సమీపంలో ఉన్న కబావ్‌ ‌లోయ మరియు మయన్మార్లోని సాగింగ్‌ ‌ప్రాంతానికి చెందిన తములోని నంఫలోంగ్‌ ‌గ్రామం మధ్య గల భూమి రెండు దేశాల మధ్య మైనరువివాదానికి కారణం.

ప్రాదేశిక వివాదాలు తరచుగా నదులు, సారవంతమైన వ్యవసాయ భూములు, ఖనిజ లేదా చమురు వనరులు వంటి సహజ వనరుల పంపిణిలో గల అసమానతల వలన ఉత్పన్నమవుతాయి., అయితే కొన్నిసార్లు ఈ వివాదాలను సంస్కృతి, మతం, జాతి జాతీయవాదం కూడా నడిపిస్తాయి. అసలు సరిహద్దును ఏర్పాటు చేసే ఒప్పందంలో గల అస్పష్టమైన అంశాలకు నిర్వచనలోపంతో ప్రాదేశిక వివాదాలు తరచుగా సంభవిస్తాయి. దురదృష్టవశాత్తు బ్రిటీష్‌ ఇం‌డియా పొరుగుదేశాలతో చేసుకున్న అనేక సరిహద్దు ఒప్పందాలలో దేశాల మధ్య గుర్తుల స్పష్ఠత లోపభూయిష్టంగా ఉండడంతో భారతదేశానికి సరిహద్దు వివాదాలు అనివార్యమవుతున్నాయి. ‘‘సభ్యులందరూ తమ అంతర్జాతీయ సంబంధాలలో ఏ దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతకు లేదా రాజకీయ స్వాతంత్రానికి వ్యతిరేకంగా లేదా ఐక్యరాజ్యసమితి యొక్క ఉద్దేశ్యాలకు విరుద్ధంగా ఏ విధమైన పద్ధతిలోనైనా బెదిరించడం లేదా ఉపయోగించడం నుండి దూరంగా ఉండాలి.’’ అని ఐక్యరాజ్యసమితి చార్టర్‌ ‌లో చెప్పిన మాటను అన్నిదేశాలు పాటిస్తే ఈ సరిహద్దు వివాదాలకు పరిష్కారం దొరికినట్టే.

jayaprakash ankam
జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply