తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం నిర్ణయం బీజేపీ విజయంగా పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఇక్కడ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రిజర్వేషన్లు లేని వర్గాలకు చెంది ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. అయితే, రాజకీయ దురుద్దేశాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు నిరాకరించిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈడబ్య్లుఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ రాష్ట్రకార్యవర్గం తీర్మానం చేసిందనీ, ఇందులో భాగంగానే ఈనెల 27న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 24 గంటల దీక్ష చేసేందుకు సంకల్పించినట్లు వెల్లడించారు. బీజేపీ ఆందోళనలకు జడిసి సీఎం కేసీఆర్ ఓ మెట్టు దిగొచ్చి రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడం బీజేపీ సాధించిన విజయంగా పేర్కొన్నారు. కాలయాపన చేసినా, రిజర్వేషన్లను నీరు గార్చే ప్రయత్నం చేసినా బీజేపీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందనీ, ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగ నియామకాల పక్రియలోనూ ఈడబ్య్లుఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేశారు.