Take a fresh look at your lifestyle.

దుబ్బాకలో టిఆర్‌ఎస్‌కు జబర్దస్త్ ‌షాక్

‌వికసించిన కమలం
హోరా హోరీలో 1470 మెజారిటీతో రఘునందన్‌ ‌గెలుపు

భారతీయ జనతా పార్టీ చరిత్ర తిరగరాసింది. కాదు, కాదూ…ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు దుబ్బాక గడ్డపై కాషాయం జెండాను ఎగరేలా చేసి చరిత్ర తిరగరాశాడు. టిఆర్‌ఎస్‌కు పురిటి గడ్డ అయిన దుబ్బాకలో వోటర్లు టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు గెలిచాడు. కారు జోరుకు బ్రేకులు వేస్తూ కమలం వికసించింది. మంగళవారం సిద్ధిపేటలోని ఇందూరు కాలేజీలో దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ‌మొదలైన ఫస్టు రౌండ్‌ ‌నుంచీ ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన బిజెపి పలు రౌండ్లలో వెనకబడింది. ముఖ్యంగా  6,7,20 రౌండ్లలో టిఆర్‌ఎస్‌, 12‌వ రౌండ్లలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధిక్యతను కనబర్చినప్పటికీ..20,21, 22, 23 రౌండ్లలో బిజెపి అనూహ్యంగా దూసుకెళ్లింది.

ఆఖరి నాలుగు రౌండ్ల్లలో అనూహ్యంగా దూసుకొచ్చిన కమలం హోరా హోరీగా సాగిన పోరులో చేగుంట మండల వోటర్లు బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావును ఎమ్మెల్యేగా 1470వోట్ల మెజారిటీతో గెలిపించారు. నువ్వా?నేనా? అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బిజెపి  అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బిజెపి  ఆధిక్యం కనబర్చి టిఆర్‌ఎస్‌ ‌కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. సమీప టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ 1470‌వోట్ల తేడాతో విజయం సాధించాడు.

అనుహ్యంగా పుంజుకున్న టిఆర్‌ఎస్‌ 11 ‌నుంచి 19 రౌండ్‌ ‌వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బిజెపికి సవాలు విసిరింది. కానీ, చివరకు నాలుగు రౌండ్లలో మాత్రం బిజెపి అభ్యర్థికి వోటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో దుబ్బాక గడ్డపై తొలిసారిగా కాషాయం జెండాను ఎగరవేసిన చరిత్రకారుడుగా రఘునందన్‌రావు నిలిచిపోనున్నారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 198807 వోట్లుండగా.. 164192 వోట్లు పోలయ్యాయి. అయితే వీటిలో 162516 వోట్లను లెక్కించారు. మిగిలినవి ఈవీఎంలలో ఉండిపోయాయి. 23 రౌండ్ల కౌంటింగ్‌ ‌పూర్తయిన తర్వాత టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61,302 వోట్లు, బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావుకు  62,772 వోట్లు, కాంగ్రె అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ఱెడ్డికి 21,819 వోట్లు పోలయైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో రఘునందన్‌రావు తన సమీప అభ్యర్థి సుజాతపై 1470వోట్ల తేడాతో విజయం సాధించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply