Take a fresh look at your lifestyle.

దుబ్బాకలో దుమ్ములేపిన బిజెపి

రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లోకూడా ఇలాంటి అసంతృప్తి ఉన్నప్పటికీ దుబ్బాకలో తాజాగా ఎన్నికలు రావడంతో అక్కడి ప్రజలు తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో వెళ్ళగక్కారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.  ఉప ఎన్నిక తేదీని ప్రకటించినప్పటినుండి కేవలం రాష్ట్ర ప్రజలేకాకుండా రాజకీయ విశ్లేషకులుకూడా  ఇక్కడి ఎన్నికలపైన ఆసక్తిని ప్రదర్శిస్తూవచ్చారు. ప్రధానంగా అధికారపార్టీ ఈ ఎన్నికల్లో తన అధికార దర్పాన్ని ప్రదర్శించడమే దాని ఓటమికి కారణంగామారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దుబ్బాకలో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా ఉప ఎన్నిక ఫలితాలు అధికారపార్టీకే అనుకూలంగా ఉంటాయన్నది సహజం. కాని, ఇక్కడ అనూహ్యంగా బిజెపి నెగ్గడమన్నది ముందు ముందు రాష్ట్రంలో జరుగబోయే ఇతర ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. సమీపంలోనే ఉన్న గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ఎన్నికల్లో దీని ప్రభావం తప్పకుండా ఉండకపోదు. జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో కాషాయ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా చాలా ముందునుండే రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలోనే దుబ్బాక ఎన్నికలు బిజెపికి కలిసివచ్చినట్లు అయింది. గ్రేటర్‌లో ఈ విజయాన్నే ప్రచారాస్త్రంగా బిజెపి వాడుకునే అవకాశమేర్పడింది. ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరున్న రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఎన్నికల నిర్వహణను తన భుజాలపై వేసుకున్నాడంటేనే విజయం తప్పనిసరి అన్నది తెరాస వర్గాలకు అపార నమ్మకం. అలాంటిది దుబ్బాక నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకున్న చీకోడు గ్రామంలో కూడా బిజెపి ఆధిక్యతను సాధించుకుందంటే అధికార పార్టీపట్ల ప్రజల అభిప్రాయమేంటన్నది స్పష్టంగా కనిపిస్తోంది. విచిత్రకర విషయమేమంటే టిఆర్‌ఎస్‌పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌కు పక్కనున్నదే దుబ్బాక నియోజకవర్గం, అంతేకాకుండా కెసిఆర్‌ ‌కుమారుడు, రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటతో పాటు మరో సీనియర్‌ ‌నాయకురాలు పద్మా దేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ ‌నియోజకవర్గాలన్నీ దుబ్బాకను ఆనుకుని ఉన్న నియోజకవర్గాలైనప్పటికీ భారతీయ జనతాపార్టీ ఇక్కడ విజయం సాధించిందంటే ప్రజలకు పాలకపార్టీ పట్ల వ్యతిరేకత ఏమేరకున్నదన్నది స్పష్టమవుతోంది. పైన చెప్పిన ప్రధాన నాయకుల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినంతగా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందలేదన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అసంతృప్తి ఉన్నప్పటికీ దుబ్బాకలో తాజాగా ఎన్నికలు రావడంతో అక్కడి ప్రజలు తమ అసంతృప్తిని వోట్ల రూపంలో వెళ్ళగక్కారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

ఉప ఎన్నిక తేదీని ప్రకటించినప్పటి నుండి కేవలం రాష్ట్ర ప్రజలే కాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా ఇక్కడి ఎన్నికలపైన ఆసక్తిని ప్రదర్శిస్తూ వొచ్చారు. ప్రధానంగా అధికారపార్టీ ఈ ఎన్నికల్లో తన అధికార దర్పాన్ని ప్రదర్శించడమే దాని ఓటమికి కారణంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం పోలీసుబలగాలను తనకు అనుకూలంగా వినియోగించుకోవడం, పోటీదారుల ఇండ్లలో సోదాలు చేయించడం, వాహనాలు తనఖీ చేయించడం, విచ్చలవిడిగా డబ్బులు గుమ్మరించడం లాంటి చర్యలు అధికార పార్టీపట్ల ప్రజల్లో మరింత వ్యతిరేకతకు కారణంగా మారింది. వాస్తవంగా గత ఎన్నికల్లో ఈ స్థానంలో గెలిచి మృతిచెందిన దివంగత సోలిపేట రామలింగారెడ్డి తీరుపై తెరాస ప్రచారం చేసినంతగా నియోకవర్గ ప్రజలు సంతృప్తిగా లేకపోవడం కూడా టిఆర్‌ఎస్‌ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ కన్నా బిజెపియే తమకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించిన తెరాస, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునంధన్‌రావు బంధువుల ఇండ్లలో సోదాలుచేయించి, పెద్దమొత్తంలో డబ్బును పట్టుకున్నట్లు చేసిన ప్రచారం ఆ పార్టీకే శాపంగా మారింది.

ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, దాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకోవడంతోపాటు కేంద్రం నుండి రాష్ట్రానికి సంక్రమిస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కొంతకాలంగా బిజెపి చేస్తూ వొస్తున్న ఎదురు దాడి ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసి వొచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలాడుతోందని, కేంద్రం నుండి వొచ్చిన నిధుల లెక్కలను దాచిపెట్టడం, తప్పుడు లెక్కలు చెబుతోందన్న విషయాన్ని స్థానిక బిజెపి నాయకులు  కొంతకాలంగా ప్రజలదృష్టికి తీసుకురావడం ఫలితాన్నిచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే  ఈ ఎన్నికల్లో  మూడవ స్థానానికే పరిమితమైనప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన ప్రచారం కూడా బిజెపి విజయానికి పరోక్షంగా తోడ్పడింది. ఆరేళ్ళ టిఆర్‌ఎస్‌ ‌పాలనలో అదిగో ఇదిగో అని జరుపుకు రావడమేగాని గతంలో ఇచ్చిన హామీల మేరకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌లైతేనేమీ, రైతులకు గిట్టుబాటు ధర విషయంలోనైతేనేమీ, యువతకు ఉపాధి అవకాశాల విషయంలోనైతేనేమీ, ఇతర అభివృద్ధి కార్యక్రమా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్న సందేశం ప్రజల్లోకి చొచ్చుకుపోయిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా పంటల మార్పిడిని ప్రకటించి, సన్నబియ్యమే వేయాలంటూ ఆదేశించిన కెసిఆర్‌ ‌వాటిని కొనుగోలు చేసే విషయంలో యంత్రాంగాన్ని సిద్ధం చేయకపోవడంకూడా ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిష్టానికి అనుకూల నిర్ణయాలను తీసుకోనట్లైతే, 2023లో తెలంగాణపై కాషాయ జెండాను ఎగురవేసేందుకు దుబ్బాక తమకు స్ఫూర్తినిచ్చిందని చెబుతున్న బిజెపి సీనియర్‌ ‌నాయకుల మాటలు నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు.

మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్

Leave a Reply