Take a fresh look at your lifestyle.

బెంగాల్‌లో పాగా కోసం బీజేపీ… పట్టు నిలబెట్టుకోవడానికి తృణమూల్‌

బెంగాలలో మరో ఆరు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి.  ఈసారి బెంగాల్‌లో అధికారాన్ని సాధిస్తామంటూ కమలనాథులు గడిచిన కొద్ది మాసాలుగా  ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రంలో అధికార పార్టీ దేశమంతటా తన అధికారాన్ని విస్తరింపజేయాలనుకోవడం అసహజమూ కాదు, తప్పూ కాదు. కానీ, దానికి  అనుసరించే చర్యలు, చేపట్టే కార్యక్రమాలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. కానీ,  బెంగాల్‌లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోంది. ఆమె  కలకత్తా కాళీగా పేరొందిన నాయకురాలు.  కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు  పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించిన ధీర వనిత. పోరాటమే ఊపిరిగా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అధికారాన్ని చేపట్టినా అదే తీరులో ఆమె వ్యవహరిస్తున్నారు. అన్యాయాలను సహించలేకపోవడం, మాటకు మాట సమాధానం చెప్పడం  ఆమె నైజం. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకున్న స్వేచ్ఛను ఆమె పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. అయితే, తమది విలక్షణమైన పార్టీ అనీ, భారతీయ సంస్కృతినీ, మహిళలను గౌరవించే పార్టీ అని గొప్పలు చెప్పుకునే కమలనాథులు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించే విధంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా కొద్ది రోజుల క్రితం బంకూరా జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం మమతా బెనర్జీని రెచ్చగొట్టింది. బీహార్‌లో విజయం సాధించాం, ఇక బెంగాల్‌లో అధికారంలోకి రావడం మన అజెండా అని ఆయన అన్నారు. అంతవరకూ బాగానే ఉంది. దీదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకూ నిద్రపోం అని కూడా ఆయన ప్రకటించారు.  అంతేకాకుండా, ఆయన పర్యటన సందర్భంగా తృణమూల్‌ ఎం‌పీలకు ఎర వేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఆ తర్వాత ఈ వారంలోనే  బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా  కోల్‌ ‌కతాలో పర్యటించిన సందర్భంగా  ఆయన వాహన శ్రేణిపై  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఈ సందర్భంగా కొందరు గాయపడ్డారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కనుక, వారికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత మమతపైనే ఉంది. ఆమె సక్రమంగా తగిన చర్యలు తీసుకోలేదన్నది కమలనాథుల ఆరోపణ. దీనిపై విలేఖరులు ప్రశ్నించినప్పుడు రోజూ ఢిల్లీ నుంచి బయటవారు ఎవరో నడ్డా, పడ్డా, వొస్తుంటారు, ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు..అందరికీ ఎక్కడ సమాధానం చెప్పను అని ఆమె మామూలు ధోరణిలో వ్యాఖ్యానించారు. అయితే, జాతీయ పార్టీ అధ్యక్షునిపై జరిగిన దాడిని మమత తేలికగా తీసుకోవడమే కాకుండా, వ్యంగ్యంగా వ్యాఖ్యానించారంటూ కమలనాథులు పెద్ద సీన్‌ ‌సృష్టించారు. ఆమెను వారు అంతకన్నా తేలిక ధోరణిలో వ్యాఖ్యానించారనీ, అందుకే ఆమె ఉద్రేకపూర్వకంగా మాట్లాడారని తృణమూల్‌ ‌నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎవరు ముందు అనేది రాజకీయాల్లో ఉండదు. ఒకరినొకరు తిట్టుకోవడమే నేటి రాజకీయ సంస్కృతి అయినప్పుడు పది పడగలిగినప్పుడే ఒకటి అనాలి. ఈ విషయం కమలనాథులకు తెలియంది కాదు. అయినా, ఆమె కూడ ఇలాంటి సందర్భాల్లో సంయమనం పాటించడం అవసరమే. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ ‌జగదీప్‌ ‌థంకర్‌ ‌జోక్యం చేసకుని మమతా బెనర్జీని నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు జాగ్రత్త  అంటూ హెచ్చరించారు.

 

వయసు రీత్యా పెద్ద కనుక,  రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కనుక  రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడంలో తప్పులేదు. కానీ, నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు జాగ్రత్త అని హెచ్చరించడం కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. అందునా ఆమె బహుళ జనాదరణ పొందిన నాయకురాలు. మూడున్నర దశాబ్దాల పాటు బెంగాల్‌లో అధికారంలో కొనసాగిన వామపక్ష ఫ్రంట్‌ను గద్దె దింపి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆమె ఆకర్షించిన నాయకురాలు. రాజీపడని మనస్తత్వం ఆమెది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీనే  ఎదిరించిన  ధీశాలి. ఇద్దరూ కాంగ్రెస్‌ ‌పార్టీ ద్వారా రాజకీయాలలో ఎదిగిన వారే. ఇద్దరూ బెంగాలీలే. అందుకే, ఆమెను ప్రణబ్‌ ఎక్కువ అభిమానించేవారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో  రాజీ పడబోనని ఆమె ఆయన ఎదుటే కుండబద్దలు కొట్టారు. అలాగే, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, ఆ కూటమి చైర్‌ ‌పర్సన్‌ ‌సోనియాగాంధీతో కూడా ఆమె ఇదే తీరులో నిర్మొహమాటంగా మాట్లాడేవారు. అది ఆమె నైజం. ఆ విషయం గవర్నర్‌కి తెలియంది కాదు. గవర్నర్‌ ‌పదవులను రాజకీయ నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ‌పంచిపెడుతోందని గతంలో ఎద్దేవా చేసిన కమలనాథులు ఇప్పుడు చేస్తున్నది అదే. థంకర్‌ ‌రాజకీయాల్లో కాకుండా విద్యారంగంలో సేవలందించి రిటైర్‌ అయ్యారు. ఆయన వొచ్చిన దగ్గర నుంచి  మమతా బెనర్జీతో ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంది.  ఆయన గవర్నర్‌గా కాకుండా, బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ మమత చాలా సార్లు ఆరోపించారు.

మమత ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఇప్పటికి ఎన్నో సార్లు కేంద్రానికి నివేదిక పంపారు. నడ్డాపై జరిగిన దాడి సంఘటనపై కూడా నివేదిక పంపడం, దానిపై కేంద్ర హోం శాఖ రాష్ట్ర  పోలీసు డిజిపినీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సమన్‌ ‌చేసింది. దీంతో మమత మరింత ఆగ్రహోదగ్రురాలయ్యారు. తృణమూల్‌ ‌నాయకుడు చెప్పినట్టు మమతను మరింత రెచ్చగొట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం కేంద్రం ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం కమలనాథులకు ఇష్టం లేదు. ఆ పార్టీ నాయకులు ఇప్పటికే రాష్ట్రపతి పాలన డిమాండ్‌ను కోరస్‌గా అందుకున్నారు. కాంగ్రెస్‌ ‌దారిలోనే బీజేపీ నడుస్తోందనడానికి ఇదే ఉదాహరణ.

Leave a Reply