- కలెక్టర్ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లే యత్నం
- జనగామ జిల్లా కలెక్టరేట్ అద్దాలు ధ్వంసం
- ఎక్కడికక్కడే అరెస్టు చేసిన పోలీసులు
- ప్రజల్ని మభ్యపెట్టే పాలన ఇంకెన్నాళ్లు ?: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
పేద ప్రజలను దోపిడీ చేసే ఎల్ఆర్ఎస్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలలోకి నిరసనకారులు ఎవరూ వెళ్లే వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లకు వెళ్లే అన్ని రహదారులను మూసివేసి వాహనాలను దారి మళ్లించారు. అయినప్పటికీ పలుచోట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు బారికేడ్లను దాటి కలెక్టరేట్లలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు,కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నారు.
ఈ సందర్బంగా బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టు చేస్తారా ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. కాగా, ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ఠ్ర శాఖ పిలుపు సందర్భంగా జనగామ కలెక్టరేట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎల్ఆర్ఎస్ రద్దు, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ అద్దాలను బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపుతున్న బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్ తీవ్రంగా ఖండించారు.
ఈమేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేస్తూ అబద్ధాలు, అసత్య ప్రచారాలతో సీఎం కేసీఆర్, మంత్రులు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు, విలువలను ప్రభుత్వం పోలీసుల సాయంతో కాలరాస్తున్నదని విమర్శించారు. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. కొరోనా సంక్షోభ సమయంలో పేద ప్రజలపై ఎల్ఆర్ఎస్ భారం మోపడం ప్రజల ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్బంధాలు, ఆంక్షల్ని దాటుకుని కలెక్టరేట్లకు చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలను ఆయన అభినందించారు. కలెక్టరేట్ల ముట్టడి విజయంతంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తి చాటారని ఈ సందర్భంగా సంజయ్ ప్రశంసించారు.