Take a fresh look at your lifestyle.

విస్తరణ కాంక్షలో ప్రజలను విస్మరించిన బిజెపి

హిమాచల్‌, ‌కర్నాటక ఫలితాలే ఇందుకు నిదర్శనం

బెంగళూరు,మే13 : నిరుపేదల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యమిచ్చి తీరాలన్న సంకల్పాన్ని లేదా లక్ష్యాన్ని బిజెపి తుంగలో తొక్కింది. కేవలం మాటలతో మభ్యపెట్టే యత్నాలు మాత్రమే సాగించింది. అందుకే కర్నాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు.  ఓటింగ్‌ ‌తీరుతెన్నులపై ఓటర్ల సామాజిక నేపథ్యాల ప్రభావాన్ని కూడా సర్వేలన్నీ వెల్లడించాయి.  లింగాయత్‌ ఓటర్లు ఈ సారి బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్‌ ‌వైపే ఎక్కువగా మొగ్గు చూపనున్నారని బాగా ప్రచారం జరిగింది. అటువంటిదే సంభవించలేదని సర్వే స్పష్టం చేసింది. బీజేపీ కొంత మేరకు వొక్కళిగ ఓటర్ల మద్దతును పొందగలిగింది. అయితే ఆ సామాజిక వర్గం చాలా వరకు జనతాదళ్‌ (ఎస్‌) ‌పక్షానే ఉన్నది. ఎస్సీ ఓటర్లలో వామపక్ష,మితవాద విభజన చోటు చేసుకోగలదని అందరూ భావించారు. అటువంటిదే జరగలేదు. ఇక ముస్లిం ఓటర్లలో చీలిక సంభవించ లేదు. దాదాపుగా ముస్లిం ఓటర్ల అందరూ కాంగ్రెస్‌కే ఓటు వేశారని తెలుస్తోంది. ఓటింగ్‌ ‌తీరుతెన్నులను జెండర్‌, ‌వర్గం (క్లాస్‌) ‌బాగా ప్రభావితం చేశాయని సర్వేలు వెల్లడించాయి.

బీజేపీకి కంటే కాంగ్రెస్‌కే 5 శాతం పురుష ఓటర్లు, 11 శాతం మహిళా ఓటర్లు అధికంగా ఓటు వేశారు. నెలకు రూ.20 వేలు, అంతకు మించి ఆదాయమున్నవారిలో అత్యధికులు బీజేపీకి ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో వీరు కేవలం 16 శాతంగా ఉన్నారు. మిగతా 84 శాతం మందిలో అత్యధికుల మద్దతును పొందడంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రగామిగా ఉన్నది. పేదలు, నిరుపేదలు కాంగ్రెస్‌కే అత్యధికంగా ఓటు వేయనున్నారని పోలింగ్‌కు ముందే నిర్ణయ మయ్యింది. 2024 సార్వత్రక ఎన్నికలలో నరేంద్ర మోదీని ఓడించేందుకై ఎలాంటి అద్భుత ఎత్తుగడలు పన్నవలసిన అవసరం ప్రతిపక్షాలకు లేదని కర్ణాటక ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌స్పష్టం చేశాయి. దేశాన్ని పీడిస్తున్న అసలు సమస్యలపై దృష్టిని కేంద్రీకరించ గలిగితే ప్రజలు ఆదరిస్తారని కర్నాటక ఫలితాలు సూచిస్తున్నాయి.  పేదల సంక్షేమం విషయమై చిత్తశుద్ధి చూపాలి. నిరుపేదలకు అండగా ఉంటామన్న భరోసా ఇవ్వాలి. నిరంతరాయంగా ఏడాది పొడుగునా ప్రజల కోసం రేయింబవళ్లు పనిచేయగలగాలి. అలా చేస్తూ పోతుంటే ప్రజలకు నమ్మిక ఏర్పడుతుంది. బిజెపి ఆ పని చేయలేకపోయింది. అధికారంలో రావడంతో విస్తరణ కాంక్షలో ప్రజలను విస్మరించింది. అందుకే హిమాచాల్‌, ‌కర్నాటకల్లో బొక్కబోర్లా పడింది.

Leave a Reply