ఆశల పూదోటలు లేవు…
కలల సాక్షాత్కాల్లేవు…
మనసున విషాద తిమిరాలు
కంటి నిండా కన్నీటి సంద్రాలు
వేకువ పొద్దుల్లేవు…
వెన్నెల వెలుగుల్లేవు…
దారి పొడవునా ఇక్కట్ల చీకట్లు
గుండెల నిండా వేదనల కుంపట్లు
నవ వసంత రాగాల్లేవు….
భవ్య జీవన సమీరాల్లేవు…
గొంతు నిండా విషాద రాగాలు
బతుకంతా బాధల సుడిగుండాలు
పంచ భక్ష పరమన్నాల్లేవు…
పట్టు పరుపుల సుఖనిద్రల్లేవు….
కడుపుల రగిలే ఆకలి నెగళ్ళు
తనువు నిండా నెత్తుటి గాయాలు
ప్రగతి సోపానాల్లేవు
పాలకుల పట్టింపుల్లేవు
దరిద్రానికి దగ్గరి బందువులం
దిక్కు మొక్కులేని నిరుపేదలం
తరాలెన్ని మారినా…
మా ‘‘తల’’ రాతలు మారలే
కాలాలెన్ని గడిచినా…
మా ‘‘బతుకు’ పూలు పూయలే
ఇప్పటికైనా మేం మారాల్సిందే
భవిష్యత్ తరాల కోసమైనా….
తెగువతనం పొదుపు కోవాల్సిందే
ప్రశ్నించు తత్వం అలవర్చుకోవాల్సిందే
మొత్తంగా….
మమ్ము మేం సంస్కరించుకోవాల్సిందే.
(ప్రగతి వెలుగుల్లేని చీకటి బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తూ… )
– కోడిగూటి తిరుపతి
9573929493