Take a fresh look at your lifestyle.

బీజేపీ మళ్ళీ ‘జుమ్లా ..’!

పుదుచ్చేరికి ప్రత్యేక హోదా వాగ్దానం బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ ‌శాఖను వెంటాడుతోంది. తిరుపతి లోక్‌ ‌సభ స్థానాన్ని తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక మాదిరిగా సునాయాసంగా గెలవొచ్చనుకున్న బీజేపీ ఆశలు నీరుగారి పోయాయి. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానం చేసింది. కత్తితో పొడిచి గాయపరిస్తే గాయాలు కొంతకాలం ఉంటాయి. కానీ భావోద్వేగాలను దెబ్బతీస్తే జీవితకాలం అవి దెబ్బతీస్తాయి. పుదుచ్చేరి వాగ్దానం విషయంలో బీజేపీ చేసిన పని అదే.

పుదుచ్చేరికి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామనీ, జమ్ము, కాశ్మీర్‌ అభివృద్ధి విషయంలో అనుసరించిన వ్యూహాన్నే అనుసరిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. కేంద్ర ప్రతిపాదిత ప్రాజెక్టుల వ్యయం 30-70 ఫార్ములా ప్రకారం పంచుకునేందుకు సిద్ధమేనని బీజేపీ వాగ్దానం చేసింది. ఆంధప్రదేశ్‌ ‌విభజన చట్టం కింద విభజిత ఆంధప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇవ్వ లేదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు జేస్తామని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, మోడీ అధికారంలోకి వొచ్చి ఆరేడేళ్ళు గడుస్తున్నా, ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరికదా, ఆ ఊసేలేదని సంకేతాలిస్తుంది తమకు చేసిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెబుతారని ఆంధప్రదేశ్‌ ‌ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు,.

అంతటితో ఆగకుండా తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ముందు సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ను బీజేపీ- సేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 2014 లోక్‌ ‌సభ ఎన్నికల ముందు ఇదే తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, పవన్‌ ‌కల్యాణ్‌లు కలిసి ప్రచారం చేసిన సందర్భంలో ఆంధప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వాగ్దానం చేశారు. అప్పట్లో మోడీ ప్రజల చేత ‘అచ్చేదిన్‌’ అనే నినాదం చేసి ప్రత్యేక హోదా వొస్తుందనే ఆశలు రేకెత్తించారు. 1971 ఎన్నికల ముందు ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావో నినాదంలా ఆ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. వారిని ఆకట్టుకుంది. అయితే, ఏడేళ్ళు గడుస్తున్నా మోడీ ప్రభుత్వం ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోయే సరికి ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.

జగన్‌ ‌కేసుల్లో ఇరుక్కోవడం, చంద్రబాబునాయుకు వరుస పరాజయాలతో లేవలేని స్థితిలో కుప్పకూలడంతో ప్రత్యామ్నాయంగా పవన్‌ ‌కల్యాణ్‌ను చూపుతూ ప్రచారంలో దూసుకుని వెళ్దామనుకున్న బీజేపీ ఆశలు పుదుచ్చేరి ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా అంశంతో నీరుగారి పోయాయి. ఆంధప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరనప్పుడు పుదుచ్చేరికి ఎలా ఇస్తారని ఆంధ్రులు నిలదీస్తున్నారు. సిఎం సాబ్‌ అభ్యర్ధి పవన్‌ ‌కల్యాణ్‌ ఇరుకున పడ్డారు. మొత్తం మీద బీజేపీ వేసిన పాచిక బెడిసి కొట్టింది.

అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా భారతీయ జనతా పార్టీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తుంది. పౌర సత్వ సవరణ చట్టంపై బెంగాల్‌లో చట్టం అమలుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూనే..అస్సాంలో సవరణ చట్టం అమలు చేసి అస్సాం స్థానికులకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసి…మరుసటి రోజే పొరపాటున అటువంటి ప్రకటన వెలువడిందని సర్దుకోవడం హాస్యాస్పదం….! 2014లో అధికారం లోకి రావడానికి చేసిన వాగ్ధానాలు కేవలం …‘జుమ్లా’.. ఎన్నికల్లో విజయం కోసమేనని ఆ పార్టీ స్వయంగా అంగీకరించింది కూడా ..! 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ..తిరుపతి ఎన్నికల ప్రచార సభలో తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ..! ఇప్పుడు కమల నాథులు ఆ హామీని దాటవేయడమే కాకుండా ..ప్రత్యేక హోదా హామీ కోసం దిల్లీ పాలకుల మెడలు వొంచుతానని భారీ డైలాగులు కొట్టిన జన సేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌తమ తరఫున రాష్ట్రానికి కాబోయే ముఖ్య మంత్రి అని ప్రకటనలు చేయడం ప్రజలు గమనిస్తున్నారు.

Leave a Reply