Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల్లో కమలనాథుల కదనోత్సాహం

బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిర పర్చి కాషాయి జెండాను ఎగురవేసేందుకు కమలనాథులు తహతహలాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని నేరుగానే వారు ప్రకటనలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు పూర్తి మెజారిటీ ఉంది. అసమ్మతివర్గాలు లేవు. ఒక వేళ ఉన్నా, పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ముందు చేసిన ప్రసంగాల శపథాల కారణంగా ఆయనపై కేంద్రంలో కమలనాథులు ఆగ్రహించినట్టు సమాచారం. ఆంధప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌కేంద్రానికి అనుకూలంగానే నడుచుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడి, హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాలతో ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆయనను సాగనంపేందుకు సిద్ధమేనంటూ కమలనాథులు ఘీంకారాలు చేస్తున్నారు. అయితే, నిప్పు లేనిదే పొగరాదన్నట్టు ఈ రెండు రాష్ట్రాల్లో కమలనాథులు చొచ్చుకుని వొచ్చే అవకాశాలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలే కల్పించాయేమోననిపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ద్వారా రాష్ట్రాన్ని సాధించిన కెసీఆర్‌ ఆ ‌పార్టీని భూస్థాపితం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. దాని పర్యవసానంగా ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా రూపుదిద్దుకుంది. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనుకుంటే బీజేపీ ప్రధాన శత్రువై కూర్చోవడం కేసీఆర్‌ ‌కి నచ్చలేదు. అయినా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ‌వ్యవస్థాగతమైన లోపాల వల్ల , ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న పదవుల కుమ్ములాటల వల్ల దానిని దెబ్బతీయడంలో కేసీఆర్‌ ‌పని సులభమైంది. బీజేపీ విషయంలో అలా కాదు. బీజేపీ ఒక పార్టీగా కాకుండా వ్యవస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా చాలా మంది జాతీయవాదులు, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ ‌వాదులూ పని చేసినప్పటికీ, నిజాం వ్యతిరేక పోరాటం క్రెడిట్‌ను మొత్తం కొట్టేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఎంఐఎంతో కేసీఆర్‌ ‌జత కట్టారని ప్రచారం చేస్తూ హిందూ వోట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీకి సంఘ్‌ ‌పరివార్‌ ‌కార్యకర్తల బలం ఉంది. దానిని ఆధారం చేసుకుని విజృంభించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే, కులాలు, వర్గాలుగా చీలిపోయిన సమాజంలో మళ్లీ ఏకీకృత భావనను తేగలిగితే మతపరమైన శక్తులకు అడ్డుకట్ట వేయవొచ్చు. ఆంధప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి జగన్‌ ‌జెట్‌ ‌స్పీడ్‌లో సాగుతున్నందున ఆయనకు బ్రేకు వేసేందుకు బీజేపీ కొత్త తరహా ఆందోళనలను ప్రోత్సహిస్తోంది. నిజానికి ఆంధప్రదేశ్‌లో మతవిద్వేషాలు ఎన్నడూ లేవు.

Greater Hyderabad elections

- Advertisement -

హిందూ దేవతల విగ్రహాలను కూలగొట్టే సంప్రదాయం కూడా ఎన్నడూ లేదు. ఇది కొత్త తరహా ఉద్యమంగా సాగుతుంది. ముఖ్యమంత్రి జగన్‌ ‌క్రైస్తవ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ అన్ని వర్గాలతో కలుపుకోలుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే, అందరినీ కలుపుకుని పోయేవారో ఆ ధోరణిలోనే జగన్‌ ‌వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఆయనపై పనిగట్టుకుని హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసే ప్రచారం సాగుతుంది. ఇది న్యాయం కాదు. దీనికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అద్యక్షుడు నారా చంద్రబాబు పరోక్షంగా ప్రోద్భలం ఇస్తున్నట్టు ఆరోపణలు వొస్తున్నాయి. నిప్పులేనిదే పొగ రాదన్నట్టు ఆయన స్వయంగా జోక్యం చేసుకోపోయినా, ఆయన సన్నిహితులు ఈ గందరగోళాన్ని సృష్టిస్తున్నట్టు ఏ పార్టీకీ సంబంధం లేని వారు సైతం అనుమానిస్తున్నారు. చంద్రబాబునాయుడు రాజకీయ జీవితంలో మూడొంతులు పైగా అధికారంలోనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేయలేని పనులను జగన్‌ ‌పద్దెనిమిది మాసాల్లో చేయడం ఆయనకు కంటగింపుగా ఉంది. జగన్‌ను ఇంకా ఎదగనిస్తే ఇతర పార్టీలకు పుట్టగతులుండవన్న బెదురు ఆయనకే కాకుండా, కమలనాథులకు కూడా ఉంది. ఆంధప్రదేశ్‌లో కమలనాథులు పార్టీ పరంగా, లేదా హిందూ భావజాల పరంగా ఎదగలేరు.

కేవలం ఒక సామాజిక వర్గం అండతోనే ఎదిగేందుకు అవకాశాలున్నాయి. అలా అని బయటపడకుండా సినీనటుడు పవన్‌ ‌కల్యాణ్‌తో ఒప్పందం కుదుర్చుకుని జగన్‌ ‌ప్రభుత్వంపై సెగ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్‌ ‌తమ పార్టీ అజెండా అమలులో చూపుతున్న దూకుడుకు అన్ని పార్టీలకూ కన్నెర్రగా ఉంది. ఆయన అంత తొందర ఎందుకు పడుతున్నారో తెలియదు. నిదానంగా అన్ని అంశాలను అమలు జేసే కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ప్రజల్లో నిరుపేదల పేరిట ఒక వర్గానికి సాయపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఆంధ్రాలో సాగుతున్న దేవతా విగ్రహాల విధ్వంస కార్యక్రమానికి అదే ఊపునిస్తోంది. నిజానికి జగన్‌ ఏ ఒక్క మతాన్నీ బహిరంగంగా సమర్థించలేదు. అలాగని ద్వేషించలేదు. ఆయనను పడగొట్టేందుకు మతాన్ని ఆయుధంగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న పార్టీల నైజాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. తెలుగుదేశం పార్టీ జగన్‌ ‌కార్యక్రమాలను తన అనుకూల మీడియా ద్వారా వ్యతిరేకిస్తూ వాటిని నిర్వీర్య పర్చే కార్యక్రమం చేస్తున్నది. ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో కమలనాథుల కదనోత్సాహం చూస్తుంటే అప్పుడే ఎన్నికలు వొచ్చేసినట్టు లేదా ఎన్నికలను ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వొచ్చిన ప్రభుత్వాలను ఐదేళ్లూ కొనసాగనివ్వడం ప్రజాస్వామ్యయుతం అవుతుంది. అంతే తప్ప దేశమంతటా మన పార్టీ జెండా ఎగరాలన్న అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే అది బెడిసి కొడుతుంది.

Leave a Reply