- సాగర్ ఎన్నికల్లో బిజెపిదే విజయం
- పిఆర్సీ ప్రకటన ఓ పెద్ద డ్రామా అన్న సంజయ్
అయోధ్య విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం పీఠాలు కదులుతున్నాయని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పారు. నాగార్జునసాగర్ అభ్యర్థి ఎవరైనా బీజేపీదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సాగర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ తమతోనే పోటీ అంటున్నాయని తెలిపారు. బీజేపీకి భయపడే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. హుజూర్నగర్ విషయాన్ని వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. గిరిజనుల కోసం దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమన్నారు. పీఆర్సీ పెద్ద డ్రామా.. పాల ప్యాకెట్లు సిద్ధం చేసుకున్నాక పీఆర్సీ ప్రకటిస్తారని విమర్శించారు. పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిని మార్చేదిలేదని బండి సంజయ్ ప్రకటించారు.
స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యోగులను కేసీఆర్ అవమానించారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. 7.5 శాతం ఫిట్మెంట్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సీఎం ఉద్యోగులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. వారికి న్యాయంగా రావాల్సిన పిఆర్సీ కోసం ముందుంటామని అన్నారు. ఉద్యోగులు కూడా తమ డిమాండ్ల సాధనకు ఉద్యమించాలన్నారు.తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యోగులతో కేసీఆర్ ఆడుకుంటున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని 7.5శాతం రికమండ్ చేయటం దుర్మార్గమన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులు ఆర్థిక మంత్రులు కావటం కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు. కేటీఆర్, హరీష్‌లను విఫల మంత్రులుగా చూపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్ల చైర్మన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.