Take a fresh look at your lifestyle.

తెలంగాణపై బిజెపి నిజంగానే సవతితల్లి ప్రేమ చూపుతుందా !

అంటే…తెలంగాణవారు అన్నారంటారుగాని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్నది మాత్రం ఏమున్నది. తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతున్నదని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తమను ఆడిపోసుకుంటున్నదని గొంతు చించుకుంటున్న మోదీ ప్రభుత్వం చర్యలు మాత్రం అందుకు ఏమాత్రం తీసిపోనివిగానే ఉన్నాయి. కేంద్రం వైఖరిపట్ల కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలోని బిజెపియేతర రాష్ట్రాల్లోని పార్టీలు చేస్తున్న ఆరోపణలు నూటికి నూరుపాళ్ళు నిజమన్నట్లుగానే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సుష్మాస్వరాజ్‌ ‌లాంటివారు మనస్ఫూర్తిగా తోడ్పాటు అందించారన్న ఉద్దేశ్యంగానే ఇంకా తెలంగాణ ప్రజలు ఆపార్టీ పట్ల అభిమానంతో ఉన్నా, ఆ పార్టీకి, పార్టీ అగ్రనాయకత్వానికి మాత్రం ఇక్కడి ప్రజల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదనడానికి తాజా పార్లమెంటు సమావేశా సందర్భంగా తెలంగాణ విషయంలో మోదీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేసేందుకు తెగ ఉత్సాహపడుతున్న ఈ పార్టీకి కనీసం ఇక్కడి ప్రజల మనస్సెరిగి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. కేంద్రంలో అధికారం చేపట్టిన మొదట్లో తెలంగాణకు ఇచ్చిన హామీలను మరిచిన కేంద్రం, కనీసం తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా అధికారికంగా ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కడమన్నది మోదీ ప్రభుత్వానికే చెందింది. వాస్తవంగా తెలంగాణలో హైదరాబాద్‌ ‌తర్వాత ఏ జిల్లాలో కూడా ప్రభుత్వపరంగా భారీ పరిశ్రమలేవీ లేవు.

రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఉమ్మడి వరంగల్‌లో ఏనాడో నిజాం సర్కార్‌ ఏర్పరిచిన ఆజంజాహి మిల్లు తప్ప మరో ప్రభుత్వరంగ సంస్థ ఏర్పాటు జరుగలేదు. ఆజంజాహిమిల్లును కూడా నడువదన్న ముద్రవేసి మూతవేశారు. సుమారు పదివేల మందికి ఉపాధిని కల్పిస్తూ వొచ్చిన ఈ మిల్లు మూతపడిన తర్వాత ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలిగించే మరో పరిశ్రమంటూ ఏదీ ఇంతవరకు రాలేదు. కనీసం రాష్ట్ర విభజన-2014 హామీలైనా నెరవేరుస్తారనుకుంటే ఆ సందర్భంగా ఇచ్చిన ఏఒక్క హామీని కూడా కేంద్రం పట్టించు కోలేదు. ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్శిటీగాని, బయ్యారం ఉక్కు కర్మాగారంగాని, ఎంతోకాలంగా డిమాండ్‌లో ఉన్న కాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీగాని అతీగతిలేకుండా పోయింది. పైగా తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ నెల 29న రెండు శాఖల కేంద్ర మంత్రులు తెలంగాణకు వొస్తాయని ఆశగా చూస్తున్న రెండు సంస్థలకు మంగళం పాడినట్లు చల్లగా సెలవిచ్చారు. కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ డిమాండ్‌ అన్నది ఈనాటిది కాదు.  దాదాపు యాభై ఏళ్ళుగా స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు నిరంతరాయంగా ఆందోళన పర్వాన్ని కొనసాగిస్తూ వొస్తున్నదే.

సుదీర్ఘ  ప్రజాందోళనకు తలొగ్గిన నాటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 1980లో కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ ప్రజలు ఆశించారు. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిల్వలేదు. అదే కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరుగడం, పంజాబ్‌లో దాని పర్యవసానంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలను శాంతింపచేసేందుకు కాజీపేటకు మంజూరు చేసిన కోచ్‌ ‌ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తాల్లో ఏర్పాటు చేశారు. అదిగో..అప్పటి నుండి ఈ డిమాండ్‌ ‌డిమాండ్‌గానే మిగిలిపోయింది. చివరకు తెలుగు రాష్ట్రం  రెండుగా విడిపోయినప్పుడు చేసుకున్న 2014నాటి ఒప్పందాల్లో ఈఅంశాన్ని చేర్చారు. రాష్ట్రం ఏర్పడిన ఈతొమ్మిదేళ్ళ కాలంలో ఈ విషయంలో రాష్ట్రంలో తొమ్మిదేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్న బిఆర్‌ఎస్‌(‌టిఆర్‌ఎస్‌) ‌ప్రభుత్వం అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. అయినా కేంద్రం ఏనాడు ఈ విషయంలో అనుకూల నిర్ణయం తీసుకున్నదిలేదు. మరో ఎనిమది నెలల్లో రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వొస్తామని ఢంకా బజాయించి చెబుతున్న బిజెపి కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీపై సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ వాదులంతా ఆశించారు. కాని, బిఆర్‌ఎస్‌ ‌చెబుతున్నట్లు తెలంగాణపట్ల నిజంగానే  ద్వేషాన్ని పెంచుకున్నాదా అన్నట్లే బిజెపి ప్రభుత్వం ఆలాంటి ఆలోచనేది తమకు లేదని పార్లమెంటు నిండు సభలో తేల్చేసింది. ఏపీ పునర్‌వ్యవస్తీకరణ చట్టం-14 లో ఇచ్చిన హామీ ప్రకారం కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటును బిఆర్‌ఎస్‌ ఎం‌పీలు లేవనెత్తిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తమ ప్రభుత్వానికి అలాంటి ఆలోచనేదీలేదని స్పష్టం చేయడంతో కనీసం ఎన్నికల ముందు అయినా ఒప్పంద హామీని కేంద్రం నెరవేస్తుందన్న ఆశ కూడా లేకుండా పోయింది.

ఆ ఒక్కదానితోనే కాకుండా నిజామాబాద్‌ ‌పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో కూడా అదే వైఖరిని ప్రదర్శించింది. నిజామాబాద్‌ ‌పసుపు బోర్డును నెలకొల్పడమన్నది ఒక విధంగా బిజెపి పార్టీ ఇచ్చిన హామీనే. తనహామీని చివరి సంవత్సరంలోనైనా నిలుపుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్న నిజామాబాద్‌ ‌పసుపు రైతులకు బుధవారం పార్లమెంటు సాక్షిగా తమకా ఉద్దేశ్యంలేదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్‌  ‌వ్రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానం చూస్తుంటే బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నట్లు నిజంగానే తెలంగాణ పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదా అన్న అనుమానానికి తావిస్తుంది. 2017లో నాటి నిజామాబాద్‌ ఎం‌పీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు సాధన ఉద్యమాన్ని చేపట్టింది. అనేకసార్లు ప్రధానికి, సంబంధిత మంత్రికి, అధికారులకు విజ్ఞప్తులు చేసింది.

అయితే ఆమెకు సాధ్యంకాని పసుపు బోర్డును తాను సాధిస్తానంటూ బాండ్‌ ‌పేపర్‌పైన లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి, కవితపై గెలిచిన బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌ ‌గడచిన నాలుగేళ్ళుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే ఉన్నప్పటికీ కనీసం కేంద్రంతో పసుపుబోర్డు ఏర్పాటుపై అనుకూల ప్రకటన ఇప్పించలేకపోవడం పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఒక్కటీ అడక్కు అంటున్న కేంద్రం అడిగింది కాకుండా  ఏదో ఒకదానితో సంతృప్తి పర్చాలని ప్రత్యమ్నాయ ఏర్పాట్లు  చేస్తుంది. కోచ్‌ ‌ఫ్యాక్టరీ కాకున్నా, కనీసం వ్యాగన్‌ ‌ఫ్యాక్టరీ అయినా నెలకొల్పాలన్న డిమాండ్‌ను పక్కకు పెట్టి ఒక వర్క్ ‌షాపుకు అనుమతించింది. పవర్‌మెన్‌ ‌టైకిషా జైనీ సంస్థ అద్వర్యంలో పీరియాడికల్‌ ఓవర్‌ ‌హాలింగ్‌ ‌పేర నెలకొల్పే పరిశ్రమకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలు అందజేయగా కావల్సిన మరో పది ఎకరాలను అందించడంలేదని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే నిజామాబాద్‌లో పసుపు బోర్డు కాకుండా బోర్డుకు అనుబంధమైన కార్యాలయాలను ఏర్పాటు చేసి వాటితోనే సంతృప్తి చెందాలంటున్న కేంద్రం రానున్న ఎన్నికల్లో ప్రజలకేమి సమాధానం చెబుతుందో మరి.

Leave a Reply