Take a fresh look at your lifestyle.

చేతులెత్తేసిన బిజెపి ..?

bjp giveup in telangana municipal elections

శాసనసభ ఎన్నికలను మరిపించేవిగా మున్సిపల్‌ ఎన్నికలకోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. టిఆర్‌ఎస్‌ ఓటమే ధ్యేయంగా భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణం. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వచ్చినప్పటి నుండీ వార్‌ ‌వన్‌సైడే అంటోన్న అధికార పార్టీ సెంచరీ కొడుతామంటోంది. అయితే మంత్రులకు, ఎంఎల్‌ఏలకు మాత్రం ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఈసారి బాధ్యతనంతా వారికే అప్పగించడమేగాక, గతంలో మాదిరి కాకుండా ఏమాత్రం అశ్రద్ధ చూపించినా, తమ పరిధిలోని అభ్యర్థులను గెలిపించుకోలేకపోతే వారి మంత్రి, పార్టీ పదవులకే ఎసరువస్తుందని కరాఖండీగా ముఖ్యమంత్రి చెప్పడంతో వారు గందరగోళంలో పడిపోయారు. ఎన్నికల తంతు ప్రారంభానికి ముందు నుండే ఈ ఎన్నికలకోసం టిఆర్‌ఎస్‌ ‌సమాయత్తమవుతూనేఉంది. మున్సిపల్‌ ‌శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. మున్సిపాలిటీలకన్నా కార్పొరేషన్‌లపైనే ఆయన ప్రధాన దృష్టిని సారించినట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పదికి పది కార్పొరేషన్‌లపై ఎట్టిపరిస్థితిలో గులాబీ జంఢా ఎగురేయాలన్న లక్ష్యంగానే ఆయన క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నాడు. ఉపసంహరణ గడవులోగా బి ఫారాలు లేనివారిని ఉపసంహరింప••జేయాల్సిన బాధ్యత మంత్రులు, ఎంఎల్‌ఏలపైనే ఉండడంతో తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఒక రకంగా వారు కుస్తీ పడుతున్నారనే చెప్పవచ్చు.. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఎలాగైనా టిఆర్‌ఎస్‌ను తీవ్రంగా ప్రతిఘటించేందుకు ప్రతిపక్షపార్టీలు కూడా తమ రంగాన్ని సిద్ధంచేసుకుంటున్నాయి. అయితే ఈ పార్టీలు పెట్టుకునే పొత్తులపై ఇంకా స్పష్టతలేదు. అయినా వాటిపై ఓ కన్నువేసి ఉంచాలని కెటిఆర్‌ ‌నాయకుల సమీక్షా సమావేశాల్లో ఆదేశించాడు. బయట ఒకరినొకరు వ్యతిరేకించుకునే బిజెపి, కాంగ్రెస్‌పార్టీలు కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌కార్పొరేషన్ల ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందంచేసుకుంటున్నాయని, ప్రజలకు ఈ విషయాన్ని వివరించి, వారి నిజస్వరూపాన్ని బయట పెట్టడం ద్వారా ఆ పార్టీల ద్వంద్వ నీతిని వివరించాలని టిఆర్‌ఎస్‌ ‌తమ నాయకులకు సూచించింది. ఎన్నికలను ఎప్పుడూ సునాయాసంగా తీసుకునే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కూడా ఈ ఎన్నిక)ను ప్రతిష్టగానే తీసుకుని వ్యూహరచన చేస్తున్నారు.

వివిధ కార్పొరేషన్‌లలో జరిగే ఈ ఎన్నికలన్నిటినీ సమీక్షించేందుకు కేంద్ర సమన్వయ కమిటీనొకదాన్ని తొమ్మిది మందితో ఏర్పరిచి ఆయా కార్పొరేషన్‌ ఎన్నికల ఇన్‌ఛార్జీలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఏకగ్రీవం చేయాలన్న సూచనలున్నాయి. దానికి తగినట్లు కెటిఆర్‌ ‌నియోజక•వర్గంలో ప్రథమంగా 13 వార్డులు ఏకగ్రీవం కావడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉంది. ఇదిలా ఉంటే గత పార్లమెంట్‌, ‌శాసనసభ ఎన్నిక)కు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్‌ ‌పార్టీ ఈసారి పోటీలో పాల్గొనడం విశేషం. అయితే కేవలం ఆదిభట్ల, కొల్లాపూర్‌, ‌మహబూబ్‌నగర్‌ల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు చేసింది. అలాగే గత ఎన్నికల్లో సరిగా శ్రద్ధ చూపించని తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కేవలం 441 డివిజన్లకే పరిమితమైంది. ఎంఎఐఎం కూడా అదే సంఖ్యలో నామినేషన్లు వేసింది. ఎన్సీపీ నుంచి 36, బిఎస్పీ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారపార్టీని ఢీ కొట్టేందుకు అన్ని స్థానాలకు పోటీచేస్తుందనుకున్న కాంగ్రెస్‌ ‌కూడా పూర్తి స్థానాలకు పోటీపెట్టలేకపోయింది. లంగాణలో టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యమ్నాయం అని చెబుతున్న భారతీయ జనతాపార్టీ ఆ మేరకు మున్సిపల్‌ ఎన్నికల్లో తన సత్తా చూపించుకోలేకపోతున్నది. నామినేషన్‌ల గడువు ముగిసేనాటికి ఆ పార్టీ కనీసం ముప్పై శాతం స్థానాలకు కూడా నామినేషన్లు వేయలేకపోయింది. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంపై కాషాయ జంఢా ఎగురవేస్తామని చెబుతున్న ఈ పార్టీ స్థానిక ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోవడంపై పలు విమర్శలు కూడా వొస్తున్నాయి. టిఆర్‌ఎస్‌కు ధీటుగా ఎదుగుతున్నామని కేంద్ర నాయకత్వానికి చెబుతున్న రాష్ట్ర నాయకత్వం నిజస్వరూపాన్ని చూసి అగ్ర నాయకత్వం అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు తెలుస్తున్నది. ఇటీవల కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌, ‌టిడిపి లాంటి ప్రధాన పార్టీల నుండి అనేక మంది అగ్రనేతలను తమ పార్టీలో చేర్చుకున్న భారతీయ జనతాపార్టీకి అభ్యర్థుల కరువు కొరుకుడు పడకుండా పోయింది. వలసపోయిన నాయకులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. కనీసం అభ్యర్థులు నిలబడిన స్థానాలనైనా ఏమేరకు గెలుచుకుంటుందన్నది వేచి చూడాల్సిందే.

Tags: bjp party, congress vs trsparty, tdp, municipal elections

Leave a Reply