రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సాగనంపే లక్ష్యంగానే భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో పాదయాత్రల పాలసీని చేపట్టినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒకదశ పాదయాత్ర చేపట్టగా మరికొందరు ఆ దిశగా పయనించేందుకు కేంద్ర నాయకత్వం ఆనుమతి తీసుకుంటున్నారు. కాగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత వారం రోజులుగా ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరున నిర్వహిస్తున్న పాదయాత్రకు మాత్రం విశేష స్పందన లభిస్తున్నది. ఒక విధంగా ఈ యాత్రం రాష్ట్రంలో రాజకీయ మార్పును తీసుకువొస్తుందా అన్నట్లుగా కనిపిస్తున్నది. ఏమాత్రం అలసట లేకుండా విశేష జనం ఈ యాత్రలో పాల్గొనడానికి రావడం ఇతర రాజకీయ వర్గాలను గాబరా పెట్టేదిగానే ఉంది. అలాగే ఈ యాత్రలో స్వయంగా పాల్గొంటామని ఆ పార్టీకి చెందిన లక్షకు పైగా కార్యకర్తలు ముందుకు రావడం కూడా నాయకుల ఉత్సాహాన్ని ఇనుమడింప జేస్తున్నది.
ఈ యాత్ర ద్వారా ఇక్కడి ప్రజల్లో భవిష్యత్‌లో సమర్థవంతమైన పాలన వొస్తుందన్న ఆత్మ విశ్వాసాన్ని నింపడంతో పాటు, రాష్ట్ర సాధన సందర్బంగా వారిలో నెలకొన్న ఆశలు, ఆశయాలను, ఆకాంక్షలు నెరవేరుతాయన్న నమ్మకాన్ని కలిగించాలన్నదే తమ లక్ష్యంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గత నెల 28న పాతబస్తీ చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి పూజలతో ప్రారంభించిన ఈ పాద యాత్ర ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో దిగ్విజయంగా జరుగుతున్నది. మహిళలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. యాత్ర పొడవున వివిధ వర్గాల వారు, కులాల వారిగా కూడా యాత్రకు తమ భారీ మద్దతును ప్రకటిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇంత పెద్ద ఎత్తున జనం యాత్రలో పాల్గొన్నది లేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీ ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నది.
టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేననడంతో పాటుగా, గోలకొండ కోటపైన భవిష్యత్‌లో ఎగిరేది కాషాయ జండానేనని చెబుతున్నట్లుగానే ఆ దిశగానే పార్టీ అడుగులు వేస్తున్న విషయం స్పష్టమవుతున్నది. టిఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎంను కూడా ఆ పార్టీ లక్ష్యంగా చేసుకుంది. ఎంఐఎంను దేశం నుండే తరిమేస్తామని ఈ సందర్భంగా నినాదాలు చేయడం గమనార్హం. తెలంగాణ కోసం ఏమాత్రం పాటుపడని ఎంఐఎంకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడాన్ని బిజెపి తీవ్రంగా తప్పు పడుతున్నది. ఎంఐఎం అన్నది రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరికి సంబంధించిన పార్టీ కాదన్న విషయాన్ని స్పష్టంచేసే ప్రయత్నం చేస్తున్నది. అలాగే నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని హిందువులకు పంచిపెడతామంటూ ఆ పార్టీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ పలు సందర్భాల్లో పేర్కొంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందంపైనే విస్తృత ప్రచారాన్ని ఆ పార్టీ చేపట్టింది. ఇదిలా ఉంటే పాదయాత్రను పురస్కరించుకుని ప్రజలకు చేరువ కావాలన్నది కూడా ఆ పార్టీ మరో ఎత్తుగడ. ఇందుకు పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతున్నది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారు ఎదుర్కుంటున్న సమస్యలను లేవనెత్తి, రాష్ట్ర ప్రభుత్వంపై వేలెత్తి చూపాలన్నది ఆ పార్టీ యోచన.
ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడకముందు నుండి ముఖ్యమంత్రిగా దళితుడికి అవకాశం కల్పిస్తామన్న మాట నిలుపుకోకపోవడం, అలాగే వారికి మూడు ఎకరాల భూమిని ఇస్తామన్న హామీలను నిలుపుకోలేకపోయిన విషయాన్ని విస్తృతంగా ఆ వర్గాల మధ్యకు తీసుకుపోవడం ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. అలాగే తెలంగాణ కోసం బలిదానం చేసిన విద్యార్థి యువకిశోరాల త్యాగాలను ఈ ప్రభుత్వం ఏడేళ్ళుగా గుర్తించక పోవడమే గాక, వారికి కల్పిస్తామన్న ఉద్యోగ, ఉపాధి, నిరుద్యోగ భృతి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఆ వర్గాలను ఆకట్టుకోవాలని బిజెపి ఈ యాత్రలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నది.
ఇదే వరుసలో మరోసారి పాత ఆయుధాన్ని మరోసారి సంధించే ప్రయత్నం చేస్తున్నది. రానున్న సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన వేడుకలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించాలన్న డిమాండ్‌ను మరోసారి ముందుకు తేబోతున్నది. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో పెద్ద ఎత్తున బహిరంగసభ నిర్వహించే ప్రయత్నాలు చేస్తుంది. కేంద్రం హోమ్ శాఖ మంత్రి అమిత్‌షాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించే ఏర్పాట్లు చేస్తున్నది కూడా. ఇదిలా ఉంటే బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆక్టోబర్ రెండున ముగియనుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం ద్వారా టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపియే అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పకనే చెప్పాలన్నది ఆ పార్టీ అభిప్రాయం. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు ఛత్తీస్ ఘడ్ మాజీ సిఎం రమణ్‌సింగ్, బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ లాంటి వారిని ఆహ్వానించే ఏర్పాట్లు చేస్తున్నది రాష్ట్ర బిజెపి పార్టీ.