Take a fresh look at your lifestyle.

జీవుల మనుగడకై జీవవైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిద్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిద్యం సుమారు 3.5 బిలియన్‌ ‌సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం, కాలుష్యం, చెందడంతో భూగోళం వేడెక్కి పోతుంది. దీంతో జీవవైవిద్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో అనేక రకాల జంతువులు, పక్షులను పెంచేవారు. రాను రాను అవి కనుమరుగైపోతున్నాయి.జీవ వైవిధ్యానికి తెలంగాణ రాష్ట్రం కాణాచి. అనేక రకాల జంతు, పక్షి జాతులకు నెలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలువటానికి ముందు తెలంగాణ దట్టమైన అడవులతో అలరారింది. ఇప్పటికీ దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో అడవులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు కూడా రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి గ్రామానికి అనుబ ంధంగా చెరువులు ఉండటంతో మత్స్య పరిశ్రమ కూడా చాలా మందికి జీవనాధారంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన చెరువులను మిషన్‌ ‌కాకతీయ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుండటంతో పరోక్షంగా మత్స్య పరిశ్రమకు కూడా మేలు జరుగుతున్నది.
తెలంగాణలో అంతరించిపోతున్న ముఖ్యమైన జంతుజాతులు పెద్దపులులు, చిరుతపులులు, అడవిదున్నలు, నాలుగు కొమ్ముల జింకలు, కృష్ణజింకలు, మంచినీటి మొసళ్లున్నాయి.నిజామాబాద్‌ ‌నుంచి ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాల మీదుగా ఖమ్మం జిల్లా వరకు గోదావరి నదీతీరం వెంబడి ఉన్న దట్టమైన టేకు తోటలు తెలంగాణ అడవులకు వరంగా ఉన్నాయి.టేకుకి తోడు ఏటా ఆకురాల్చే జాతులకు చెందిన నల్లమద్ది, రోజ్‌వుడ్‌, ‌నరేపా, వెదురు మొదలైన అనేక రకాల వృక్షాలకు తెలంగాణ అడవులు నిలయంగా ఉన్నాయి. రాష్ట్ర అటవీ విధానం, అడవులను పరిరక్షించడానికి మరింత అడవిని వృద్ధి చేయడం, ఉత్పాదికతను మెరుగుపర్చడం, ఆర్థిక పరమైన విలువను పెంచడానికి రాష్ట్ర అటవీశాఖకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.వన్యప్రాణులను సంరక్షించడం కోసం భారత ప్రభుత్వం-1952లో ఇండియన్‌ ‌బోర్డ్ ‌ఫర్‌ ‌వైల్డ్ ‌లైఫ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జమ్ముకశ్మీర్‌లో మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు.
వన్యప్రాణుల గురించి అవగాహనను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణజింకను రాష్ట్ర జంతువుగా, పాలపిట్లను రాష్ట్ర పక్షిగా, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది.తెలంగాణ ప్రభుత్వ జీవవైవిద్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో 12 ప్రాంతాలను ఆరక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 9 వన్యప్రాణి ఆశ్రమాలు, 3 జాతీయ వన్యప్రాణి నిలయాలు 5,692.48 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.
ఇది తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అడవి ప్రాంతంలో 19.73 శాతం ఉంది.ప్రారంభంలో సహజ ఆవరణ వ్యవస్థల పరిరక్షణ అనేది కేవలం కలపతోపాటు కొన్ని ముఖ్యమైన వన్యజీవుల సంరక్షణకు మాత్రమే పరిమితమై ఉండేది. తర్వాత కాలంలో ఆవరణ వ్యవస్థలోని ప్రతి సూక్ష్మజీవి కూడా జీవావరణ సమతుల్యతకు కారణమవుతుందని పర్యావరణవేత్తలు గుర్తించారు. ఆధునిక బయోటెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ జీవవైవిధ్యం కంటే జీవుల్లోని జన్యుపరమైన వైవిధ్యం మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో జీవ వైవిధ్య భావన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
జీవవైవిధ్యం ప్రధానంగా మూడుస్థాయిలలో ఉంటుంది. అది 1.జన్యువైవిధ్యం, 2. జాతివైవిధ్యం, 3. ఆవరణ వ్యవస్థలవైవిధ్యం. ‘’జన్యువైవిధ్యం’’ అనేది ఒక జాతి జీవులలో ఉన్న వైవిధ్యం, సాధారణంగా తమలో తాము అంతర ప్రజననం చెందుతూ సమాన లక్షణాలున్న జీవుల సమూహాన్ని ఈ వైవిధ్యంలో చూస్తాం. ఉదాహరణకు మనుషులందరూ ఒకే జాతికి చెందిన వారైనా వారి మధ్య జన్యుపరమైన తేడాలుంటాయి. ఇక రెండవది ‘’జాతివైవిధ్యం’’ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న భిన్న జీవజాతుల సముదాయాన్ని జాతి వైవిధ్యం అంటారు.ఈ వైవిధ్యాన్ని ఒక చదరపు కిలోమీటర్‌ ‌రాష్ట్రం,దేశం పరిధిలతో పాటు ప్రపంచం మొత్తానికి లెక్కిస్తారు.ఒక దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య, భిన్న దేశాల మధ్య జీవవైవిధ్య భేదాలను గుర్తించేందుకు తులనాత్మక అంచనాకు వచ్చేందుకు జాతి వైవిధ్య అధ్యయనం ఉపయోగపడుతుంది.
ఇక మూడవది ఆవరణ వ్యవస్థల వైవిధ్యం భూమిపై ఉన్న విభిన్న భూజల చరజీవ మండలాల వైవిధ్యాన్ని ఆవరణ వ్యవస్థ వైవిధ్యం అంటారు.ఉష్ణోగ్రత వర్షపాతం లాంటి అంశాల్లో ఆవరణ వ్యవస్థలు ఒక దానికొకటి భిన్నంగా ఉంటాయి.ఆవరణ వ్యవస్థలోని జాతి జన్యు జీవవైవిధ్యాన్ని భౌతిక రసాయనిక నిర్జీవ కారకాలు నిర్ధేశిస్తాయి.అధిక జీవవైవిధ్యానికి నిలయాలుగా ఉంటూ తీవ్రస్థాయి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జీవ భౌగోళిక ప్రాంతాన్ని జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లుగా పిలుస్తారు. ఒక భౌగోళిక ప్రాంతం హాట్‌స్పాట్‌గా గుర్తించబడాలంటే అక్కడ 70 శాతం కి పైగా తన సహజ ఆవాసాన్ని జంతు వృక్షజాలాన్ని కోల్పోయి ఉండాలి. ఉత్తర మధ్య అమెరికా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్‌లు ఇప్పుడు ప్రపంచ జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లాగా పేరొందాయి.
17 దేశాలను అత్యధిక జీవవైవిధ్యం గల మెగా బయోడైవర్సిటీ దేశాలుగా గుర్తించారు.వైవిధ్యమే సృష్టిలక్షణం అని మనం అర్థం చేసుకోవలసింది. సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు. ఏదీ తక్కువ కాదు. అన్నీ సమానమే. అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతీ అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. అంటే మనం అర్థం చేసుకోవలసింది జీవన విధానం ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పద్ధతులు అన్ని కూడా సృష్టి చక్రానికి లోబడి ఉన్నాయి.సృష్టి చక్రానికి లోబడే అన్ని ప్రాణులు జీవిస్తూ ఉంటాయి. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక నిరంతర ఆవృత వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగతా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగతా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి.
వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది. ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అనారోగ్యాలకు చికిత్స, వైద్యం చేయడానికి జీవవైవిధ్యం చాలా ముఖ్యం. అనేక మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలను మందుల తయారీకి వాడడం చూస్తున్నాం.మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి.చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా, భూమిపై  ఉన్న జీవజాతి అన్నింటిని కూడా పక్షులను, జంతువులను ప్రేమతో పెంచాలి. అప్పుడే వాటి మనుగడ కొనసాగుతుంది.మానవుల మనుగడకు సార్ధకత చేకూరుతుంది.
image.png
మోటె చిరంజీవి, 9949194327.

Leave a Reply