- హైదరాబాద్ డిఇవో కార్యాలయం ముందు ధర్నా…బ్లాక్ డేగా ప్రకటించి నిరసన
- తెలంగాణలో టీచర్ల పరిస్థితి దారుణం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా డీఈఓ కార్యాలయం ముందు తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆందోళనకు దిగింది. సెప్టెంబర్ 5న టీచర్స్ డేను బ్లాక్‌డేగా ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ముందు నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 45 ప్రకారం ప్రైవేటు టీచర్లకు, నాన్-టీచింగ్ సిబ్బందికి యాజమాన్యాలు పూర్తి వేతనం చెల్లించాలని ఉపాధ్యాయులు పట్టుబట్టారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని….ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం ఒక రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని..ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి సత్కరించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ డిమాండ్ చేసారు. ధర్నాలో వందలాదిగా ప్రైవేట్ టీచర్లు పాల్గొని నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ కొరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్ డౌన్ పాటిస్తున్నాము.
కొరోనా మహమ్మారి నుండి మన ప్రాణాలను కాపాడుకోవడానికి స్వీయ నిర్బంధమే నివారణ. ఇదే సమయంలో పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, స్కూల్ తప్ప మరో ఆధారం లేకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులు జీతాలు వస్తాయో, రావో అనే ఆలోచనతో మనోవేదనకు గురౌతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ పూర్తి విద్యా సంవత్సరం జీతాలు ఇవ్వాలనీ, ప్రైవేట్ యాజమాన్యాలకు టీపిటిఎఫ్ తరుపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కూడా ప్రైవేట్ సంస్థలపై వొత్తిడి తెచ్చి రోడ్డున పడ్డ టీచర్లను, ఇతర సిబ్బందికి జీతాలు ఇప్పించి ఆదుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోను మరియు 1897 ఎపిడిమిక్స్ చట్టాన్ని పరగణలోకి తీసుకుని అందరికీ జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూ, మానవతా దృష్టితో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నామని, ఇలాంటి విపత్కర సమయంలో జీతాలను త్వరగా ఇస్తే వారికి ఆసరాగా ఉంటుందన్నారు. కొంతమంది యాజమాన్యాలు పిల్లల ఫీజులకు, ఉపాధ్యాయుల జీతాలకు ముడిపెడుతున్నారని, అది సరైంది కాదని, ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కలిసి ఐక్యంగా ఉండి,యాజమాన్యాలతో చర్చించి, సామరస్య ధోరణిలో జీతాల సమస్యను పరిష్కరించాలన్నారు. కాదంటే మనకున్న జీవోలు, చట్టాల ప్రకారం, విద్యాశాఖ అధికారులకు, మంత్రికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేద్దామన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించైనా సమస్యను పరిష్కరించాలన్నారు. ఇది ఎవరో ఒకరు చేస్తే అయ్యేది కాదని, అందరం ఐక్యంగా ఉండి సాధించుకోవాలని టీ,ర్లకు విజ్ఞపింత చేశారు. తమకు న్యాయంగా రావాల్సిన జీతాలు అడుగుతున్నమని, వాటాలను అడుగడం లేదని, ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చి, వారి జీవితాలకు భరోసాగా నిలిచి తమ నీతి, నిజాయితీ, నిబద్ధత, మానవత్వం, సమాజం పట్ల అవగాహనను యాజమాన్యాలు నిరూపించుకోవాలని అన్నారు.
తెలంగాణలో టీచర్ల పరిస్థితి దారుణం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ప్రజాతంత్ర, హైదరాబాద్ : అసమర్థ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం టీచర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి చెప్పుకొచ్చారు. ప్రీపైమరీ స్కూల్ టీచర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు.. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు అన్న తేడా లేకుండా అనేక కష్టాలకు గురవుతున్నారన్నారు. ‘గురు బ్రహ్మ..గురు విష్ణు..’ అంటూ భారతీయ సనాతన ధర్మం గురువును దేవుని స్థానంలో నిలబెట్టిందన్నారు. పూజ్యనీయ స్థానం అటుంచితే టీఆర్ఎస్ సర్కార్ అసమర్థత వల్ల టీచర్లు కనీసం మనుషలుగా కూడా జీవించలేకపోతున్నారని.. పూటగడవడానికే ఇబ్బందులనెదుర్కొంటూ దారుణంగా బతుకులు ఈడుస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి పట్టు వీడి లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక టీచర్లకు ఇచ్చిన హాలు నెరవేర్చాలని.. టీచర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు భారతీయ జనతా పార్టీ వారి పక్షాన పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని హా ఇస్తున్నానన్నారు.
కొరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్థలను బంద్ పెట్టాల్సి వచ్చిందని.. స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నడవడం లేదని ప్రైవేటు యాజమాన్యాలు టీచర్లు, లెక్చరర్లకు జీతాలు సగానికి పైగా కోత పెడుతున్నాయన్నారు. కొన్ని సంస్థలయితే అసలు మొత్తానికే జీతాలు ఇవ్వడం లేదని, చేతిలో చిల్లిగవ్వ లేక, రోజు గడవడమే గగనంగా మారి రాష్ట్రంలో టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లు, వారి కుటుంబీకులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావన్నారు. ఎన్నికల వేళ టీచర్లకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని వరాలు గుప్పించే సీఎం కేసీఆర్ ఈ కష్టకాలంలో వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జీతాలు రాక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లను, లెక్చరర్లను ఆదుకోవాలన్న సోయి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు బోధన సిబ్బందిలో అనేక ఖాళీలు ఉన్నాయని వీటిని భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే విపరీతమైన భారం నెడుతున్నారన్నారు. నియామకాలు చేపట్టాల్సిందిగా యువత, నిరుద్యోగులు గొంతు చించుకుంటుంటే చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగానే మారింది కానీ తోలుమందం రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. ఈ నియామకాలు చేపడితే యువతకు ఉద్యోగాలు దక్కడమే కాకుండా? రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు దోహదపడుతుందన్నారు. కానీ సీఎం కేసీఆర్ నియామకాల ఉసే ఎత్తొద్దంటూ భీష్మించుకు కూర్చున్నారని తెలిపారు.