జీఓ 317ను సవరించాలని డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి : తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసుల బదిలీలకు సంబంధించిన జీఓ నం.317ను ఉద్యోగ సంఘాలతో చర్చించి సవరించాలన్న డిమాండ్‌తో బీజేపీ ఆదివారం కరీంనగర్‌లో జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఈ జాగరణ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకత్వంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీవో 317పై పోరాటం చేసి వారికి న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి వెంటనే జీఓ 317 ను సవరించాలనీ, అప్పటి వరకూ బీజేపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా గుజ్జుల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.