Take a fresh look at your lifestyle.

ద్వేషం, భయం వ్యాపింప చేస్తున్న బిజెపి

  • ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడానికే పాద యాత్ర
  • పంజాబ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 11 : మత సామరస్యం, ఐక్యత, గౌరవం కోసం నిలిచే దేశంలో బిజెపి ద్వేషాన్ని, భయాన్ని వ్యాపింప చేస్తున్నదని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. ఇది సరైన మార్గం కాదని, మన చరిత్ర కూడా అది కాదని ఆయన తెలిపారు. దేశ ఐక్యత కోసం ఆయన కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ ‌వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా ఎనిమిది రోజుల పాటు పంజాబ్‌లో కొనసాగే పాదయాత్రను బుధవారం ఉదయం ఫతేఘర్‌ ‌సాహిబ్‌ ‌జిల్లాలోని న్యూ దానా మండి, సిర్హింద్‌ ‌నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ద్వేషం, హింసాత్మక వాతావరణం వ్యాపించిందని, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని విభజించడానికి పూనుకున్నాయని అన్నారు.

ఒక మతం మరో మతానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, ఒక కులం మరొక కులంతో పోరాడేలా చేయడం, ఒక భాషకు వ్యతిరేకంగా మరో భాషను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వాతావరణాన్ని పాడు చేశారని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలనే సంకల్పంతో యాత్రను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు, దుకాణదారులు, వ్యాపారులు, మహిళలతో సహా సమాజంలోని వివిధ వర్గాలతో సంభాషించి, వారి నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత యాత్ర ద్వారా తాను అనుభవ పూర్వకంగా అనేక విషయాలను ఆకళింపు చేసుకున్నానని ఆయన అన్నారు. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినడంలోనే యాత్ర స్ఫూర్తి ఉందన్నారు. యాత్ర ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంలకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా అనేక సమస్యలను లేవనెత్తడం లక్ష్యంగా కొనసాగిందని రాహుల్‌ అన్నారు. తమిళనాడు నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాదన్నారని, అయితే తమిళనాడు, కేరళ కంటే కర్ణాటకలో యాత్రకు మంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఎలాంటి స్పందన రాదని బీజేపీ నేతలు చెప్పారని కానీ అక్కడ విశేష స్పందన వొచ్చిందని, మహారాష్ట్ర కంటే మధ్యప్రదేశ్‌లో స్పందన మరింత మెరుగ్గా ఉందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. అనంతరం హర్యానాలో పెద్దగా స్పందన ఉండదన్నారని కానీ మధ్యప్రదేశ్‌ ‌కంటే మెరుగ్గా ఉందన్నారు. తన భారత్‌ ‌జొడో యాత్ర విజయవంతమైందన్నారు. ఇప్పటి వరకు యాత్ర దాదాపు 3000 కి.మీ మేర సాగిందని తెలిపారు. తన పాద యాత్ర అసాధారణమేమీ కాదని పంజాబ్‌ ‌రైతులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు నడువకున్నా తనకన్నా ఎక్కువ నడుస్తారని, వారు పొలాల్లో, మండీలకు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు నడుచుకుంటూ వెళ్తారని…భారతీయులందరూ అదే చేస్తారని అన్నారు. అంతకుముందు ఉదయం రాహుల్‌ ‌గాంధీ గురుద్వారా ఫతేగర్‌ ‌సాహిబ్‌, ‌హజ్రత్‌ ‌సెఫిద్దీన్‌ ‌ఫరూకీ రౌజా షరీఫ్‌ ‌వద్ద నివాళులర్పించారు. మంగళవారం ఆయన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.

Leave a Reply