తనిఖీ అనంతరం ఫేక్ కాల్‌గా గుర్తింపు
ముంబై, జనవరి 11 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన బాంద్రా కుర్లా ప్రాంతంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఆగంతకుడు పాఠశాల ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేశాడు. పాఠశాలలో టైం బాంబు పెట్టామని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. దీంతో పాఠశాల యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. అప్రమత్తమైన పోలీసులు పాఠశాలలో తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు కనిపించలేదు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ ఆధారంగా ఆగంతకుడిని విక్రమ్ సింగ్‌గా గుర్తించామని..
త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. కాగా, గతంలోనూ అంబానీ కుటుంబానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. 2020లో ముంబయిలోని అంబానీ ఇంటి సపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ కారు నిలిపిఉంచడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మరో ఘటన.. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్ ఆసుపత్రికి గతేడాది అక్టోబర్‌లో ఫోన్ చేసిన గుర్తు తెలియని ఆగంతకుడు అంబానీ కుటుంబాన్ని బెదిరించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా ఇప్పుడు అంబానీ పాఠశాలకు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.