Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌కు ఎంఐఎంను బిజెపి దూరం చేయగలుగుతుందా?

గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న వాతావరణం జనరల్‌ ఎన్నికలను తలపిస్తున్నాయి. స్థానిక సమస్యలు, వాటి నివారణపైన కాకుండా దేశ రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న పార్టీలేవైన కౌంటర్‌ అటాక్‌ ‌చేస్తూ నగర ప్రజల్లో వేడిని రగిలిస్తున్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగా ఇప్పటికే భారతీయ జనతాపార్టీ, ఎంఐఎం పార్టీ నాయకులపైన రాష్ట్ర పోలీసులు సుమోటో కేసులు నమోదుచేశారు కూడా. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నప్పటికీ ముఖ్యంగా నాలుగు పార్టీల మధ్యే పోటీ కొనసాగబోతోంది. ఇంతవరకు రాష్ట్ర రాజకీయాల్లో రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు తోసి బిజెపి ఆ స్థానాన్ని అక్రమించనున్నట్లు ఇక్కడ జరుగుతున్న ఎన్నికల వాతావరణంలో కనిపిస్తున్నది. అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కూడా ఇంతకాలం తనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అని చెప్పుకుంటూ వొచ్చింది. అయితే దుబ్బాక ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్‌ ‌తనకు ప్రధాన పోటీదారు బిజెపి అని చెప్పడంలోనే కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టినట్లైంది.

ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ప్రధానంగా టిఆర్‌ఎస్‌తో పాటు, ఎంఐఎంను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్‌ ‌స్థానం మరింత దిగజారుతున్నట్లు స్పష్టమవుతోంది. జిహెచ్‌ఎం‌సి మీద కాషాయ జెండా ఎగురేస్తామని ఘంటాపథంగా చెబుతున్న బిజెపి ఆమేరకు విశ్వప్రయత్నం చేస్తోంది. పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఏపితోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్య నాయకులందరితో ఈ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టిఆర్‌ఎస్‌ ‌విమర్శిస్తున్నట్లు గల్లి ఎన్నికలకు ఢిల్లీ నాయకులను తీసుకువొస్తున్నారు. ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, వివిధ ఎన్నికల్లో తమ పార్టీవారిని ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవడంలో విశేషంగా కృషిచేసిన రాజస్థాన్‌ ఎం‌పి భూపేంద్రయాదవ్‌ ‌లాంటి వారిని ఇక్కడ తమ అభ్యర్థుల గెలుపుకోసం ప్రత్యేకంగా తెచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇప్పటికే ఇక్కడ ర్యాలీలతో హల్‌చల్‌ ‌చేస్తున్నారు. ఈ ఎన్నికలతో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పతనమైపోతుందంటూ ఆయన జోష్యం చెబుతున్నారు.

Battle is between BJP MIM not TRS

ఆ పార్టీ ఫైర్‌‌బ్రాండ్‌ ‌స్మృతీ ఇరానీ తన ప్రచారంలో టిఆర్‌ఎస్‌ను, ఎంఐఎంను తూర్పార పట్టిపోయింది. అధికార పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌కు విచ్చేసినప్పటికీ ఆయన రాక ప్రభావం తప్పకుండ వోటర్లపై పడే అవకాశముందనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి నేడు ఆఖరు రోజు కావడంతో చివరిరోజున రాష్ట్ర హోంశాఖ మంత్రి అమత్‌షా, ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్‌ ‌హైదరాబాద్‌కు విచ్చేయబోతున్నారు. కేంద్రంలో వివిధ పదవుల్లో ఉన్న రాష్ట్ర నాయకుల ప్రచారం సరేసరి. కేవలం స్థానిక సంస్థ ఎన్నికకు గల్లీ మొదలు ఢిల్లీ నాయకత్వమంతా కదిలిరావడమన్నది నిజంగానే ఆశ్చర్యకర విషయం. గతంలో ఏనాడు, ఏపార్టీ కూడా ఇలాంటి పరిస్థితిని తీసుకురాలేదు. తెలంగాణ లక్ష్యంగానే ఈ శ్రేణులంతా కదిలివొస్తున్నట్లు దీనివల్ల స్పష్టమవుతోంది. గత సార్వత్రిక ఎన్నిక)నుండే తెలంగాణపై కాషాయ జంఢా ఎగురవేసే లక్ష్యంగా బిజెపిపావులు కదుపుతూ వొచ్చింది.

తెలంగాణపై జెండాను ఎగురవేయడం ద్వారా దక్షిణ ప్రాంతంలో తమ పార్టీ ఆధిపత్యానికి మరింత బలం చేకూరుతుందన్న ఆలోచనతో అనేక ఎత్తుగడలు వేస్తూ వొచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు, తాజాగా దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత ఇక ఆ పార్టీకి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. ఈ రెండు విజయాల అనంతరం వొచ్చిన జీహెచ్‌ఎం‌సిలో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలను సాధించుకోవడం ద్వారా రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ మార్గాన్ని సులభతరం చేసుకోవడమే ఆ పార్టీ ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. అయితే ఢిల్లీ నాయకత్వం దిగివచ్చినప్పటికీ ఇక్కడ కార్పొరేషన్‌ ‌కైవసం చేసుకోవడమన్నది అంత సులభమైన విషయం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకున్న టిఆర్‌ఎస్‌ ఈసారి వందకు పైగా స్థానాలకోసం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు సమీపంలో కూడా బిజెపి ఆనాడు వోట్లను సాధించుకోలేకపోయింది.

Local issues reflect the politics

ఒక ప్రాంతానికే పరిమితమైన ఎంఐఎం నలభై స్థానాలకు పైగా గెలుచుకుని రెండవ స్థానాన్ని సాధించుకుంది. గత ఎన్నికల్లో ఎంఐఎం, టిఆర్‌ఎస్‌ ‌ఫ్రెండ్లీ పార్టీలుగా కొనసాగాయి. కాని, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంఐఎంతో తమకు పొత్తులేదని టిఆర్‌ఎస్‌ ‌చెబుతున్నా, మేయర్‌ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో బిజెపికి మద్దతిచ్చే అవకాశం ఉండదన్నది నిర్వివాదాంశం. అలాంటప్పుడు ఒకవేళ టిఆర్‌ఎస్‌కు మాజిక్‌ ‌ఫిగర్‌ ‌తగ్గిన పక్షంలో ఎంఐఎం మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదు. దీనికితోడు టిఆర్‌ఎస్‌కు ఇంకా సుమారు ముప్పై అయిదువరకు ఎక్స్ అఫిషియో సభ్యుల వోట్లు కూడా లభ్యమవుతాయి కాబట్టి టిఆర్‌ఎస్‌ ఊహించిన ఫిగర్‌ ‌రాకున్నా ఆ పార్టీకి మేయర్‌ ‌స్థానం విషయంలో అవకాశాలెక్కువ. ఈ విషయం బిజెపికి తెలిసినా కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగువేస్తామంటూ ప్రచారం చేస్తోంది.

రాష్ట్ర రాజధానిలోని కార్పొరేషన్‌లో అధిక స్థానాలను కైవసం చేసుకున్నట్లైతే 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో రాజధాని నగరంపై తనకు పట్టుంటుదన్న ఆలోచనతోనే బిజెపి ఢిల్లీ నాయకులను దింపి విస్తృత ప్రచారం చేపడుతోంది. ముఖ్యంగా ఎంఐఎంతో అంటకాగుతున్న టిఆర్‌ఎస్‌ను ఆ పార్టీకి దూరం చేయాలన్న ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధించిందనే చెప్పాలి. టిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీలు ఒకరిపైఒకరు చేసుకుంటున్న విమర్శలే ఇందుకు నిదరర్శనం. అయితే ఇది ఎన్నికలకే పరిమితమా? శాశ్వతంగా దూరమవుతాయా అన్నది ఎన్నికల తర్వాత గాని తేలదు. ఇలా టిఆర్‌ఎస్‌ను ఒంటరి చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతినే పట్టించడం ద్వారా గోలకొండపై కాషాయ జెండా ఎగురవేసుందుకు మార్గం సులభతరం చేసుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ ముందుకు పోతున్నట్లు స్పష్టమవుతోంది.
మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply