Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే… మమతను సాగనంపేందుకు కమలం వ్యూహం

ఐదేళ్ళు బీజేపీకి అవకాశం ఇవ్వండి.. బెంగాల్‌ను సోనార్‌ ‌బంగగా మారుస్తామన్న నినాదంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా శనివారం మిడ్నపూర్‌ ‌జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన 9 మంది ఎమ్మెల్యేలనూ,  ఒక ఎంపీనీ, ఒక మాజీ ఎంపీని పార్టీలో చేర్చుకున్నారు. ఆయన భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించడానికి బెంగాల్‌ ‌పర్యటనకు వొస్తున్నారన్న మమత ఆరోపణ అసత్యం కాదని రుజువు అయింది. తృణమూల్‌ ‌ప్రభుత్వాన్ని వొచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పడగొట్టేందుకు కమలనాథులు చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. ఆ విషయం ముందే తెలియడం వల్లనే ఆ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు మీడియాలో బహుళ ప్రాచుర్యం లభించింది. రాష్ట్రంలో తృణమూల్‌ ఎమ్మెల్యేలకు కమలనాథులు ఎగవేస్తున్న సంఘటనలకు ప్రాధాన్యం లభించడం లేదు. ఆమెలో ఆవేశం, తొందరపాటు ఉన్న మాటవాస్తవమే అయినా, కేంద్రం చేయదల్చుకున్నదంతా చేసేందుకు సిద్ధంగా ఉంది. కేంద్రం వ్యూహం ముందే తెలిసినా, అక్కడి పరిణామాలను బట్టి వ్యాఖ్యానించాల్సి ఉన్న మాటవాస్తవమే. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను వ్యతిరేకించింది. కాంగ్రెస్‌ ‌సంస్కృతి అని ఎద్దేవా చేసింది.

ఇప్పుడు కాంగ్రెస్‌ ‌కన్నా ఎక్కువ వేగంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో తృణమూల్‌ ‌ప్రభుత్వ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగకూడదన్నది కమలనాథుల నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. దీంతో తృణముల్‌ ‌నాయకుల్లో కూడా పట్టుదల పెరిగింది. వామపక్ష ఫ్రంట్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆ పార్టీ అనుసరించిన దాడుల సంస్కృతిని మళ్ళీ తెరమీదికి తెచ్చింది. దాడులు జరపడంలో బీజేపీ కార్యకర్తలు కూడా ఆరితేరిన వారే. వామపక్ష ఫ్రంట్‌ ‌ప్రభుత్వ హయాంలో ఆ ఫ్రంట్‌ ‌కార్యకర్తలకూ, బీజేపీ కార్యకర్తలకూ తరచూ ఘర్షణలు జరిగేవి. ఇప్పుడు తృణమూల్‌, ‌బీజేపీ కార్యకర్తల మధ్య జరుగుతున్నాయి. ఇవన్నీ కేంద్ర నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని తృణమూల్‌ ‌నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అమిత్‌ ‌షా దేశమంతటా కాషాయ జెండా ఎగురవేయడమే తమ అజెండా అని చాలా కాలం క్రితమే స్పష్టం చేశారు. రాజకీయాల్లో కనీస మర్యాద పాటించాలన్న ప్రమాణాలను ఎవరూ పాటించడం లేదు. వారి ప్రకటనలు చూస్తుంటే జనానికి వెగటు పుడుతోంది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో గెలుపు కోసం కమలనాథులు అనుసరిస్తున్న విధానానికి తృణమూల్‌ ‌శ్రేణులే కాకుండా, వామపక్షాలు, కాంగ్రెస్‌ ‌తదితర పార్టీలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. మమతా బెనర్జీ మోటుగా, నాటుగా విమర్శ చేసి ఉండవొచ్చు కానీ, జాతీయ స్థాయి బీజేపీ నాయకులంతా బెంగాల్‌కి క్యూ కడుతున్నారు.

- Advertisement -

నిజానికి ఏ ప్రాంతంలోనైనా తమ వారుంటే వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు వొచ్చి ప్రచారం చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. బెంగాల్‌లో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల వ్యవధి ఉంది. ఇప్పటి నుంచి కమలనాథులు దూసుకుని వొస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. బెంగాల్‌లో మమతా పాలనలో అవినీతి చోటు చేసుకుందని బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధుల్లో కట్‌ ‌మనీ కింద తృణమూల్‌ ‌పార్టీ నాయకులు వసూలు చేస్తున్నారనీ, మమత ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందని ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళినవారు చెబుతున్నారు. అయితే, ఆమె తన మేనల్లుడు అభిషేక్‌ ‌బెనర్జీని మాత్రమే నమ్ముతూ, ఇతరులను దూరంగా ఉంచడం వల్లనే ఈ తాజా రాజకీయ సంక్షోభం ఏర్పడినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొరివితో తలగోక్కున్నట్టు రాష్ట్రంలో బీజేపీ విజృంభణకు మమత ఇచ్చిన సహకారమే కారణమని కాంగ్రెస్‌, ‌వామపక్షాల ఆరోపణల్లో అసత్యమేమీ లేదు. వాజ్‌ ‌పేయి హయాంలో ఆమె రాష్ట్రంలో బీజేపీకి స్థానం కల్పించారు.

పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్ధతు ఇచ్చారు. అయితే, సిపిఎంకీ వామపక్షాల్లో ఇతర పార్టీలకూ మధ్య స్పర్థల కారణంగా ఇలాంటి ధోరణులను సమైక్యంగా ఎదుర్కోలేకపోయారు. కేరళలో కూడా ఇదే మాదిరిగా చొచ్చుకుని రావడానికి కమలనాథులు చేసిన ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి, సిపీఎం సీనియర్‌ ‌నాయకుడు పినరయ్‌ ‌విజయన్‌ ‌సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అక్కడ కూడా పాతతరం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌ ‌నేతృత్వంలోని ఒక వర్గాన్ని కమలనాథులు ప్రోత్సహించారు. కానీ, పినరయ్‌ ‌వ్యూహం ముందు ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు ఇటీవల జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో వామపక్ష కూటమి సాధించిన విజయాలే నిదర్శనం. మమతా బెనర్జీ ప్రస్తుత పరిస్థితికి వామపక్షాలు జాలి పడటం లేదు. ఆమె చేసిన తప్పునకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు. బీజేపీ ఏకైక అజెండా అయిన దేశవ్యాప్తంగా కాషాయజెండా ఎగురవేసేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకు బెంగాల్‌ ‌పరిణామాలే నిదర్శనం.

Leave a Reply