Take a fresh look at your lifestyle.

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

తెలంగాణకే ప్రత్యేకమైన పండుగలలో బోనాల పండుగ  కూడా ఒకటి. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపు కుంటారు. జూలై లేదా ఆగస్టు  మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శన మిస్తాయి. గ్రామదేవతల పూజలకు ఉద్దేశిత మైనది, తెలుగు జానపదుల సాంసృతిక విభవానికి ఉత్తుంగ  శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెప్పే పండగ.  ప్రాచీన కాలంలో  ఋతువులు మారి, ఆషాడంలో వర్షాలు కురిసి, వాతావరణ మార్పులతో, కలరా ప్లేగు లాంటి మహమ్మారి వ్యాధులు సంక్రమించే క్రమంలో, వైద్య సౌకర్యాలు లేని స్థితిలో, దేవతలను కొలవడం జరిగేది. 1813 లో భాగ్యనగరంలో వేలాది మంది గురైన సందర్భంలో, మహంకాళిని కొలవడం వల్ల వ్యాధి తగ్గుముఖం పట్టిందని, అప్పటి నుండి రాష్ట్ర రాజధాని లోనూ, బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు వాడుక. గోల్కొండ కోటలో జగదాంబికా ఆలయంలో,  అబుల్‌ ‌హసన్‌ ‌తానీషా పాలనా సమయంలో, ప్రధాని సైనికాధికారులుగా ఉన్న అక్కన్న, మాదన్నల కాలంలో, బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు కథనాలు.
1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు, నిజాం మీర్‌ ‌మెహబూబ్‌ అలీ ఖాన్‌, ‌మంత్రి కిషన్‌ ‌ప్రసాద్‌ ‌ను, ఏమి చేయాలని సలహా కోరగా, ఇది అమ్మవారి ఆగ్రహం ఫలితమేనని, ఆమెను శాంతింప చేయడానికి, పూజలు నిర్వహించాలని మంత్రి, ప్రభువుకు వివరించిన సందర్భంలో, నిజాం ప్రభువు లాల్‌ ‌దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, సమర్పించి పూజలు నిర్వహించిన ఫలితంగా, వరదలు తగ్గుముఖం పట్టాయని చెబుతారు. తర్వాత కాలంలో, స్థానికులు సదరు ఆలయాన్ని పునరుద్ధరించి, 1968లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులచే, విగ్రహ ప్రతిష్ట చేయించడం జరిగింది. 7వ నిజాం కాలం నుండి, సికింద్రాబాద్‌ ‌మహంకాళి అమ్మవారి ఆలయం లో, బోనాల ఉత్సవాలు జరుగు తున్నాయి. హైదరాబాద్‌ ‌లో ప్రస్తుతం వందలాది చిన్న, పెద్ద ఆలయాలలో ఉత్సవాలు కొనసాగు తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ అనంతరం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ అనుసరణీయమైన  పండగైన బోనాలను, ‘‘రాష్ట్ర పండుగ’’గా నిర్వహిస్తున్నారు. ‘‘భోజనం’’ ప్రకృతి కాగా ‘‘బోనం’’ వికృతి. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే ‘‘నివేదనలే బోనాలు’’. పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, అంకాలమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నాయకమ్మ, మొదలైన పేర్లతో పిలిచే దేవతల గుళ్ళను, ఈ సందర్భంగా దేదీప్య మానంగా అలంకరిస్తారు. బోనాన్ని కొత్త కుండలో వండి, దానితోపాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్ని చోట్ల ఉల్లిపాయలతో కలిపిన బోనాన్ని, మట్టి లేక రాగి కుండలో నుంచి తమ తలపై ఉంచుకొని, ఆటగాళ్ళతో, డప్పుల తదితర వాద్యాలతో, గుడికి చేరుకుంటారు. ఈ బోనాల కుండలను, చిన్న చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక తడి తెల్ల ముగ్గుతో, అలంకారం చేసి, దానిపై దీపాన్ని ఉంచుతారు. ఆషాడమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని గ్రామీణుల విశ్వాసం.
image.png
అందుకే తమ కూతురు తమ సొంత ఇంటికి లేదా ఆమె పుట్టింటికి వచ్చిన భావనతో ప్రేమానురాగాలు, పుట్టి పడగా, భక్తిశ్రద్ధలను మేళవించి, బోనాలను నివేదిస్తారు. గత కొంత కాలంలో వేరు వేరు ప్రాంతాలలో దీనిని ‘‘పెద్ద పండగ’’, ‘‘ఊర పండగ’’  లాంటి పేర్లతో పిలిచేవారు. తర్వాతి కాలాన బోనాలుగా పిలుస్తున్నారు. పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలేందుకు, ఆలయ ప్రాంగణం బలి ఇవ్వడం జరిగేది. నేడు యాటల పేరున మేకలను లేదా కోడిపుంజులను బలి ఇవ్వడం ఆచారమైంది. పండుగ సందర్భంగా, స్త్రీలు కొత్త బట్టలు, పట్టు చీరలు, నగలు ధరించి, బోనాలు మోస్తూ వెళుతుండగా, మోసుకెళ్తున్న కొందరికి పూనకం (అమ్మవారు ఆ వహిస్తారని నమ్మక) రాగా, వారిని శాంతింప చేసేందుకు, ఆలయ సమీపాన వారి పాదాలపై నీళ్ళు కుమ్మరిస్తారు. అమ్మవారి ఇ సోదరుడైన పోతరాజును, ప్రతిబింబించే ఒక బలిష్ట కాయుడు, ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాళ్ళకు గజ్జలు కలిగి, చిన్న ధోవతి ధరించి, వాద్య ధ్వనులకు అనుగుణంగా నర్తిస్తాడు. పూజారంభకునిగా, భక్త జన రక్షకునిగా భావించ బడతాడు. కొరడాలతో కొట్టుకుంటూ, వేపాకులను చుట్టుకుని, పూనకం వచ్చిన భక్తులను, అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తాడు. అమ్మవారికి నివేదన అనంతరం విందు భోజనాలు ఆరగిస్తారు. ఈ కార్యక్రమంలో జాతర అనంతరం, పోతరాజుకూ పూనకం రాగా, వికృతమైన ఆగ్రహాన్ని శాంత పరచుటకు, కొమ్ములున్న మేకపోతును అందించగా, పోతరాజు తన దంతాలతో, మేక తల మొండెం వేరు చేసి, పైకి ఎగరవేస్తారు. పండుగ మొదటి రోజు నుండి, చివరి నిమజ్జనం దాకా, అత్యంత భక్తి తత్పరతతో వాతావరణం ఉంటుంది. బోనాల సమర్పణ వల్ల, ప్రధానంగా దేవతలు శాంతించి, అంటురోగాల బారిన పడకుండా కాపాడుతానని భక్తుల విశ్వాసం. వానాకాలంలో కలరా, మలేరియా వంటి ప్రమాదకరమైన అంటు వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి.  సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు.  వానాకాలంలో మహిళలకు అరి కాళ్ళకు అంటు వ్యాధులు సోకకుండా పసుపు పెట్టుకుంటారు.

image.png

తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బోనాల ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 30న గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించడంతో ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు జరపనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రతి గురు, ఆదివారం బోనాల సమర్పణ, పూజలు జరుగుతాయి. గోల్కొండ ఆలయంలో నిర్వహించే బోనాల సందర్భంగా నగర వ్యాప్తంగా ప్రజలు అమ్మవారి దర్శనం కోసం రావడంతో పాటు బోనాలు సమర్పిస్తారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply