Take a fresh look at your lifestyle.

దడ పుట్టిస్తున్న బ్లాక్‌ ‌ఫంగస్‌..!

‌భారతదేశంలో ఒక వైపు కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌రోజురోజుకు విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కొరోనా సోకితే కాటికే అన్నట్లుగా ప్రజల్లో భయం ఆవరించింది. ఏ కాస్తా అనుమానం ఉన్నా పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోమని ఒక పక్క బాకా ఊదుతున్న ప్రభుత్వాలు, అందుకు కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చేయలేకపోతున్నారు. ఇన్ని వేల మరణాలు జరుగుతున్నా నేటికీ కనీసం పరీక్షలు చేయించుకునే పరిస్థితి లేదు. రోజూ వేల సంఖ్యలో జనం బారులు తీరి నిలబడి తమ వంతు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇక దవాఖానా లో చేరిన వారి స్థితి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో మంది సన్నిహితులను కోల్పోయామని తాజాగా చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ముందుగానే స్పందించి ఉంటే దేశం ఇంత దారుణ పరిస్థితిని ఎదుర్కొనేది కాదంటున్నారు.

శాస్త్రవేత్తలు. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌ఫస్ట్ ‌వేవ్‌ ‌కన్నా చాలా దారుణంగా ఉంటుందని చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ అందుకు రంగం సిద్దం చేసుకోకపోవడం వల్లే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయంటున్నారు. ఇప్పుడు థర్డ్ ‌వేవ్‌ ‌కూడా తప్పదంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇంకా మనం కొత్త హాస్పిటల్స్ ‌ప్రారంభించాలన్న ఆలోచనలోనే ఉన్నామంటే పాలకుల్లో ఎంత జాడ్యం ఆవరించిందన్నది స్పష్టమవుతున్నది. ఇదిలా ఉంటే కొరోనా కన్నా మరింత ప్రమాదకరమైన బ్లాక్‌ ‌ఫంగస్‌ (‌మ్యూకోర్‌మైసిస్‌ – ‌జైకో మైకోసిస్‌) ఒకటి దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుండడం దేశ ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ ఫంగస్‌ ‌సోకినట్లు ప్రాధమిక దశలో గుర్తించలేకపోతే ఇక అంతే సంగతులు. కొరోనా లాగానే ఈ ఫంగస్‌ ‌మహారాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. గుజరాత్‌, ‌డిల్లీ, కర్నాటకలో ఫంగస్‌కు గురైనవారి సంఖ్య పెరిగిపోతున్నది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ వ్యాది వ్యాప్తి జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రను ఆనుకుని ఉన్న జిల్లాల్లో దీని వ్యాప్తి జరిగినట్లు ఇటీవల కనుగొన్నారు. ఇటీవల భైంసాలో బ్లాక్‌ ‌ఫంగస్‌కు గురైన వారిని అయిదుగురిని గుర్తించగా అందులో ఇద్దరు ఇప్పటికే మృత్యువాత పడగా, మిగిలిన ముగ్గురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ముంబాయిలో ఈ వ్యాధి బారిన పడి ఇంతవరకు 52 మంది మృతి చెందగా, సుమారుగా మరో పదిహేను వందలమంది చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే కోలుకుంటున్న వారిలో కొందరి అవయవాల తొలగింపు అనివార్యమవు తున్నదంటున్నారు. ఆ విధంగా ముంబాయిలో పదకొండు మందికి కన్ను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి హాస్పిటల్‌ ‌లో ఈ వ్యాధి సోకిన పదకొండు మంది కంటి చికిత్సలు పొందుతున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యాధి ఏ భాగంలో ఎక్కువ సోకితే ఆ అవయవాన్ని తొలగించక తప్పదట. ఎముకలను కూడా తినేస్తుందట. చివరకు బ్రేయిన్‌కూడా దెబ్బతినే అవకాశాలున్నాయట . అయితే ఇది కొత్త వ్యాధి మాత్రం కాదని, గతంలో కొందరు ఈ వ్యాధి బారిన పడ్డారని, కాగా, ఇటీవల కాలంలోనే ఈ పేషంట్ల సంఖ్య పెరుగుతున్నదంటున్నారు వైద్యులు.

తొలిదశలో గాంధీ హాస్పిటల్‌ లో ఈ వ్యాధితో బాధపడుతున్న పదిమందిని గుర్తించినట్లు కూడా వైద్యులు చెబుతున్నారు. వాస్తవంగా మనుషులకు చాలా అరుదుగా సోకే ఈ వ్యాధి , ఇప్పుడు కొరోనా వైరస్‌ ‌బారినపడి కోలుకున్నవారిలో త్వరగా అంటుకుంటున్నట్లు డాక్టర్లు గుర్తిస్తున్నారు. కొరోనా వ్యాధి చికిత్సలో బాగంగా స్టెరయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఇమ్యూనిటి తగ్గిన వాళ్ళలో, కోవిడ్‌ ‌పేషంట్లలో డయాబెటిక్‌ ఉన్నవారు సరైన అంటీబయాటిక్‌ ‌తీసుకోకపోయినవారిలో, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, రోగ కారక క్రిములతో పోరాడే శక్తి లోపించినవారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు వారు చెబుతున్నారు. గాలినుండి ముక్కుద్వారా లేదా శరీర గాయాలద్వారా ఊపిరి తిత్తుల్లోకి చేరుకుంటుందంటున్న ఫంగస్‌ ‌వల్ల యాభై శాతం మరణాలున్నట్లు చెబుతున్నారు. కళ్ళు, ముక్కు ఎరుపెక్కడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం, రక్తపు వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొరోనా నుంచి చికిత్స పొందినవారు రక్తంలోని చక్కర స్థాయిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలని, ముధుమేహం నియంత్రణలో ఉండేట్లు చూసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ‌ప్రజలకు పలు సూచనలు చేస్లున్నారు. కొరోనా లక్షణాల వలె, బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌లక్షణాలను కూడా ముందస్తుగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Leave a Reply