Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ గాలం

ఐఆర్‌, ‌పిఆర్సీ సమస్యలపై పోరుకు రెడీ త్వరలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
పెడుతున్నారు. ఇందులో భాగంగా     ఉద్యోగుల ఐఆర్‌, ‌పీఆర్సీ సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఆందోళనలు నిర్వహించి వారిని తమ పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐఆర్‌, ‌పిఆర్సీ సమస్యల విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తోంది. దీంతో ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికే వత్తాసు పలకడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం వంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఇదే కారణంతో ప్రభుత్వం ఇటీవల జరిగిన జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ఉపాధ్యాయులను పక్కనబెట్టింది. వారి స్థానంలో కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకుంది.
ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అయితే, ఆ కమిటీ ఇప్పటి వరకూ నివేదిక ఇవ్వలేదు. ఈ కమిటీ నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం విధించిన గడువు ఈనెల 31తో ముగియనుంది. ఈ కమిటీ నివేదిక నిర్దేశిత గడువులోగా ఇవ్వని పక్షంలో వచ్చే ఏడాది మరో కమిటీని నియమించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీ నేతలు ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎం‌సి ఎన్నికల సమయంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, శాసన మండలి మాజీ చైర్మన్‌ ‌స్వామిగౌడ్‌ ‌బీజేపీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను ఏకతాటిపై నడిపించిన అనుభవం స్వామిగౌడ్‌కు ఉంది. గతంలో పీఆర్టీయూ అధ్యక్షునిగా చాలా కాలం పనిచేసిన మోహన్‌రెడ్డి సైతం ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నారు. వీరిద్దరి అనుభవాన్ని, ఉద్యోగులపై వారికి ఉన్న పట్టును తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, ఉద్యోగులకు పిఆర్‌సి, ఐఆర్‌ ‌వెంటనే ఇవ్వాలనే డిమాండ్‌తో త్వరలో రాస్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై బీజేపీ చేపట్టే ఆందోళనలకు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు తెలపాలనీ, లేకుంటే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల సమస్యలపె ప్రభుత్వంపై  పోరాడకుండా సీఎం కేసీఆర్‌, ‌మంత్రుల మోచేతి నీళ్లు తాగుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాజకీయ పార్టీలు నిర్వహించే నిరసన కార్యక్రమాలలో ఏ విధంగా పాల్గొంటారని ఇటీవల భారత్‌ ‌బంద్‌కు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఉపాధ్యాయ సంఘాల నేత మోహన్‌రెడ్డి భవిష్యత్తులో పార్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి ఇప్పటి నుంచే మద్దతు కూడగడుతున్నట్లు సమచారం. ఐఆర్‌, ‌పీఆర్సీ వంటి సమస్యలపై పోరాటానికి కేవలం ఉపాధ్యాయులే కాకుండా పోలీసు, రెవెన్యూ వంటి ఇతర శాఖల ఉద్యోగుల మద్దతు కూడా ఎలా పొందాలనే అంశంపై సైతం బీజేపీ రాష్ట్ర నాయకులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply