Take a fresh look at your lifestyle.

స్వతంత్ర భారతంలో.. కట్టుబానిసలు..!

  • ఉపాధి కల్పిస్తామని నమ్మించి అమ్మేసిన బ్రోకర్లు
  • ధ్రువీకరణ పత్రాలు లాక్కున్న ఇటుక బట్టీల యజమానులు
  • ఒక కుటుంబానికి వారానికి ఇచ్చేది కేవలం రూ.500లే!
  • కట్టుబానిసలుగా మారిన తమను ఆదుకోవాలని కోరుతూ
  • దిల్లీ జంతర్‌మంతర్‌ ‌వద్ద 70 మంది ఆదివాసీల ఆక్రందన
  • సీఏఏతో వారిని వోటర్ల జాబితా నుంచి తొలగించే ప్రమాదం

‘‘పనిచేసేవాళ్ళు ఇకపై తింటారు.. దోచుకునేవాళ్ళు నాశనం అయిపోతారు.. కొత్త జమానా రానున్నది’’ అని బక్కచిక్కిన మనుషులు దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద నినదిస్తున్నారు. ‘‘మేం కట్టుబానిసలుగా మారాం..మమ్మల్ని ఆదుకునే వారెవరు’’ అని ఆక్రోశంతో వారు ప్రశ్నిస్తున్నారు. వీరు కేవలం 70 మంది కావటంతో మీడియాసంస్థలు వీరి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. భగత్‌సింగ్‌ ‌వంటి ఎందరో విప్లవకారులు, దేశభక్తులు పోరాడి ప్రాణాలు అర్పిస్తే వచ్చిన డెబ్బైమూడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ అభాగ్యులకు స్వాతంత్రం ఇంకా రాలేదు. దేశ రాజధానిలో వీరు అలమటిస్తున్నారు.. బానిసత్వం నుంచి విముక్తి కోసం.. ఈ 70 మంది కార్మికులు ఛత్తీస్‌గఢ్‌, ‌జాంజ్‌గిర్‌, ‌ఛాపా, రాయ్‌గఢ్‌ ‌జిల్లాలకు చెందిన ఆదివాసులు.. అక్కడ వ్యవసాయపనులపై ఆధారపడి బతికేవారు. అక్కడ పని దొరకక పోవడంతో, బయటి ఊరిలో పని ఇప్పిస్తామని చెప్పిన వారిని నమ్మారు. అయితే బ్రోకర్లు వారిని తీసుకువచ్చి జమ్మూలోని ఓ ఇటుక బట్టీ ఓనర్‌కు అమ్మేసారు. దాంతో వీరంతా కట్టు బానిసలు అయిపోయారు. ఇటుక బట్టి ఓనర్‌ ‌వీళ్ళని మనుషులుగా భావించక, మిషన్లుగా వాడుకుని తన బట్టీలలో పని అయిపోగానే ఇతర ఇటుక బట్టీ ఓనర్లకు అమ్మేసాడు.

Brokers who sell and believe in employment1

ఇలా పలుమార్లు వీరు అమ్మకానికి గురిఅయ్యారు. ఈ శ్రామికులు ఎక్కడికి పోకుండా బట్టీలలో బందీగా ఉంచేలా వీరి దగ్గర ఉండే ఆధార్‌, ‌వోటర్‌ ‌కార్డులు వంటి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను ఓనర్‌లు లాక్కున్నారు. దీంతో మెరుగైన ఉపాధి కోసం వెళ్ల లేక వారి దగ్గర కట్టుబానిసలు అయిపోయారు. యజయానులు వీరు బతికేందుకు ఈ కట్టు బానిసల కుటుంబానికి ఒక వారానికి మొత్తం కుటుంబానికి కేవలం రూ.500 మాత్రమే కూలీ కింద ఇచ్చేవారు. వీరు ప్రాణాలతో నిలిచివుండేందుకు కూడా ఆ డబ్బు సరిపోదు. చాలీచీవఆలీ చాలని తిండితో మాడిన కడుపులతో వారు అల్లాడుతున్నారు. తిరిగి తమ ఊరు వెళ్ళాలి అంటే వీరి చేతిలో చిల్లిగవ్వ లేదు. వీరు పారిపోకుండా వుండేలాగా వీరి ఐడి కార్డులు, ఇటుక బట్టీల ఓనర్లు లాక్కున్నారు.ఆదుకునేవారికోసం ఎదురు చూస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో వీరు ఉండగా వీరి గురించి వర్కింగ్‌ ‌ప్యూల్స్ ‌చార్టర్‌ అనే సంస్థకి తెలిసింది. ఆ సంస్థ వీరిని ఎలాగో వెట్టిచాకిరి నుంచి విడిపించింది.

Brokers who sell and believe in employment1

ఈ కట్టు బానిసల వర్తమానం ఇలా ఉంది. మరి వీరి పిల్లల భవితవ్యం ఏమిటి.. సీఏఏ తదితర పౌర చట్టాల వల్లఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. మీరెవరు అంటే వారిప్పుడు ఏం చెప్పాలి. ఏం రుజువులు చూపించ గలరు.. మళ్లీ తమ ఊరు వెళ్లడం ఎలాగో వారికి అర్థం కాటంలేదు. బట్టీల వారి నుంచి వీరిని కాపాడిన వర్కింగ్‌ ‌పీపుల్‌ ‌రిజిస్టర్‌ ‌కన్వీనర్‌ ‌నిర్మల్‌ ‌గరోనా ప్రజాతంత్రతో మాట్లాడుతూ.. ‘‘రేపు నేషనల్‌ ‌పాపులర్‌ ‌రిజిస్టర్‌ ‌లేదా నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్స్ ‌ప్రక్రియలో వీరు తాము భారతదేశ నాగరికులమని ఎలా నిరూపించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో వున్నారు. వీరిని భారతదేశ ప్రభుత్వం డిటెన్షన్‌ ‌సెంటర్లలో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు చేతిలో చిల్లిగవ్వ లేదు. పైగా వీరి ధ్రువీకరణ పత్రాలు మొత్తం జమ్మూలో ఉన్న ఇటుక బట్టీ ఓనర్ల దగ్గర ఉన్నాయి. వీరి ధ్రువీకరణ పత్రాలు వెనక్కి ఇచ్చినట్లయితే, ఆ ఇటుక బట్టి ఓనర్లు చేసినా దాష్టీకం బయట పడుతుంది.. అంచేత వారు వీరి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అవకాశమే లేదు’’ అని అన్నారు. 73 ఏండ్ల కశ్మీర్‌ ‌వంటి అంశాల్ని ఎన్నో చిటికలో పరిష్కరించామని గొప్పలు చెప్పుకునే పాలకులు వీరి దయనీయ స్థితి గురించి ఏం చెప్తారు..? వారిని ఎలా ఆదుకుంటారు…? అసలు వీరి గోడు ఏలినవారికి వినిపిస్తుందా..?

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy