రాష్ట్రాభివృద్ధి, ప్రయోజనాల రీత్యా ఈ పొత్తు అన్నప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా రాష్ట్రానికి అదనంగా జరిగే ప్రయోజనం ఏమిటో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, సీపీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగుతున్న నేపథ్యంలో పవన్ ఈ చట్టాలపై తన వైఖరి ఏమిటో చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. గత ఎన్నికల సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు లౌకిక వాదం వంటి పదాలు ఉపయోగించిన జనసేనాని ఇప్పుడు పంథా మార్చుకున్నారా? మత రాజకీయ దిశగా అడుగులు వేయదలుచుకున్నారా అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది.
గత కొంత కాలం నుంచి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న ఎపిసోడ్‌కు తెర పడింది. బీజేపీతో జనసేన పొత్తా లేక విలీనమా అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో గత ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి తర్వాతి నుంచి వినిపిస్తున్నదే. దీనికి కారణం లేకపోలేదు. సినీ నటుడు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరచూ చేసిన వ్యాఖ్యలే కమలం వైపు మొగ్గు చూపుతున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్ తదితర నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఇక పొత్తు లేదా విలీన ప్రకటన లాంఛనమే అనేది రాష్ట్ర ప్రజలకు ఆ రోజే అర్థం అయ్యింది. ఆ వెంటనే నిన్న విజయవాడలో ఇరు పక్షాలు కూర్చుని పలు అంశాలపై చర్చించుకోవటం, సాయంత్రానికి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పొత్తు ప్రకటన చేయటం జరిగిపోయాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు అన్నది కామన్ స్టేట్‌మెంట్. అయితే ఈ పొత్తు కోసం గత ఆరునెలలుగా తీవ్రంగా ప్రయత్నించిన పవన్ అనుకున్న లక్ష్యం నెరవేరినందుకు సంతృప్తిగానే ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
బేషరతు పొత్తు..
బీజేపీతో బేషరతుగా పొత్తు పెట్టుకుంటున్నట్లు ఉమ్మడి మీడియా సమావేశంలో పవన్ వెల్లడించారు. అంటే ఎటువంటి షరతులు లేకుండా బీజేపీతో కలిసి పని చేయటానికి సిద్ధమయ్యారు అని అర్థం చేసుకోవాలి. అంటే కాషాయాధిపతులు ఏం ఆదేశించినా జనసేన సర్దుకుపోతుంది. లేదా ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పని చేస్తుందని భావించాల్సి ఉంటుందేమో. బీజేపీతో స్నేహానికి ముగింపు పలికినప్పుడు పవన్ ఆ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని, కేంద్రం ఇవ్వచూపిన ప్యాకేజ్ పాచి పోయిన లడ్డు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరిగి దోస్తీని పునరుద్ధరించుకుంటున్న క్రమంలో ఏ కారణాలతో పొత్తు పెట్టుకుంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముగిసిన అధ్యాయంగా పరిగణిస్తోంది. విభజన హామీలు అన్నీ నెరవేరలేదు. ప్రత్యేకంగా అదనపు నిధులు కూడా రాష్ట్రానికి రాలేదు. రాష్ట్రాభివృద్ధి, ప్రయోజనాల రీత్యా ఈ పొత్తు అన్నప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా రాష్ట్రానికి అదనంగా జరిగే ప్రయోజనం ఏమిటో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, సీపీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగుతున్న నేపథ్యంలో పవన్ ఈ చట్టాలపై తన వైఖరి ఏమిటో చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. గత ఎన్నికల సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు లౌకిక వాదం వంటి పదాలు ఉపయోగించిన జనసేనాని ఇప్పుడు పంథా మార్చుకున్నారా? మత రాజకీయ దిశగా అడుగులు వేయదలుచుకున్నారా అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది.
పార్టీ భారం అయ్యిందా?
సినీ గ్లామర్ పునాదులపై 2008లో ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఆ మరుసటి ఏడాది 18 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో కూర్చుని పోరాటం చేయలేక తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఫలితంగా రాజ్యసభ ఎమ్‌పీ, తద్వారా కేంద్ర మంత్రి అయ్యారు. అక్కడితో రాజకీయ ప్రస్థానానికి దాదాపుగా ఫుల్‌స్టాప్ పడింది. అన్న పెట్టిన పార్టీలో యువరాజ్యం బాధ్యతలు కొంత కాలం చూసిన పవన్, ఆ తర్వాత అదే రాజకీయ వారసత్వంగా సొంత జెండా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు సొంతంగా నిలబడే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయలేకపోయారు అనే చెప్పాలి. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీతో స్నేహబంధంలోకి వెళ్లారు. నాలుగైదేళ్ల ప్రయాణం తర్వాత రెండు పార్టీలతో బంధాన్ని తెంచుకుని కొత్త స్నేహితులతో దోస్తీ కట్టారు. వామపక్షాలు, బీఎస్పీలో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలబడ్డారు. అయినా ఘోర ఓటమిని చవి చూశారు. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆ పార్టీ జెండా ఎగిరింది. స్వయంగా రెండు చోట్ల పోటీ చేసినా ఎక్కడా ప్రజలు ఆదరించలేదు. దీనితో గత ఆరు నెలల నుంచి బీజేపీతో స్నేహం కోసం తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారు. క్యూబా విప్లవ యోధుడు చేగువేరా పేరు చెప్పుకునే పవన్ క్షేత్ర స్థాయిలో మాత్రం ఎవరో ఒకరి వాటు(ఆసరా) లేకుండా నిలబడలేని పరిస్థితులు ఉన్నట్లు అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.
బీజేపీతో పొత్తును ప్రజా సమస్యలపై పోరాడటం వరకు పరిమితం చేస్తే పర్వాలేదు. కాని ఆ పార్టీ పెద్దలను, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు మత రాజకీయాలు ప్రారంభిస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్లే అవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ అంశాల్ని ఎత్తుకునే ప్రయాస జరిగింది. విజయవాడలో మత మార్పిడులు, తిరుపతి కొండ మీద అన్యమతస్థుల ప్రచారం వంటి వివాదాస్పద అంశాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఇదే కొనసాగిస్తే ప్రమాదకర రాజకీయ క్రీడ మొదలైనట్లే.
Tags: pawan kalyan, ap bjp party, bjp jsp work together