Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌ ‌బీజేపీ మధ్య లెటర్‌ ‌వార్‌

  • ఐఏఎస్‌ ‌బదిలీలలో మార్పులపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ‌లేఖాస్త్రం
  • రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై సీఎంకు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి హరీష్‌ ‌రావు
  • ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై సీఎంకు బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర.: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య లెటర్‌ ‌వార్‌ ‌సాగుతున్నది. అంశాలు వేరయినా ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. గతంలోనూ రెండు పార్టీల మధ్య లేఖల యుద్ధం సాగినప్పటికీ ప్రస్తుతం ప్రతీ రోజూ ఏదో ఒక అంశంపై ఇరు పార్టీల నేతలు లేఖాస్త్రాలు సంధించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ సీఎం కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌మంత్రులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు లక్ష్యంగా లేఖలు రాస్తుండగా, ప్రతిగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం చేపట్టే చర్యల విషయంలో టీఆర్‌ఎస్‌ ‌వైఖరిపై అదే రీతిలో లేఖలతో కౌంటర్‌లు ఇస్తున్నారు. తాజాగా, రాష్ట్రాలలో పనిచేసే ఐఏఎస్‌ అధికారుల బదిలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలతో కూడిన ప్రతిపాదనలు రూపొందించింది. కేంద్రం ప్రతిపాదనలను తమిళనాడు, పశ్చిమబంగ, కేరళ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖలు రాశారు. ఇదే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌కూడా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు.

ఐఏఎస్‌ అధికారుల బదిలీల అంశంలో ఇకపై రాష్ట్రాలకు సంబంధం లేకుండా చేయడమంటే రాష్ట్రాల హక్కులను హరించడమేననీ, ఇది ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధమంటూ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం చర్యలతో రాష్ట్రంలో పరిపాలనా పరమైన అంశాలలో చిక్కులు వస్తాయనీ, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఇక తెలంగాణకు రావాల్సిన నిధుల అంశంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. రాష్ట్రాల పునర్విభజన ప్రాతిపదికన రాష్ట్రానికి రావాల్సిన రూ.వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదనీ, ఎప్పటి నుంచో బకాయి ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలను అంశాల వారీగా ఆయన ఉదాహరణలతో పాటు వివరించారు.

మరోవైపు, రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధి,కొత్త లైన్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదంటూ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. కేంద్రం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సంబంధిత ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు జరపడం లేదని లేఖలో ఆరోపించారు. ఇక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖాస్త్రాల పర్వం కొనసాగుతుండగానే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తాజాగా సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఉపాధ్యాయులు లేక రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే నాధుడే కరువయ్యాడని బండి సంజయ్‌ ‌సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కారారు.

Leave a Reply