సూర్యాపేట, సెప్టెంబర్ 28, ప్రజాతంత్ర ప్రతినిధి): భారత వ్యవసాయాన్ని బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించే మూడు చట్టాలను బిజెపి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వచ్చే నెల అక్టోబర్2 తేదీ గాంధీ జయంతి, లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలలో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మూజువాణి ఓటుతో చట్టాలను ఆమోదించుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ కాంట్రాక్టు వ్యవసాయంను ప్రోత్సహించడం, పంటలకు మద్దతు ధరల నిర్ణయం బాధ్యత నుండి తప్పుకొంటూ ధరల నిర్ణయం, మార్కెంటింగ్, ధాన్యపు నిల్వలు వంటి అంశాలు ప్రైవేట్ రంగాలకు అప్పగించడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరికుంట్ల వేణుగోపాల్, బైరు శైలేందర్ గౌడ్, దారావత్ వీరన్న నాయక్, రావుల రాంబాబు, పిడమర్తి మల్లయ్య, పందిరి వెంకన్న, భాస్కర్, శ్రీనివాసరావు, నాగు నాయక్, మధుకర్, సత్యనారాయణ పాల్గొన్నారు.