- కెటిఆర్ కోసం ఫామ్‌హౌజ్‌లో దోష నివారణ పూజలు
- పూజాసామాగ్రిని కలపడానికే కాళేశ్వరం టూర్
- దమ్ముంటే దళిత సిఎం హామీ ని ఇప్పుడైనా అమలు చేయాలి
- మీడియాతో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మూడు రోజులపాటు దోష నివారణ పూజలు నిర్వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూజా సామాగ్రిని త్రివేణి సంగంమంలో కలపటానికే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్ళారన్నారు. కాళేశ్వరంలో సీఎం దంపతులు ఏం కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజక్టుపై ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడ్తున్నారని, మూడో టీఎంసీతో సాధించిం దేంటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రానున్న మూడేళ్ళల్లో లక్షల కోట్లు వెనుకేసుకోవటానికి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. కేటీఆర్‌ను సీఎంను చేయాలని.. పగ్రతి భవన్లో చాలా టీవీలు పగులుతున్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీవీలు పగులుతున్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారన్నారు. ఉద్యమ ద్రోహులు మాత్రమే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటున్నారని, టీఆర్ఎస్లో ఉన్న నిజమైన ఉద్యమకారులకు కేటీఆర్ సీఎం కావటం ఇష్టం లేదన్నారు.
కేసీఆర్ చేసే పూజలు ఆయన కుటుంబ బాగు కోసమేనని, తాము చేసే పూజలు సమాజహితం కోసం అన్నారు. అకస్మాత్తుగా కాళేశ్వరం సీఎం వెళ్ళాడని అది కూడా శ్రీమతిని తీసుకొని వెళ్ళాడని, తన కల సాకారం అయింది అని పోయిందని అంటున్నారని అన్నారు. మూడు రోజులుగా ఆయన తన ఫార్మ్ హౌస్‌లో కేసీఆర్ దోష నివారణ పూజలు చేశారని, వాటిని కలపడానికి మాత్రమే కాళేశ్వరం వెళ్ళాడని సంజయ్ విమర్శించారు. తన కొడుకును సీఎం చేయడానికే కాళేశ్వరం వెళ్ళాడన్న ఆయన కేసీఆర్ తన స్వార్థం కోసమే యాగాలు పూజలు చేస్తున్నాడని అన్నాడు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని, అకస్మా త్తుగా ఎందుకు వెళ్ళాడు అనే అనుమానం అందరికి వచ్చిందని అన్నారు. నటించడం,అబద్దాలు చెప్పడం, మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని అన్నారు.మంత్రి ఈటలకు టీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి కష్టమొచ్చిన ప్రతీసారీ ఈటలను ముందుపెట్టి కేసీఆర్ బయట పడుతున్నారని విమర్శించారు. తమకు ప్రజల మద్దతుందన్నారు. కేటీఆర్ సీఎం అయితే తమకొచ్చే లాభమేమీ లేదని, ఒకవేళ ముందుకొస్తే.. బీజేపీ సిద్దాంతం, అవినీతి మరకలు లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రమే బీజేపీలో చేర్చుకుంటాంమన్నారు. కేసీఆర్ తన తర్వాతైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, 125అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఎంత వరకు వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మరో సారి సీఎం తెలంగాణ ప్రజలను మోసం చేశాడన్న ఆయన అధికారంలోకి వస్తే దేశ ప్రజల భాగస్వామ్యంతో భాగ్యనగర్‌లో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు అది ఏమైందని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కాకుండా కొడుకును సీఎం చేస్తున్నాడని దళితుణ్ణి సీఎం ఎందుకు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.ఈటెల,హరీష్ లకు అన్యాయం చేసాడన్న అయన కొరోన టైంలో సీఎం ఈటలను బద్నామ్ చేసాడని అన్నారు. సీఎం కాళేశ్వరం ఎందుకు వెళ్ళాడో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నాకు చెప్పారన్న ఆయన, టీఆర్ఎస్ లో ఉన్నతెలంగాణ ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని అంటున్నారని అన్నారు. ఇంట్లో పూజలు ఉన్నాయి కాబట్టే ఈ రోజు కేటీఆర్ తన కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని అన్నారు.