Take a fresh look at your lifestyle.

ఈ తిరుగుబాటు టీ కప్పులో తుఫాను మాత్రమే..?

“భాజాపా వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాలకు సియం హోదాలోనే వెళ్లారు. అక్కడ సకల మర్యాదలు జరిపించుకున్నారు. అవునన్నా కాదన్నా ఇది నిష్ఠూర సత్యం. ఈ పర్యటనపై ఏ మీడియా సంస్థ నోరు మెదపలేదు. కారణం కేసీఆర్‌ ఎదురుదాడికి భయపడి ఉంటారు. వేరే రాష్ట్రాలకు పర్యటనకు వెళితే ముఖ్యమంత్రి పదవి వేరేటోళ్లకు ఇచ్చిపోవాల్నా? ఎవడు నేర్పించిండు మీకి దిక్కుమాలిన రాతలు అని పత్రికలపై నిప్పులు కురిపిస్తారు. ఏందివయ్యా…నీలొల్లి అంటూ దుమ్ము దులిపేస్తారు. అందుకే ఆ ప్రస్తావన ఎవరూ తీసుకురాలేదు.”

ఉత్తరాది రాజకీయ పార్టీలపై మరో తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకుడు తిరగబడ్డారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ అంశం తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. 80 దశకంలో తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఉత్తరాది పార్టీ అంటూ కాంగ్రెస్‌ ‌పై సమర శంఖం పూరించారు. కాంగ్రెస్‌ ‌కి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ ‌కు ముచ్చెమటలు పట్టించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షులకే కలవరం సృష్టించారు. శతాభ్ధకాలంగా కాంగ్రెస్‌ ఏలుబడిలో దేశం సమూలంగా నాశనం అయిందని నిప్పులు చెరిగారు. కేంద్రంలో కాకలు తీరిన కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులకు వణకు పుట్టించారు. కాంగ్రెసేతర పార్టీలతో జతకట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్‌ ‌ఫ్రంట్‌ ‌ఛైర్మన్‌ ‌గా సమన్వయం విజయవంతంగా నిర్వహించారు. ఇది తెలగువారి ఆత్మగౌరవం, ఘనచరిత్ర. ఆ పాత్రను కొన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పోషించారు. ఒకటిన్నర దశాబ్ధంపాటు జాతీయ రాజకీయాలలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇహ ఇదంతా గతమే, తెలుగుగడ్డపై చరిత్ర పునరావృతం తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలుగువారి వైభవం కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. జాతీయ రాజకీయాలలో తెలగువారి ప్రాధాన్యత అడుగంటి పోయింది. ఆత్మగౌరవాలు కాస్తా ఉత్తరాది పార్టీల పాదాలవద్ద సాగిలపడింది. ఒక్కొక్కరిది ఒక్కోబాణి. అవసరానికి తగ్గట్టుగా రాగాలు ఆలపించడం పరిపాటిగా మారిపోయింది.
2014 లో రాష్ట్రం విడిపోయాక తెలుగదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందనే చెప్పాలి. నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లు, చివరకు అది ఏ స్థాయికి చేరిందంటే ఆంథ్రప్రదేశ్‌ ‌రాజధానిని మేము ప్రత్యేకంగా నిర్మంచుకుంటాం అనే స్థితి కి చేరింది. ఇక ఆ పరిణామాలు అప్రస్తుతం , కాకపోతే కొన్ని ముఖ్యఘట్టాలు వివరించడం ద్వారా కొత్త తరం వారికి వివరాలు తెలుస్తాయని వల్లించడమే.

తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా వున్నప్పటికీ ఉత్తరాది వాళ్లకు మనమంటే చిన్నచూపు వుండేది. ఇక రెండు రాష్ట్రాలుగా విడిపోయాక, రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్నాక అది మరింత నేలచూపు చూసింది. నిత్యం జలవివాదాలు, ఆస్తుల పంపకాలలో రగడ. చివరకు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి మనల్ని మరింత ఇరుకున పెట్టింది. విభజించి పాలించే క్రమానికి మరింత ఊపిరి పోసింది. రెండు ప్రాంతీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి. కొన్నాళ్లు తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరి విన్యాసాలు చేసింది. కానీ దాని ప్రతిఫలంగా ప్రాధాన్యత కోల్పోయి ప్రజలలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కేంద్ర బడ్జెట్‌ ‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులలో అలసత్వం ప్రదర్శించింది. రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడితోపాటు, అసంతృప్తి సెగ మొదలయింది. అనేక ఛీత్కారాలకు గురయిన తెలుగుదేశం పార్టీ భాజపా మంత్రి మండలి నుంచి కాలు బయట పెట్టింది, అప్పటికే భాజాపా వద్ద సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైసీపీ భాజాపా పంచన చేరింది. శత్రువుకు శత్రువు మిత్రుడనే ఆయుధం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ‌లో అధికారం దక్కించుకోవడం కోసం వైసీపీ ఉత్తరాది పార్టీ వద్ద మోకరిల్లింది. అటు ఆంధ్రలో జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి, తెలంగాణ లో కేసీఆర్‌ ‌రెండో సారి సియం లు అయ్యారు. భాజాపాను తూలనాడినందుకు చంద్రబాబు అధికారాన్ని చేజార్చుకున్నారు.

ఇక్కడ మరోకోణం వుంది. తెలంగాణ లో భాజాపా తన ఉనికిని చాటుకుంది. పురపాలక హైదరాబాద్‌ ‌పరపాలక ఎన్నికలలో భాజాపా తన సత్తాను చాటింది తెరాసా కు ధీటైన పోటీ ఇచ్చి కేడర్‌ ‌కు ధీమాను కల్పించడంతో తెరాస అద్యక్షుడు కేసీఆర్‌ ఇరుకున పడ్డారనే చెప్పాలి. తన సౌధం పునాదులు కొద్దికొద్దిగా కదులుతున్నాయని కేసీఆర్‌ ‌గుర్తించి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారనే వాదనలు లేకపోలేదు. ఇందులో భాగంగానే ప్రధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌పర్యటనలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ‌ఛాయలకు కూడా వెళ్లలేదు. ప్రధాని మోడీని తెలంగాణ యాసలో తూలనాడారు. మెడలు వంచుతాం అనే ఉద్యమ నాయకుడికి పూనకం వస్తే సహనం కోల్పోయి మాట్డాడినట్లుగానే గొంతు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం వెనుకబాటుతనం నుంచి బయటపడేందుకే అని వక్కాణించారు. ఆంధ్ర ప్రజలపై తన వైఖరిని కనబరిచారు. నాకు ఆంధ్రలో అభిమానులున్నారని ఆకాశానికి ఎత్తేస్తూనే, భాజాపా రెండు రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమను చూపుతున్నదని నిప్పులు చెరిగారు. ఇటీవల బహిరంగ సభల్లో తెలంగాణ పై కేంద్ర ప్రబుత్వం చూపుతున్న కఠినత్వాన్ని ప్రజల మధ్య వుంచుతున్నానంటూ కంటతడి పెట్టారు. భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ప్రతికూల వాతావరణాన్ని మళ్లీ తనదారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

మోడీని గద్దె దించేవరకు విశ్రమించను
తెలంగాణలోని ప్రజలను దగా చేస్తున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వచ్చే సాధారణ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోవడం తప్పదని కేసీఆర్‌ ‌శాపాలు పెట్టారు. భావసారూప్యమున్న ఏ రాజకీయ పార్టీతో అయినా కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. భాజాపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇందులో భాగంగా కార్యాచరణ ప్రకటించి దేశంలోని ఎనిఏ వ్యతిరేక వర్గాలను సంఘటితం చేసేందుకు నడుం బిగించారు. ఇదే తడవుగా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ‌మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌థాకరే తోనూ, ఎన్సీపీ నేత శరద్‌ ‌పవార్‌ ‌తో సమావేశం అయ్యారు. అవి కేసీఆర్‌ ఊహించిన స్థాయిలోనే విజయంతం కావడంతో రెట్టింపు ఉత్పాహంతో ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికలలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు చంద్రశేఖరరావు కలలు కంటున్నారు. గుర్రం ఎగురనూ వచ్చు అని భావి ప్రధానిగా ఊహించుకుంటున్నారు.

ఈ తిరుగుబాటు టీ కప్పులో తుఫాను మాత్రమే..?
తిరుగుబాటు ధోరణితో నిత్యం రగిలిపోయే కేసీఆర్‌ ‌మాట మార్చడంలోనూ సిద్ధహస్తుడనే చెప్పుకుంటారు. మాటకు కట్టుబడి ఉండడం ఆయనకు సహించదని విమర్శలు వెంటాడుతునాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కేసీఆర్‌ ఎదురు తిరగడం వెనుక రాజకీయ చతురత వుందని భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. తిట్టిన నోటితోనే తెగ పొగిడేస్తారు ఆయన… మేము ఒకళ్లను మరొకరు అర్ధం చేసుకున్నాం. సమస్య పరిష్కారం అయింది. మీకెందుకు బాధ అని ప్రతిపక్షాలను, మీడియాను తూర్పారబడుతూ… మీకు కడుపు మంట. నారదులు మీరు. మీకు ఎప్పుడు వివాదాలు కావాలి, మీ తీరు మార్చుకోవాలని హితవు పలుకుతారు. మీరు పద్దతి మార్చుకోకపోతే నా శాపాలు తగులుతాయని బెదిరిస్తారు. ఇది కేసీఆర్‌ ‌తీరు తెన్నులు. కనుక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పై చంద్రశేఖర రావు ప్రదర్శిస్తున్న దూకుడు కేవలం తాత్కాలికమే అని రాజకీయ పండితులు, కేసీఆర్‌ ‌కి అతి సమీపంలోని వ్యక్తులు ఛలోక్తులు విసురుతున్నారు. ఈ మేరకు పందెం వేస్తారా అని సవాళ్లు విసరడం కూడా కేసీఆర్‌ ‌వైఖరిపై అనుమానాలను రేకెత్తిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వై ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డికి, చంద్రశేఖర రావుకు భాజాపా ఆశీస్సులు పుష్కలంగా వున్నాయని ప్రస్ఫుటంగా అర్థం అవుతూనే వుంది. భాజపాపై కేసీఆర్‌ ‌మాటల తూటాలు కేవలం కొన్ని ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించే క్రమంలో చేస్తున్నవని ఆయన ప్రీతిపాత్రులే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కేసీఆర్‌ ‌పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి ఆ తర్వాత కూటమిలో చేరిన పార్టీలకు వాళ్లలో వాళ్లకే కలతలు రేపే బాద్యతను భాజపా కేసీఆర్‌ అప్పగించిందనే వాదనలూ లేకపోతేదు. భాజపాకు ప్రతికూల వాతావరణం సంభవి ంచకముందే బీజేపీ జాగ్రత్త చర్యలలో భాగంగా కేసీఆర్‌ ‌కు ఓ కూటమి ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు దేశవ్యాప్త పర్యటనకు కేసీఆర్‌ ‌పయనమయినట్లు చెవులు కొరుక్కుంటున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు కాబట్టి..
భాజాపా వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాలకు సియం హోదాలోనే వెళ్లారు. అక్కడ సకల మర్యాదలు జరిపించుకున్నారు. అవునన్నా కాదన్నా ఇది నిష్ఠూర సత్యం. ఈ పర్యటనపై ఏ మీడియా సంస్థ నోరు మెదపలేదు. కారణం కేసీఆర్‌ ఎదురుదాడికి భయపడి ఉంటారు. వేరే రాష్ట్రాలకు పర్యటనకు వెళితే ముఖ్యమంరతి పదవి వేరేటోళ్లకు ఇచ్చిపో వాల్నా? ఎవడు నేర్పించిండు మీకి దిక్కుమాలిన రాతలు అని పత్రికలపై నిప్పులు కురిపిస్తారు. ఏందివయ్యా…నీలొల్లి అంటూ దుమ్ము దులిపేస్తారు. అందుకే ఆ ప్రస్తావన ఎవరూ తీసుకురాలేదు. కానీ వాస్తవానికి కేసీఆర్‌ ‌పై శరద్‌ ‌పవార్‌, ఉద్దవ్‌ ‌కు మమకారం, విశ్వాసం లేకపోయినా కేవలం సీఎం స్థాయిలో వచ్చారు కనుక మర్యాదపూర్వకంగా వ్యవహరించడం మన సంప్రదాయమని మహారాష్ట్ర కేబినెట్‌ ‌మంత్రి విలేకరులతో అనధికారికంగా వ్యాఖ్యానించారని తెలిసింది. కేసీఆర్‌ ‌మాటలను సీరియస్‌ ‌గా తీసుకోలేమనే వ్యాఖ్యలను బట్టి కేసీఆర్‌ ‌ది బలం కాదు వాపు అని తేలిపోయింది.

బాబాయి సరే మరి అబ్బాయి సంగతి ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్వరం వినిపిస్తున్న కేసీఆర్‌ ‌కు బాబాయ్‌ అబ్బాయి బంధంలోని మిత్రుడు ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వై ఎస్‌ ‌జగన్‌ ‌తోడుగా వున్నారా తేదా అనేది మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్న. ఎందుకంటే జగన్‌ ‌ముఖ్యమంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాల్లాడలేదు. రాష్ట్రంలో అనేక సమస్యలు వున్నప్పటికీ ఆయన మౌన మునిగానే కొనసాగుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి, ప్రతి రూపాయికీ చేయి చాచే ఆర్థిక ఎద్దడిని ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కుంటున్నది. ప్రత్యేక హోదా సాధించేవరకు నిద్రపోననే ఎన్నికల హామీని కనీసం తలంపులోకి కూడా జగన్‌ ‌తీసుకోలేదు. సాధారణ ఎన్నికలలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనే సమ్మెహనాస్త్రాన్ని ప్రజలపై సంధించిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉపసంహ రించుకున్నారు. అంచనాలు తలక్రిందులయ్యాయని సరిపెట్టుకు న్నారు, కేంద్రంతో యుద్ధం చేసే స్థాయి మనకు లేదని తేల్చి చెప్పి భాజపా కు ప్రీతిపాత్రుడయ్యాడు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాటకు వస్తే, భాజాపా ఎంపీలను సైతం మరిపిస్తుంటారు. మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ జుగుప్సాకరంగా ట్వీట్‌ ‌లు పెడుతుంటారు. ఆ పొగడ్తలు ఎందుకు పెడుతుంటారు అందరికీ తెలిసిందే. దాని గురించి రాయాల్పిన అవసరం లేదనుకుంటా. ఆ దిగుజారుడు తనం ఏ మేరకు ఉందో మచ్చుకు ఓ ఉదాహరణతో వివరిస్తాను.

అహ్మదాబాద్‌ ‌బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్ప వెల్లడించిన దరిమిలా ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించారు. ఉగ్రవాదులు పేలుళ్లకు సైకిల్‌ ‌ను ఉపయోగించారు అని వ్యంగ్యాస్త్రం వేశారు. చివరకు సామాన్యుడు వాడే సైకిల్‌ ‌ను కూడా అనుమానించాల్సి వస్తుందని మెదీ భావన, నిజానికి యుపీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌ ‌వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్‌ . ‌ప్రధాని స్థాయిలో మోదీ ఇలాంటి ప్రయోగం చేయడం సహేతుకమా, కాదా అన్నది పక్కకు పెడితే…దానిని విజయసాయి రెడ్డి ట్వీట్‌ ‌చేశారు. తెలుగుదేశం పార్టీ చిహ్నం కూడా సైకిల్‌ ‌కనుక, ప్రధాని సైకిల్‌ ‌గుర్తును ఎద్దేవా చేశారని తన ట్వీట్‌ ‌లో విజయసాయి ఉటంకించారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటోంది. అంటే విజయసాయి రెడ్డి దిగజారుడుతనం స్పష్టం అవుతున్నది. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని భుజాన మోస్తున్నది అనేది కాదు. దివాలాకోరుతనానికి ఇది నాందీ అని చెప్పుకోవచ్చు. అట్లని చంద్రబాబు ఏమీ తక్కువ తినలేదు, మోదీని చంద్రబాబు ఆకాశానికి ఎత్తేసి. ఆయనతో వ్యవహారం చెడిపోయాక మాటలతో అధపాతాళంలోకి తొక్కేశారు. బాబాయ్‌ అబ్బాయి స్నేహం విషయానికి వస్తే బాబాయి కేసీఆర్‌ ‌సూచిస్తారు.. అబ్బాయి పాటిస్తారు. ప్రధాని మోదీకి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఎందుకు వంగి వంగి దండాలు పెడుతుంటారో గుర్తు చేసే అగత్యం లేదనుకుంటా, కనుక జగన్‌ ‌బాబాయితో కలిసి వెళ్లకపోవచ్చు. కాబట్టి కేసీఆర్‌ ‌బాబాయికి అంత సీన్‌ ‌లేదనేది తేటతెల్లం అవుతున్నది. భారతీయ జనతా పార్టీ కీ తెరాస కు బేధాభిప్రాయాలు ఉత్తిత్తివే అన్నమాట, ప్రజల సమస్యలను దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ ‌సరికొత్త నాటకానికి తెరలేపారని మెదడులో గుజ్జు వున్న ఎవ్వరికి అయినా అర్ధం అవుతుంది.
– వెంకట ఫణి కుమార్‌ ‌బుక్కపట్నం ,సీనియర్‌ ‌జర్నలిస్ట్.

Leave a Reply