Take a fresh look at your lifestyle.

‌ద్రౌపది ఎంపికలోనూ బిజెపి రాజకీయం !

రాష్ట్రపతిని ఏకగ్రీవం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అధికార బిజెపి కావాలనే తాత్సారం చేసి..విపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన తరవాతనే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఓ గిరిజన మహిళను ఎంపిక చేయడం నిజంగా భారత పార్లమెంట్‌ ‌చేసుకున్న అదృష్టం. అయితే ఈ ఎంపిక ఓ రెండ్రోజుల మందే జరిగి, విపక్షాల ను ఒప్పించి ఉంటే ఆమె ఏకగ్రీవం అయ్యేవారు. కానీ బిజెపి పెద్దలు ఇక్కడా రాజకీయం చేశారు. యశ్వంత్‌ ‌సిన్హాను ప్రకటించే దాకా ఎదురుచూసిన తరవాతనే ఆలస్యంగా ప్రకటించారు. ముందే ద్రౌపది ముర్ము పేరు ప్రకటించి,..ప్రపథమంగా ఓ గిరిజన మహిళకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పడం ద్వారా విపక్షాలను ఒప్పించి ఉంటే ఆమెకు గౌరవం దక్కేది. బిజెపికి హుందాతనం దక్కేది. కానీ రాజకీయాలు చేయడం అలవాటు చేసుకున్న మోడీ ద్వయం విపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నాలను కొనసాగించింది. గిరిజన మహిళను తొలిసారి రాష్ట్రపతిని చేద్దామనుకుంటే విపక్షాలు కలసి రాలేదన్న అపవాదును వారికి అంటగట్టాలన్న ఎత్తుగడ కూడా ఇందులో దాగి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు వివిధ పార్టీలు కూడా ఆలోచన చేసి దేశ అత్యున్నత పదవికి ఓ గిరిజన మహిళను ప్రతిపాదించినందున.. పార్టీలకు అతీతంగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ముందుకు రావాలి. ఇక్కడ ఆమె పేరును ఎవరు ప్రతిపాదించారన్నది ముఖ్యం కాదు. స్వాతంత్య్రానంతరం అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కింది. ప్రథమంగా ఓ గిరిజన మహిళ అత్యున్నత స్థానం చేరే అవకావం వచ్చింది. ఈ క్రమంలో అన్ని పార్టీలు మరోమారు ఆలోచించి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకునేందుకు ముందుకు రావాలి. మోడీతో లేదా బిజెపితో విపక్షాలకు విభేదాలు ఉండవచ్చు గాక.

రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమని రుజువు చేయాలి. ద్రౌపది ముర్ము ను ఏకగ్రీవంచేయడం ద్వారా దేశంలోని గిరిజనులకు భరోసా ఇవ్వాలి. వారికి ఈ దేశం అండగా ఉందని చెప్పాలి. విపక్షాలు కూడా యశ్వంత్‌ ‌సిన్హాను ఒప్పించి పోటీకి దూరంగా పెడితే మంచిది. ఎందుకంటే సిన్హా అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. ఆయన ఎలాగూ గెలిచే అవకాశం లేదు. ద్రౌపదిని నిలబెట్టడం ద్వారా ఒడిషాలోని బిజూ జనతాదళ్‌ ఆమెకు మద్దతు ఇస్తుంది. ఇక ఎపిలో జగన్‌ ‌ప్రభుత్వం కూడా బేషరతుగా మద్దతు ఇస్తుంది. టిఆర్‌ఎస్‌ ‌కూడా ఆలోచన చేసి ద్రౌపదికి మద్దతు ఇవ్వడం ద్వారా గిరిజనులకు అండగా ఉన్నామని చాటాలి. జూన్‌ 20‌న ద్రౌపది ముర్ము పుట్టిన రోజు. అదేరోజు ఆమె పేరు ప్రకటించి ఆమెకు పుట్టినరోజు కానుకగా పదవిని ప్రకటించి ఉంటే మరింత బాగుండేది. అలాగే విపక్షాలు కూడా సిన్హా పేరును ప్రతిపాదించేందుకు ముందుకు వచ్చేవో కావో తెలిసేది. ఈ క్రమంలో ఇప్పటికైనా బిజెపి పెద్దలు మరోమారు ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేయాలి. ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం కారణంగా విపక్షాలు చివర కు యశ్వంత్‌ ‌సిన్హా పేరును ప్రకటించాయి. రాజ్‌నాథ్‌ ‌చర్చలకు వెళ్లిన సమయంలోనే ద్రౌపది ముర్ము పేరు ప్రకటించి ఉంటే ఇవాళ పోటీకి అవకాశం వచ్చేది కాదేమో. మొత్తంగా రాష్ట్రపతి పదవికి పోటీపడే అభ్యర్థుల విషయమై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. అత్యున్నతమైన ఈ రాజ్యాంగ పదవికి అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జార్ఖండ్‌ ‌మాజీ గవర్నరు ద్రౌపది ముర్ము బరిలోకి దిగుతుం డగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ ‌సిన్హా రంగప్రవేశం చేస్తున్నారు. గిరిజన తరగతికి చెందిన ద్రౌపది ముర్ము పేరుతో సహా 20 మంది పేర్లు చర్చకు వచ్చినప్పటికీ చివరికి ముర్ము పేరునే ఎన్డీయే ఖరారు చేసినట్లు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్‌ ‌పవార్‌, ‌ఫరూక్‌ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ పేర్లు పరిశీలించినప్పటికీ ఆ ముగ్గురూ పోటీకి విముఖత చూపడంతో చివరికి యశ్వంత్‌ ‌సిన్హా పేరును ఖరారు చేశారు.

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం రాత్రి ప్రకటించగా, అంతకు ముందే ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాయి. నిజానికి తొలుత అంతా వెంకయ్యనాయుడు పేరను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వెంకయ్యతో బిజెపి అగ్రనేతలు చర్చించడం ద్వారా ఈ చర్చ వచ్చింది. ముర్ము 16వ రాష్ట్రపతిగా ఎన్నికైతే దేశ తొలి ఆదివాసీ మహిళ ప్రథమ పౌరురాలిగా రికార్డుకెక్కనున్నారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తరువాత పుట్టిన తొలి రాష్ట్రపతిగా కూడా ఆమె నిలవనున్నారు. ఆమెను ఎన్నుకోవడం కూడా లాంఛనమేకానుంది. నిజానికి మంగళవారం రాజకీయాలు చకచకా సాగాయి. ఓ వైపు మహారాష్ట్ర సంక్షోభంతో దేశం దృష్టి అంతా అటువైపు మళ్లింది.

- Advertisement -

ఈ క్రమంలో విపక్షాలు సమావేశమై తమ అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హాను ప్రకటించాయి. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరును ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని చాలా మంది ఊహించారు. మంగళవారం కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌బీజేపీ చీఫ్‌ ‌జేపీ నడ్డాలు వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి కలిశారు. దీంతో ఊహాగానాలు చెల రేగాయి. కానీ ఐదేండ్లుగా ఉపరాష్ట్రపతిగా సేవలందించినందుకు కృతజ్ఞతలు మాత్రమే తెలిపినట్లు తెలు స్తోంది. అంటే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నాయుడును పరిగణనలోకి తీసుకోవడలేదని పరోక్షంగా చెప్పి నట్లుగా అర్థం చేసేకోవాలి. లోక్‌సభలో, మెజారిటీ అసెంబ్లీలలో బిజెపి, దాని మిత్ర పక్షాలకు చాలినంత బలం ఉన్నందున ప్రధాని మోడీ కోరుకొన్న వ్యక్తే కొత్త రాష్ట్రపతిగా రైసానా హిల్స్‌లో ప్రవేశించ గలరని అందరికీ తెలుసు. ప్రచార్భాటం పట్ల బొత్తిగా ఆసక్తిలేని సాదాసీదా వ్యక్తిని మాత్రమే రాష్ట్రపతిగా మోడీ కోరుకున్నారు. కాబట్టే ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ను గత ఎన్నికల్లో ఎంపిక చేశారు. అప్పట్లో కూడా బిజెపి అగ్రనేత అద్వానీని అభ్యర్థిగా ప్రకటిస్తారని బిజెపియేతర నేతలు కూడా భావించారు. కానీ అధికార పగ్గాలు చేతిలో ఉన్నందున మోడీ తనకు అనుకూలమైన,మెతక అయిన రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పేరును తెరపైకి తెచ్చారు. ఈ దఫా ముస్లింకో, గిరిజనులకో రాష్ట్రపతి భవన్‌లో ప్రాతినిధ్యం కల్పిస్తారనే అంచనాలు కూడా బయలుదేరాయి. ఆ మేరకు అనేకానేక చర్చలు సాగాయి. చివరకు గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరునే ఖరారు చేశారు. ఆమె రాష్ట్రపతి భవన్‌ ‌చేరుకోవడం ఖాయం. అందుకు భారతీ యులుగా మనమంతా గర్వించాలి. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే మరింత మంచిది.

గిరిజన మహిళగా రాజకీయ ప్రస్థానం
ద్రౌపది ముర్ము 1958 జూన్‌ 20‌న ఒరిస్సాలోని మయూర్‌ ‌భంజ్‌ ‌జిల్లా బైదాపోసి గ్రామంలో గిరిజన సంతాల్‌ ‌తెగలో జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్‌ ‌తుడు. శ్యామ్‌ ‌చరణ్‌ ‌ముర్మును ఆమె వివాహ మాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మొత్తం విషాదాలే. భర్త, ఇద్దరు కుమారులు ఇప్పటికే మరణించారు. 1997లో బిజెపిలో చేరాక ఆమె రాజకీయంగా వడివడిగానే ఉన్నతస్థానానికి చేరుకున్నారు. ఈ విషయంలో బిజెపి నాయకత్వాన్ని అభినందించాల్సిందే. రాయరంగపూర్‌ ‌జిల్లాలో కౌన్సిలర్‌గా తన రా.జకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె ఒరిస్సాలోని రాయరంగ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2000, 2004ల్లో రెండు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒరిస్సాలోని బిజెడి, బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే గాకుండా ప్రతిభను చాటుకున్నారు. 2000 మార్చి 6 నుంచి 2002 ఆగస్టు 6 వరకు రాష్ట్ర వాణిజ్య, రవణాశాఖ మంత్రిగా, 2002 ఆగస్టు 6 నుంనచి 2004 మే 16 వరకు మత్య్స, పశు గణాభివద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2002 నుంచి 2009 వరకు మయూర్‌ ‌భంజ్‌ ‌జిల్లా బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 2009 వరకు బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 2010లో మరోసారి మయూర్‌ ‌భంజ్‌ ‌జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

2013లో మూడోసారి ఆమె అదే జిల్లాకి అధ్యక్షురాలు అయ్యారు. ఆమె 2015 వరకు జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె బిఎ చదివారు. రయరంగపూర్‌లో అరబిండో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్‌లో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా పని చేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యే నీలకంథా అవార్డును ఒరిస్సా అసెంబ్లీ అందజేసింది. 2015 మేలో ఆమె జార్ఖండ్‌ ‌మొదటి ఆదివాసీ మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. దేశంలో అదే తొలిసారి ఆదివాసీ మహిళ గవర్నర్‌గా నియామకం జరిగింది. జార్ఖండ్‌ 2000 ‌సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్‌ ‌మొదటి గవర్నర్‌గా ఆమె రికార్డు కెక్కారు. బిజెపిలో నమ్మకమైన,నిబద్దత కలిగిన నేతగా గుర్తింపు పొందారు. వివాదాలకు దూరంగా ఉండడం ఆమె ప్రత్యేకత. గవర్నర్‌గా కూడా ఆమె ఎక్కడా తన లక్ష్మణరేఖను దాటలేదు. ప్రభుత్వంతో కీచులాడలేదు. అదే ఆమెను ఉన్నతస్థాయికి తీసుకుని వెళ్లేలా చేసింది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply