- తోపులాటలో బిజెవైఎం నేత భానుప్రకాశ్‌కు గాయాలు
- హాసిటల్‌కి తరలించి చికిత్స…పోలీసులపై మండిపడ్డ బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28 : ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌కు గాయాలయ్యాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలిపి న్యాయం చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ముట్టడికి వొచ్చిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదిలావుంటే డీజీపీ కార్యాలయం ముట్టడిలో బీజేవైఎం నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించిన ఆయన కేసీఆర్ సర్కారుకు పోయే కాలం వొచ్చిందని అన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వారి పట్ల పోలీసులు రాక్షసంగా వ్యవహించారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే పోలీసుల కారణంగా తీవ్రంగా గాయపడ్డ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్‌కు ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్‌కు విషయం తెలియడంతో ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించడం చేతగాని కేసీఆర్..సర్కారును ప్రశ్నించే వాళ్లను అణిచి వేయడానికి ప్రయత్నిస్తున్నారని బండి మండిపడ్డారు. కేసీఆర్‌కు నిరుద్యోగుల ఉసురు తగులుతుందని అన్నారు.