Take a fresh look at your lifestyle.

పిల్లల పండుగ… బొడ్డెమ్మ ప్రాధాన్యత

సృష్టిలో ప్రతీ జీవిది బ్రతుకు పోరాటమే, బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉండి, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ బతుకమ్మ. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసి వారి హృదయాన్ని ఆవిష్కరింప జేసే పండుగ. బతుకమ్మ పండుగ గురించి అందరికీ సుపరిచితమే కానీ బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ పండుగను చేయడం పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం.
పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డేమ్మను పూజిస్తారు. సుమంగళి సౌభాగ్యం కోరుకునే ముత్తయిదువలు పేర్చి జరుపుకునే పూర్తిస్థాయి మహిళల పండుగ బతుకమ్మ. ఇక గౌరీ దేవియే బొడ్డెమ్మగా అవతరించి సకల ప్రాణులకు సంతోషాన్నిచ్చి బాలలకు ఉత్తేజాన్ని నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఒకదాని వెంట ఒకటి జరుపుకునేవే, ఒక దానికి ఒకటి సంబంధం ఉన్న పండుగలు. రెండు గౌరీదేవి రూపాలే, రెండు పండగల్లో పాటలు ఒకే విధంగా ఉంటాయి. బొడ్డెమ్మ పిల్లల పండగ అయితే బతుకమ్మ పెద్దల పండుగ. ఈ పండుగను వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే చతుర్దశి వరకు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటాం. ఒకే రోజున రెండు తిథులు రావడంతో పండుగలకు, ఉత్సవాలకు, వేడుకలకు, సూర్యోదయం వేళ ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటాం.
మన తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి నాటికి మెట్ట పంటలన్నీ(పప్పు ధాన్యాలు) ఇండ్లకు చేరుతాయి. ధాన్య లక్ష్మి ఇంట్లో కళకళలాడుతుంది. రాబోయే బతుకమ్మ పండుగకు ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టడంలో పెద్దలు నిమగ్నమై ఉంటారు. వారికి బొడ్డెమ్మను ఆడే తీరిక ఉండదు. ఉత్సాహం ఆపుకోలేని పిల్లలు బొడ్డెమ్మను చేసి పూలతో అలంకరించి చప్పట్లు కొడుతూ కోలాటాలు వేస్తూ ఆడుకుంటారు. అందుకే ముందు బొడ్డెమ్మను ఆ తర్వాత బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆచారంగా మారింది. బొడ్డెమ్మ అంటే బొట్టే, బొడప బొటీమ, పొట్టి అని అర్థాలు ఉన్నాయి. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్నదని అర్థం. బొడ్డెమ్మ అంటే ధాన్యపు రాశి, ధాన్యపు కుప్ప అని కూడా అనుకోవచ్చు.
పిల్లలందరూ పొద్దున్నే సుచిగా శుభ్రంగా తయారై పాలు, నీళ్లు, పసుపు, కుంకుమ పూలు తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్లి భక్తితో పూజలు చేసి పాలు నీళ్లు చల్లి, పసుపు కుంకుమలు సమర్పించి పూలతో అలంకరించి, పుట్టకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పుట్టమన్ను తవ్వుకొని తీసుకొస్తారు. ఒక చెక్క పీటపై మూడు, ఐదు, లేదా తొమ్మిది దొంతరలు(మెట్లు) గా బొడ్డెమ్మను తయారుచేసి ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోరంట, ఉద్రాక్ష, కట్ల, కాకర, బీర, బంతి, జాజి, గన్నేరు పూలతో అలంకరించి పైన శిఖర ప్రదేశంలో బియ్యంతో నిండిన కలశాన్ని పెట్టి కొత్త రవిక బట్టను దానిపై ఉంచి తమలపాకులు, పసుపు గౌరమ్మను పెడతారు. నేలపైన అలికి ముగ్గులు పెట్టి బొడ్డెమ్మ పీటను తెచ్చి ఆ ముగ్గుపై ఉంచి ప్రతిరోజు పిడికెడు బియ్యాన్ని తెచ్చి కలశంలో పోసి తెచ్చిన పసుపు కుంకుమలను వేసి పూలతో బొడ్డెమ్మల అలంకరించి పిల్లలందరూ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తి శ్రద్ధలతో బొడ్డెమ్మ పేరుతో పిలవబడే గౌరమ్మకు పూజలు చేస్తారు.
బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్‌ -‌బిడ్డాలెందరూ కోల్‌
‌నీ బిడ్డ నీల గౌరు కోల్‌ -‌నిత్య మల్లె చెట్టేసి కోల్‌
‌నిత్యమల్లె చెట్టూకు కోల్‌ -‌నిత్యా నీళ్లు బోసి కోల్‌
‌కాయల్లు పిందెల్లు కోల్‌ – ‌ఘనమైన కాతా కోల్‌
‌కాయలన్నీ దెంపి కోల్‌ -‌బండ్లాకెత్తంగా కోల్‌
‌పోయేనే ఆ బండి కోల్‌ – ‌యాదగిరి దాకా కోల్‌
‌యాదగిరి నరసన్న కోల్‌ – ‌పండ్లోయి పండ్లు కోల్‌
ఏం ‌పండ్లో గానీ కోల్‌  – ఎం‌తో ఘుమఘుమా కోల్‌
‌చూసేటోరేగాని కోల్‌   – ‌కొనేటూరు లేరు కోల్‌
ఆ ‌నుంచి ఆ బండి కోల్‌-ఐలోని దాకా కోల్‌
ఐలోని మల్లన్న కోల్‌-‌పండ్లోయి పండ్లు కోల్‌…..
అం‌టూ పాట ఇలా సాగిపోతుంది. బొడ్డెమ్మ బిడ్డ పేరు నీలగౌరు, ఆమె నిత్య మల్లె చెట్టు పెట్టి నిత్యం నీళ్లు పోసేదట. చెట్లు పెరిగి కాయలు, పండ్లు ఘనంగా కాసిందట. ఆ పండ్లన్నీ తెంపి యాదగిరి నరసన్నకు, ఐలోని మల్లన్నకు, వేములాడ రాజన్నకు, భద్రాచలం రామన్నకు, కొమ్మాల నరసింహ స్వామికి పంపించగా ఎవరు స్వీరించలేదట. చివరకు వరంగల్‌ ‌భద్రకాళీ మాత తీసుకుందని… వరంగల్‌ ‌జిల్లాలో పాడుకుంటాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ  పుణ్యక్షేత్రాలను తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పాడుకుంటాం. రామాయణ, భారత, భాగవత ఘట్టాలు, శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణ ఘట్టాలకు సంబంధించిన కథలను, మరియు చారిత్రక మహిళల జీవిత చరిత్రలను పాటల రూపంలో జనపదులు జానపదాలు పాడుతూ భక్తితో వేడుతూ చేసుకునే పండగ బొడ్డెమ్మ. ప్రతిరోజు ప్రసాదాలుగా అటుకులు బెల్లం, కొబ్బరి, నువ్వులు బెల్లం, పప్పు బెల్లం అమ్మవారికి సమర్పించి  పంచుకుంటారు.
ఇలా తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించి చతుర్దశి నాడు సాయంత్రం యథావిధిగా బొడ్డెమ్మను పూజించి ప్రతిరోజు తలా పిడికెడు తెచ్చి కలశంలో పోసిన బియ్యంతో ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరూ కూడా ప్రసాదం తీసుకొని బొడ్డెమ్మ పీఠాన్ని నెత్తిన పెట్టుకొని చెరువు దగ్గరికి తీసుకెళ్లి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. అనంతరం పసుపు గౌరమ్మను పిల్లలకు గంధం, బొట్టు లేదా చెంపలకు పూస్తారు. పెద్దలైతే మంగళ సూత్రాలకు ధరిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ పండుగ ద్వారా పిల్లల్లో కలివిడితనం స్నేహపూరిత వాతావరణం అలవడుతుంది. వాళ్లలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి చక్కని ఆలోచనను మానసికోల్లాసాన్ని పెంపొందించడానికి బొడ్డెమ్మ పండుగ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.
image.png
కొమ్మాల సంధ్య,   తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల, తాడ్వాయి, 9154068272.

Leave a Reply