Take a fresh look at your lifestyle.

కమలాన్ని చీపురుతో ఊడ్చేసే యత్నం

గుజరాత్‌లో కమలాన్ని చీపురుతో ఊడ్చేసే ప్రయత్నంలో ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) ‌పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీని గద్దె దింపాలని ఆప్‌తో పాటు కాంగ్రెస్‌కూడా విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న బిజెపి ఇప్పుడు గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొస్తున్నది. ఇంతకాలం గెలుపు నల్లెరుపై నడకే అనుకున్న బిజెపి అధికారాన్ని నిలుపుకోవాడంకోసం ప్రజలకు మరింత సన్నిహితం కావడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం కావడంతో ఈ రాష్ట్రాన్ని గెలుచుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతుండడంతో ఇక్కడ ముక్కోణపు పోటీ అనివార్యమైంది. అయితే కాంగ్రెసే తమకు ప్రధాన పోటీ దారని సాక్షాత్తు కేంద్ర మంత్రి అమిత్‌షా చెబుతుండగా, వాస్తవంగా తాము పోటీ పడుతున్నది బిజెపితోనే అని ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌ ‌ప్రకటిస్తున్నాడు. వీరిద్దరుకూడా కాంగ్రెస్‌ను రెండవ స్థానంలోకి నెడుతుండగా ఆ పార్టీ మాత్రం 27 ఏండ్లుగా పాలనసాగిస్తున్న బిజెపిపై ఇక్కడ ప్రజలకు సహజంగా ఉండే వ్యతిరేకత తమను గెలిపిస్తుందన్న ధీమాను కాంగ్రెస్‌ ‌వ్యక్తం చేస్తున్నది.

రాష్ట్రంలో రెండు విడుతలుగా జరుగనున్న పోలింగ్‌ ‌డిసెంబర్‌ ఒకటిన ప్రారంభం కానుంది. అంటే మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రథానంగా పోటీ పడుతున్న ఈ మూడు పార్టీలు అనేక హామీల ద్వారా వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ సొంత రాష్ట్రం కావటంవల్ల ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా పలు దఫాలుగా రాష్ట్రానికి వొచ్చిన సందర్భంగా కోట్లాది రూపాయల విలువచేసే పనులకు శ్రీకారం చుట్టిపోయారు. అలానే దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను ఆయన గుజరాత్‌కు ఆహ్వానంచడం, ప్రధాని హోదాలో మోదీ ఇప్పటికే నాలుగుసార్లు రాష్ట్రంలో పర్యటించడం చూస్తుంటే ఇక్కడ ఎన్నికలపట్ల ఆయన ఎలాంటి ఆందోళనకు గురి అవుతున్నారన్నది స్పష్టమవుతున్నది. వాస్తవానికి బిజెపికి సాంప్రదాయ వోట్లు బాగానే ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికలను కాంగ్రెస్‌, ఆప్‌కూడా సీరియస్‌గానే తీసుకోవడం బిజెపికి ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌ ‌ప్రకటిస్తున్న రాయితీలు, పథకాలు ప్రజ)ను ఆలోచింపజేస్తున్నాయి. దిల్ల్లీలో ఆప్‌ ‌చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు మంచి ఫలితాలను ఇస్తుండడమే ఇందుకు కారణం. ఇక్కడ కూడా తమను గెలిపిస్తే దిల్ల్లీలోలాగా ఉచిత వైద్యం, చిన్నపిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఆప్‌ ‌ప్రచారం చేస్తున్నది. అలాగే ప్రతీ కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ‌పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి,, రైతులకు మూడు లక్షల వరకు రుణ మాఫీ, 500 వందల రూపాయలకే గ్యాస్‌ ‌సిలెండర్‌ ‌సరఫరా చేస్తామంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆప్‌.

అయితే కాంగ్రెస్‌కూడ అందుకు తామేమీ తీసిపోమన్నట్లుగా ఇంచుమించు ఇలాంటి రాయితీలనే ప్రకటించింది. పేద మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే విధంగా పథకాల ప్రణాళికను రూపొందించింది. ఆప్‌ ‌లాగా కాంగ్రెస్‌కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ‌సరఫరా చేస్తామని చెబుతున్నది. తాము అధికారంలోకి వొస్తే పది లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, అందులో మహిళలకు యాభై శాతం కేటాయిస్తామని చెబుతున్నది. అదే విధంగా మహిళలు, వితంతువులు, వృద్ధులకు రెండు వేల చొప్పున పెన్షన్‌ ‌సౌకర్యం కల్పిస్తామని, మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీచేస్తామని ప్రకటించింది.ఆప్‌ ‌లాగానే మూడు వేల జీవన భృతిని, 500 రూపాయలకే గ్యాస్‌ ఇస్తామని చెబుతోంది. ముఖ్యంగా తాము అధికారంలోకి వొస్తే అహ్మదాబాద్‌ ‌లోని స్టేడియంకు మోదీ పేరును మార్చి సర్దార్‌ ‌వల్లభబాయ్‌ ‌పటేల్‌ ‌పేరును పెడుతామని కాంగ్రెస్‌ ‌హామీ ఇస్తోంది. ఎలాగైనా ఈసారి గుజరాత్‌ను బిజెపినుండి చేజిక్కించుకోవాలని చూస్తున్న చెయ్యి పార్టీకి అనుకోకుండా ఎదురు దెబ్బలు తాకుతున్నాయి.

ఒక వైపు నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల రణరంగంలోకి నాయకులు దూసుకుపోతుంటే మరి కొందరు సీనియర్లు ఇదే సమయంలో పార్టీని వీడిపోవడం ఆ పార్టీకి ఎదురు దెబ్బగా మారింది. పార్టీనుండి ఒకటి రెండు రోజుల్లోనే ముగ్గురు ఎంఎల్‌ఏలు పార్టీ మారి కాషాయ కండువ కప్పుకోవడం కాంగ్రెస్‌ ‌పార్టీకి మొదట్లోనే దెబ్బతీసినట్లు అయింది. బిజెపిలో కూడా ఇలాంటి ముసలం ఉన్నా పెద్దగా బయటికి రావడంలేదు. కాని, ఆ పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు తనకు టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో రెబల్‌గా పోటీలో నిలబడడం ఆ పార్టీలోని అంతర్ఘత కలహాలను ఎత్తిచూపుతున్నది. ఇకపోతే తమ పార్టీ నాయకులను బిజెపి అపహరిస్తున్నదని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని ఒక అభ్యర్థిని కిడ్నాప్‌చేసి వొత్తిడి చేస్తున్నారంటూ బిజెపిపైన ఆయన చేసిన ఆరోపణలు బిజెపికి అపకీర్తిని తెచ్చేవిగా ఉన్నాయి. గతంలో కేవలం 27 స్థానాలకే పోటీచేసిన ఆప్‌కు డిపాజిట్లుకూడా రాలేదు. కాని ఇప్పుడు రాష్ట్రంలోని 182 స్థానాలకు పోటీ పడుతోంది. కాగా ఆప్‌ ‌వల్ల బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీల్లో ఎవరి వోట్లు చీలుతాయన్న విషయంలో రాజకీయ పరిశీలకులు ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు.

Leave a Reply