బండి సంజయ్ అరెస్టు
మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
బిజెపి కార్యకర్తల ఆందోళన
ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు
చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్
సంజయ్ తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళన
కాళోజీ జంక్షన్, (హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి హిందీ ప్రశ్నాప్రతం బయటకు వొచ్చిన సంఘటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రధాన బాధ్యుడిగా గుర్తించిన పోలీసులు ఆయనను చాకచాక్యంగా కరీంనగర్‌లో అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి తన నివాసంలో బండి సంయ్‌ను పోలీసులు అరెస్టు చేసి భువనగిరి జిల్లా ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలించి బుధవారం ఉదయం జనగామ జిల్లా పాలకుర్తి తీసుకవొచ్చారు. అక్కడ సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి వర్ధన్నపేట మీదుగా హన్మకొండలోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. బండి సంజయ్‌ని ఏ కోర్టుకు తీసుకువెళ్తారు, అసలు ఎందుకు అరెస్టు చేశారో తెలియక బిజెపి కార్యకర్తలు, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రాత్రి నుండి రాస్తారోకోలు, ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సంజయ్‌ని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసు వాహనాలను బిజెపి కార్యకర్తలు, నాయకులు వెంబడించారు. అయితే పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి బిజెపి కార్యకర్తలను తప్పించుకుని వెళ్ళారు. ఏ వాహనంలో సంజయ్‌ను తీసుకవెళ్తున్నది తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.
సంజయ్‌ను తీసుకెళ్తున్న వాహనం అద్దాలకు పేపర్లు అంటించారు. హన్మకొండలోని మేజిస్ట్రేట్ కోర్టులో సంజయ్‌ని హాజరుపరుస్తారని తెలియడంతో వందలాది మంది కార్యకర్తలు కోర్టు ప్రాంగణానికి తరలివొచ్చి పోలీసులు, బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. అయితే పోలీసులు మేజిస్ట్రేట్ నివాసంలో జడ్జీ ముందు హాజరుపర్చారు. పోలీసు రిమాండ్ రిపోర్టును పరిశీలించిన జడ్జి సంజయ్‌ను జుడిషియల్ రిమాండ్‌కు పంపారు. విద్యార్థుల జీవితాలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చలగాటం ఆడుతున్నాడని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆప్రతిష్ఠ పాలు చేస్తున్న సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు తీసుకెళ్తున్న బండి సంజయ్ వాహనంపై కోడిగుడ్లు, చెప్పులను విసిరారు. అటూ బిఆర్‌ఎస్, ఇటు బిజెపి కార్యకర్తల, నాయకుల ఆందోళనలతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చట్ట ప్రకారంగా బండి సంజయ్‌పై కేసు నమోదు : వరంగల్ సిపి రంగనాథ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని వరంగల్ సిపి రంగనాథ్ తెలిపారు. బుధవారం సాయంత్రం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…హనుమకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జరిగిన పదవ హిందీ తరగతి పరీక్ష పత్రం ఒక పథకం ప్రకారమే లీక్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఏ1 ముద్దాయిగా బండి సంజయ్, ఎ2గా బోరం ప్రశాంత్, ఎ3 గా మహేష్, ఏ4 గా శివ గణేష్, ఏ5గా మైనర్ బాలుడుపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. బూరం ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలామందికి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పంపించడం జరిగిందన్నారు. ఈ పశ్నపత్రం బయటకు రావడానికి బాధ్యత వహిస్తూ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ లను కూడా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బయటకు వొచ్చిన ప్రశ్న పత్రాన్ని ఈటల రాజేందర్‌కు అతని పిఏకు పంపించారు. సోమవారం సాయంత్రం బండి సంజయ్ ప్రశాంతుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బట్టి చూస్తే పదవ తరగతి పరీక్ష పత్రాలు ఒక ప్లాన్ ప్రకారం బయటికి తీసుకువచ్చే విధానాన్ని వీళ్ళు రూపొందించారని ఆయన తెలిపారు.
వీళ్లు వాట్సప్ చాటింగ్ చేసినట్లుగా ఉన్న పదాలనే బండి సంజయ్ ప్రెస్ మీట్‌లో వాడడం జరిగింది. బండి సంజయ్ యొక్క ఫోను అడగగా ఫోన్ నా వద్ద లేదని దాటవేసినాడని సిపి తెలిపారు. అయితే బండి సంజయ్ కాల్ డేటాను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడవుతాయని, ప్రస్తుతం కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని, బిజెపి మానిటరింగ్ చేస్తున్న నమో టీమ్‌లో వరంగల్ పార్లమెంటు పరిధిలో ప్రశాంత్ పని చేస్తున్నాడని కమలాపూర్‌లోనే ఎందుకు పేపర్లు లీక్ అవుతున్నాయని ఆరా తీశామని, ముందుగా మాట్లాడుకున్న ప్రకారంగా గేమ్ ప్లాన్ ప్రకారం కమలాపూర్ పేపర్ లీకేంద్రమైందన్నారు. యాధృచ్చికంగా జరిగింది కాదని సిపి తెలిపారు. 41 సిఆర్పిసి వారెంటు లేకుండా అరెస్టు చేయవచ్చని, చాలా మీడియాలలో వారెంట్ లేకుండా అరెస్టు చేసినారని వొస్తున్న వార్తలు నిజం కాదని ఏదైనా చట్టప్రకారమే చర్యలు చేపడుతున్నట్లు సిపి తెలిపారు. పార్లమెంటు స్పీకర్ కూడా సమాచారం అందించామని ఆయన తెలిపారు. కేసుల వివరాలు 120 బి, 420, 447, 505,(1) బి ఐపిసి సెక్షన్ 4 లో కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఈ సెక్షన్ల ప్రకారం మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని సిపి తెలిపారు. అయితే టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా తీస్తున్నామని వాటి ఆధారంగా మరిన్ని సెక్షన్లు పెట్టే అవకాశం ఉందని సిపి తెలిపారు. అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టామని, కోర్టులో రిమాండ్ విషయం కొనసాగుతుందని సిపి పేర్కొన్నారు.