Take a fresh look at your lifestyle.

బిజెపి అంటే…‘భారతీయ జూటా పార్టీ’

  • కాంగ్రెస్‌ ‌పార్టీకి వోటేస్తే మోరీలో వేసినట్లే…
  • దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు

భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కొత్త పేరు పెట్టారు. బిజెపి అంటే ‘భారతీయ జూటా పార్టీ’ అని విమర్శించారు. బిజెపి నేతలు చెప్పేది ఏ ఒక్కటి కూడా చేయరన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్నారు. మోదీ ప్రధానమంత్రి అయిన ఈ ఆరేండ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలనీ, ఎంత మందికి జాబ్‌లిచ్చారో బిజెపి నేతలు చెప్పాలని మంత్రి హరీష్‌రావు. రాష్ట్ర పార్టీ నేతల విషయానికి వస్తే కూడా అన్నీ గోబెల్స్ ‌ప్రచారమే. అన్నీ అబద్దాలు చెప్పడం.. అవాస్తవాలు ప్రచారం చేయడం అందుకే బిజెపి అంటే ‘భారతీయ జూటా పార్టీ’అని చెప్పాల్సి వచ్చిందన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిసేట సుజాత-రామలింగారెడ్డికి మద్దతుగా శుక్రవారం దుబ్బాక మండలంలోని రాజక్కపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో బిజెపి నేతలు గోబెల్స్ ‌ప్రచారం చేస్తున్నారనీ విమర్శించారు.

బిజెపి నేతలు ఉద్యోగాలపై మాట్లాడుతున్నారనీ.. మోదీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, ఎంత మందికి జాబ్‌లు ఇచ్చారని ప్రశ్నించారు. పెన్షన్లపై చర్చకు బస్టాండ్‌కు రమన్న బండి సంజయ్‌ ఇప్పటి వరకు పత్తాలేడన్నారు. నాడు కాంగ్రెస్‌ ‌హయాంలో కరెంట్‌ ఉం‌డకపోయేదనని, కేసీఆర్‌ ‌హయాంలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు వోటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు. బిజెపి, కాంగ్రెస్‌ ‌వాళ్లకు మన ఊరు గురించి, మన ఇండ్లు తెలియదు. కానీ, ఆటో ఎక్కితే హరీష్‌రావు ఇంటికాడ దించుతడు.. గా ఉత్తమ్‌, ‌బండి సంజయ్‌కి ఏం ఎరుక రాజక్కపేట కష్టాలు అన్నారు. రాజక్కపేటలో ప్రస్తుత సిఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశాడనీ, మూడు చెక్‌డ్యాంలు కట్టించాడన్నారు. నాడు కేసీఆర్‌ ‌కట్టించిన చెక్‌డ్యాంలు ఇప్పుడు మేము వస్తుంటే నీళ్లతో దుంకుతుంటే ఎంతో సంబురం అనిపించిందన్నారు. రాజక్కపేట డీలిమిటేషన్‌కు ముందు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కేసీఆర్‌కు, నాకు భారీ మెజారిటీ ఇచ్చిందన్నారు.

Leave a Reply