- జనంలోకి వెళ్లి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి కోరికలను తెలుసుకోవాలి
- ఇతర రాష్ట్రాల్లో మహిళలకు అమలు చేస్తున్న బెస్ట్ స్కీమ్‌లపైనా అధ్యయనం చేయండి
- జనంలోకి వెళ్లి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి కోరికలను తెలుసుకోవాలి
- ఇతర రాష్ట్రాల్లో మహిళలకు అమలు చేస్తున్న బెస్ట్ స్కీమ్‌లపైనా అధ్యయనం చేయండి
- బీజేపీ మహిళా మోర్చా నేతలకు పార్టీ రాష్ట్ర బండి సంజయ్ ఆదేశం
- క్షేత్ర స్థాయి సమస్యలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మేనిఫెస్టోను రూపొందిస్తామని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కుంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లండి. మహిళలను కలవండి. అట్లాగే టీఆర్‌ఎస్ పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులతోపాటు వారి ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోండి.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు.
గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ మహిళా విధానాలు, పరిశోధన విభాగం ఇంఛార్జ్ కరుణా గోపాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి సహా పలువురు మహిళా నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…ఇతర పార్టీల మాదిరిగా నాలుగు గోడల మధ్య ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడం లేదని, ప్రజల్లోకి వెళ్లి వారు ఎదుర్కుంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించడంతోపాటు వారు ఏం కోరుకుంటున్నారో అధ్యయనం చేసి మేనిఫెస్టోను రూపొందిస్తున్నామన్నారు.
పాదయాత్రలో ప్రధానంగా ఎదురైన సమస్యలు, ప్రజల అభీష్టాన్ని అర్ధం చేసుకున్న తరువాతే రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, ఇండ్లు నిర్మిస్తామని, పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అనేక అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, గ్రామాల్లో నడిచే ప్రతి అభివ్రుద్ది పనులకు కేంద్రమే నిధులిస్తుందన్నారు. అట్లాగే గ్యాస్ కనెక్షన్లు, రేషన్ బియ్యం, ఎరువుల సబ్సిడీ వంటివన్నీ కేంద్రమే భరిస్తున్నప్పటికీ కేసీఆర్ తానే చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెబుతూ అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలకు గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నో మంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. వెంటనే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి బెస్ట్ స్కీమ్‌లుంటే అధ్యయనం చేయాలని కోరారు.