- కెటిఆర్‌ను సిఎం చేయాలన్న కోరిక నెరవేరదు
- మహిళలను కుక్కలతో పోల్చిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
- హాలియా హామీలు చూస్తుంటే సాగర్‌లో ఓటమి భయం పట్టుకుంది
- కెసిఆర్‌పై మండిపడ్డ బిజెపి నాయకురాలు డికె అరుణ
మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే భయంతోనే సీఎం మార్పు ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని అవి ఎన్నటికీ తీరని కలలుగానే ఉంటాయని అని డీకే పేర్కొన్నారు. మహిళలను కుక్కలతో పోల్చిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు పతనం చెందే సమయం దగ్గరకొచ్చిందని డీకే వ్యాఖ్యానించారు. అలాగే వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని ఆమె అన్నారు. తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధమని అరుణ ప్రశ్నించారు. ఇకపోతే నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే సీఎం కేసీఆర్ ఎన్నికల సభ నిర్వహించారని డీకే.అరుణ ఎద్దేవా చేశారు.
దుబ్బాకలో బీజేపీ గెలుపుతో కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు. ఓటమి భయంతోనే ఎంఐఎంతో పొత్తు లేదంటూ డ్రామాలాడారన్నారు. దుబ్బాక ఫలితంతోనే ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లారు, ముందస్తుకు వెళ్లినా హైదరాబాద్ ప్రజలు తగిన శాస్తి చేశారన్నారు. హాలియాలో హామీల వర్షం చూస్తుంటేనే కేసీఆర్ లో ఓటమి భయం ఎంత ఉందో తెలుస్తోందన్నారు. ఎన్నికల వేళ హామీల వర్షం, ఎన్నికలు ముగిసాక మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటేనన్నారు డీకే అరుణ. కూర్చేసుకొని కూర్చుంటా? కృష్ణా, గోదావరి నీళ్లతో కాళ్ళు కడుగుతా వంటి పదాలు కేసీఆర్ కు ఊత పదాలుగా మారాయన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక లో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. వాటిని ఎప్పుడు నెరవేర్చుతారో చెప్పాలన్నారు. కుల సంఘాలకు సీఎం కేసీఆర్ జీవోలు మాత్రమే ఇచ్చారని పైసలు మాత్రం ఇవ్వలేద న్నారు డీకే.
ఎమ్మెల్సీ ఎన్నికలున్నందునే పీఆర్సీ అంశాన్ని ఎత్తుకున్నాడన్నారు. ఇచ్చిందిలేదు, డ్రామాలు, కాలయపనలే ఉన్నాయన్నారు. ఉద్యోగులు కీలుబొమ్మలు కావొద్దని? కేసీఆర్ కుట్రలను పసిగట్టాలని సూచించారు. నాగార్జున సాగర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడించి బంగాళాఖాతంలో కలపాలని కోరారు. కడుపు కొడుతున్న కేసీఆర్ ను ఓటుతో కొట్టండి అని తెలిపారు. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంటే కూడా టిఆర్ఎస్ నాయకులు బానిసలుగా ఉండటం దారుణమన్నారు. ఇప్పటికైనా బయటకు రావాల న్నారు. ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారా అన్న డీకే ఏడేళ్లనుంచి అధికారంలో ఉన్నది వి•రే కదా.. అప్పటినుంచి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
టీఆరెస్ వీరుల పార్టీకాదు, తెలంగాణ ద్రోహుల పార్టీ అన్నారు. కేసీఆర్ భాష వీధి గుండాల ఉందన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన మహిళలను కుక్కలంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవంలేని సీఎం ఉన్నాడు కాబట్టే ..రాష్ట్రంలో ఈస్థాయిలో అత్యాచారాలు జరుగుతు న్నాయన్నారు. కేసీఆర్ రాజకీయాలను కాపడేందుకే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్లుందన్నారు. మజ్లీస్‌తో పొత్తు లేదన్నా. వారి మద్దతులేకపోతే మేయర్ కాలేని స్థితిలో టీఆర్ఎస్ ఉందన్నారు. టిఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లపై నమ్మకం లేకనే మజ్లీస్ ను నమ్ముకున్నారని తెలిపారు. మేయర్ ఎన్నికలో మజ్లిస్ మద్దతు తీసుకోవడంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.