- పంజాబ్‌లో ఆప్ పాగా..పూర్తిగా ఢీలా పడ్డ అధికారంలో ఉన్న కాంగ్రెస్
- మూడు రాష్ట్రాలలో బిజెపికి స్పష్టమైన ఆధిక్యం…
- గోవాలోనూ మెజారిటీకి ఒక్క సీటు తక్కువగా
- యూపిలో 129 సీట్లతో రెండవ స్థానంలో ఎస్‌పి, దాదాపుగా తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్, బిఎస్పీ
న్యూ దిల్లీ, మార్చి 10 : అనుకున్నట్లే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో మరోసారి బీజేపీ కాషాయ సెండా రెపరెపలాడింది. ఇక పంజాబ్‌లో ఆప్ 92 సీట్ల భారీ మెజారిటీని సాధించి రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రానున్న మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక గోవాలో 20 సీట్లు సాధించి మెజారిటీకి కేవలం ఒక్క సీటుకు దూరంగా బిజెపి నిలిచింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
యూపీలో నాలుగు దశాబ్దాల్లో రెండవసారి అధికారాన్ని నిలబెట్టుకున్న పార్టీగా బిజెపి రికార్డు
యూపిలో దాదాపు 269 సీట్లు గెలిచి బిజెపి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇకపోతే ఎస్పీ 129 సీట్లు సాధించి రెండోస్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లలో మాత్రమే గెలుపొందింది. గతంలో పాలన చేసిన బిఎస్పీ కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది. ఈ ఫలితాలతో మరోమారు యోగి ఆదిత్యనాథ్ యూపిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. 2017 మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తనకు ఎదురులేదని నిరూపించింది. ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షాల వ్యూహా రచన మరోసారి ఫలించింది.
ఈ విజయంలో వారిదే కీలక భూమిక. ఇక..తాజాగా వెలువడిన యూపీ ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో బిజెపి చరిత్ర సృష్టించింది. 40 ఏళ్ల తరవాత వరుసగా రెండోసారి అధికారంలోకి వొచ్చిన పార్టీగా బిజెపి చరిత్ర సృష్టించింది. ఎంఐఎం వోటింగ్ శాతం..ఎస్పీపై ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. గతంలో ప్రతిపక్షం ఎప్పుడూ 50 సీట్ల కంటే ఎక్కువ గెలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇక నాలుగుసార్లు యూపీని పాలించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. కనీస ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం పరిస్థితి ఘోరంగా కనిపిస్తుంది.