- చట్టం వీరికి చుట్టమా.?
- అధికార పార్టీ ఆగడాలకు అంతు లేదా
- బొల్లారంలో ఫ్యాక్షనిజం నడుస్తోంది
- బిజెపి నేతల ఫైర్పటాన్చెరు, జనవరి 17 (ప్రజాతంత్ర విలేఖరి): పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీ తీస్తున్న బిజెపి అభ్యర్థిపై అధికార పార్టీ నాయకులు దారుణంగా దాడి చేశారు. తమకు వ్యతిరేకంగా బరిలో నీలుస్తావా?నీకు ఎంత ధైర్యం అంటూ బిజెపి అభ్యర్థిని చితకబాదారు. పోలీసులు వచ్చి గొడవను అపలేరని బిజెపి నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళితే… పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం మున్సిపాలిటీలో శుక్రవారం బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగో వార్డు బిజెపి అభ్యర్థి రోహిత్ బైక్ ర్యాలీతో ముందుకు వెళుతుండగా ఎదురుగా వచ్చిన అధికార పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఒక్కసారిగా రోహిత్‌తో వాగ్వివాదానికి దిగారు. తమకు పోటీగా వచ్చే ధైర్యం నీకు ఉందా?అంటూ రోహిత్‌ను చితకబాదారు. దాడికి పాల్పడడంతో బిజెపి కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు.
విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని రోహిత్‌తో కలిసి మున్సిపల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. బొల్లారంలో ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తోందని, అడ్డుకోవాల్సిన అధికారగణం అధికార పార్టీ నాయకులకు అండగా నిలవడం ఎంతవరకు న్యాయం అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రచారం నిర్వహించుకునే అధికారం ఉందని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమ అభ్యర్థి పై ఈ విధంగా దాడి చేయడం వారి పరాకాష్టకు నిదర్శనమని వారు మండిపడ్డారు. గాయపడిన రోహిత్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి బోల్లారం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
Tags: BJP leader Muralidhar, Road accident, BJP candidate injured