బూత్ ప్రెసిడెంట్ సహా మరొకరు మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీకి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్ కుమార్‌తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం ఆ ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు.
ఈ తరుణంలో బాంబు పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. టీఎంసీ నేతలు రాజ్‌కుమార్ మన్నా ఇంట్లో భేటీ అయిన సమయంలో దుండగులు బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.