“జాతీయ రాజకీయ వాతావరణంలో ఇక్కడ గెలుపు ఎన్టీడీయే, యూపీఏ కూటమికి ముఖ్యం. ప్రస్తుతం బీహార్ గడ్డపై జేడీయూ నేతృత్వంలో ఎన్టీడీయే అధికారంలో ఉంది. నితీశ్ కుమార్ మూడో దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు…ఈ ఎన్నికల్లో గెలిస్తే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ విషయంలో స్నేహితుల మధ్య స్పష్టత ఉంది.”
బీహార్‌లో ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలంలో జరుగుతున్న మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రికార్డ్ కూడా ఈ ఎన్నికలకు దక్కనుంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో ఈ నెల 28 నుంచి మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్3, 7 తేదీల్లో రెండు, మూడు దఫా ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ పదో తేదిన చేపట్టనున్నారు. మొదటి దశ ఎన్నికల్లో 71 స్థానాలకు పోలింగ్ జరుగుతుంటే 1065 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ప్రస్తుత జాతీయ రాజకీయ వాతావరణంలో ఇక్కడ గెలుపు ఎన్టీడీయే, యూపీఏ కూటమికి ముఖ్యం. ప్రస్తుతం బీహార్ గడ్డపై జేడీయూ నేతృత్వంలో ఎన్టీడీయే అధికారంలో ఉంది. నితీశ్ కుమార్ మూడో దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు…ఈ ఎన్నికల్లో గెలిస్తే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ విషయంలో స్నేహితుల మధ్య స్పష్టత ఉంది.
కూటములు- బలాలు-బలహీనతలు :
ప్రస్తుతం అధికారంలో ఉన్న పక్షంగా నితీశ్ నేతృత్వంలోని కూటమికి కొన్ని అడ్వాంటేజ్‌లు ఉంటాయి. తమ ప్రభుత్వం చేసుకున్న పనులను ప్రజల్లోకి వెళ్లి చెప్పుకునే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం అయినా ఐదేళ్ళపాటు అధికారంలో ఉంటే ఎంతో కొంత అభివృద్ధి, సంక్షేమం చేపడుతుంది కనుక ఆ మేరకు ప్రజల్లో సానుకూలత ఉంటుంది. అదే సమయంలో కొంత వ్యతిరేకత కూడా అధికార పక్షానికి ఉంటుంది. ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా లేదా ఆశించినంత స్థాయిలో లేకపోవటం, అవినీతి, అక్రమాల్లో నేతల పాత్ర వంటివి ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయి. ఎన్నికల ముందు జరిగే కప్పదాట్లు, రెబల్స్ తలనొప్పులు, కూటమి లోపల బయట ఎత్తుగడలు అన్నీ కూడా గెలుపు ఓటముల్లో తమవైన పాత్ర పోషిస్తాయి. బీహార్‌లో తాజాగా రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపి-లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే కూటమి నుంచి పాక్షికంగా బయటకు వచ్చింది. పాక్షికంగా అంటే కూటమిలోని జేడీ(యూ)తో కటీఫ్ చెప్పేసింది. అలాగని బీజేపీతో స్నేహాన్ని వదులుకోలేదు. ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలో నిలబడటానికి ఎల్జెపి సిద్ధమయ్యింది. అయితే బీజేపీ అభ్యర్ధులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టరు. ఈ మేరకు ఒక మధ్యే మార్గాన్ని పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ వ్యూహ రచన చేశారు. దీని వెనుక పెద్ద ఎత్తుగడ ఉందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఒక వేళ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తమ సంఖ్యాబలంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడితే ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయవచ్చని, కనీసం ఉపముఖ్యమంత్రి పదవి అయినా రాకపోతుందా అన్నది చిరాగ్ లెక్క అయి ఉండవచ్చు. నాణెం మరోవైపు పడిందనుకోండి ప్రత్యర్థి కూటమి మహా ఘట్ బంధన్‌కి జై కొట్టొచ్చు. అంటే తామరాకు మీద నీటి బిందువులా ఉన్నట్లు ఉండాలి, లేనట్లు ఉండాలి. అంతిమంగా అత్యధిక లబ్ది చేకూరాలి.
బీహార్ ఎన్నికల క్షేత్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవటానికి శక్తులన్నీ ఒడ్డుతున్న మరో కూటమి మహా ఘట్ బంధన్. దీనిలో రాష్ట్రీయ జనతాదళ్ 144, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 70, మిగిలిన 29 స్థానాల్లో వామపక్షాలు, ఇతర పార్టీలు తమ దృష్టం పరీక్షించుకుంటున్నాయి. లాలూ ప్రసాద్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు తేజస్వీ యాదవ్…యువ బీహార్ ప్రతినిధిగా తనను రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి వారసత్వ ఛాయలు అంటకుండా ఒక యువ రాజకీయ నాయకుడిగా ఎన్నికల ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. తండ్రి లాలూ, తల్లి రబ్రీ దేవీల ఫోటోలు కూడా ఎన్నికల ప్రచారంలో పెద్దగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘నయీ సోచ్ నయా బీహార్, అబ్కీ బార్ యువ సర్కార్’ (కొత్త ఆలోచన, కొత్త బీహార్- ఈ సారి యువ ప్రభుత్వం) అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రస్తుతం లాలూ అవినీతి కేసుల్లో జైల్లో ఉండటం ప్రత్యర్థులకు ఆయుధం అయితే…పదిహేనేళ్ళ కిందటి సంఘటనలు నేటి యువ ఓటర్లపై ప్రభావం పడదన్నది తేజస్వీ వర్గం ఆశ. పైగా బిహార్‌లో 24 శాతం ఓటర్లు 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు వారేకావటం తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్ వంటి యువ రాజకీయ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం, కరోనాపై ప్రభుత్వ వైఫల్యాలను ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నాల్లో వీరు ఉన్నారు. పశుదాణా కేసులో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూకు కోర్టు బెయిల్ ఇచ్చింది. లాలూ ఎన్నికల రంగంలో ఉంటే పరిస్థితుల్లో మార్పు ఉండేదేమో. అయితే ట్రెజరిని మోసం చేసి మూడు కోట్లకు పైగా కాజేశారన్న కేసులో బెయిల్ దొరక్కపోవటంతో…ఈ ఎన్నికల సందడి లాలూ లేకుండానే సాగనుంది. ‘సమోసాలో ఆలూ ఉన్నంత వరకు బీహార్‌లో లాలూ ఉంటాడని’ లాలూ చమత్కరించినా…ప్రస్తుత పోల్ సీన్లో ఆయనకు చోటు లేదనే అనుకోవాలి. గత 30 ఏళ్ళల్లో లాలూ లేని తొలి ఎన్నికలుగా వీటిని చెప్పాలి.
కుల సమీకరణాలు :
ఎన్నికల్లో అభివృద్ధి నినాదం ఎంత ముఖ్యమో కుల సమీకరణాలు కూడా అంతే కీలకం. ఈ రాష్ట్రంలో రెండు ముఖ్య దళిత రాజకీయశక్తులు, ఎల్జెపి, హిందుస్తానీ అవామీ మోర్చా -హెచ్ఎఎమ్ (ఎస్) ఎన్డీయేతోనే చేతులు కలుపుతున్నాయి. హెచ్‌ఏఎమ్‌కు మాంఝీ నాయకత్వం వహిస్తున్నారు. ఐదేళ్ళ క్రితం జనతాదళ్ (యు) నుంచి బయటకు వచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు మహా ఘట్‌బంధన్‌తో ప్రయాణం చేసిన ఆయన ఎన్నికలకు ముందు ఈ ఆగష్ట్‌లో ఎన్డీయే కూటమిలోకి జంప్ చేశారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం మంది దళితులే కావటంతో ఈ రెండు పక్షాల ఓట్లు ఎంత కీలకమో అర్థం అవుతుంది. ముస్లిములు, యాదవులు..ఈ రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఇప్పటికీ, రాష్ట్రీయ జనతాదళ్ వెనుకే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి గెలిచిన మహా కూటమి నుంచి నితీశ్ బయటకు రావటంతో ఆ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని జేడీ-యూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో పోరాటం చేశాయి. ఆ ఎన్నికల్లో మహా కూటమి 41.9 శాతం ఓట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. అప్పుడు ఎన్డీయే కూటమికి 29.2 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి తరపున ముఖ్యమంత్రి అయిన నితీశ్ కూటమి ఫిరాయించటంతో అధికార పక్షం వైపు ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్ రాత్రికి రాత్రి ప్రతిపక్ష స్థానాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. జేడీ-యూ రాకతో అటు ఎన్డీయే కూటమి బలపడింది. దీనికి తగిన కుల సమీకరణాలు కూడా ఈ ఎన్నికల్లో మారిపోయాయి. దళితులు, ఓబీసీ, ఉన్నత కులాలు ఎన్డీయేకు బాసటగా నిలబడే అవకాశాలున్నాయి. రాష్ట్ర జనాభాలో 13 శాతం ఉన్న యాదవులు, 17శాతంగా ఉన్న ముస్లిం వర్గాలు మహాకూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని స్థానిక విశ్లేషణ. పదిహేనేళ్ళ నితీశ్ అనుభవానికి, యువకెరటంగా చెప్పుకుంటున్న తేజస్వీ ఆకాంక్షలకు మధ్య పోటీలో బీహార్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూద్దాం.