Take a fresh look at your lifestyle.

గ్రేటర్‌ ‌దెబ్బకు కోలుకోలేకపోతున్న టిఆర్‌ఎస్‌

“టిఆర్‌ఎస్‌కు ఎన్నికలంటేనే భయం పట్టుకుంది. దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా విజయం సాధించడంతో ఆ ప్రభావం గ్రేటర్‌పై పడవొద్దన్న ఉద్దేశ్యంగా తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోయింది. ప్రతిపక్షాలేవీ గ్రేటర్‌ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో తమకే విజయం సిద్ధిస్తుందని అధికార పార్టీ ఊహించింది. కాని, ఆ పార్టీ అంచనాలన్నీ తల్లక్రిందులైనాయి. గత ఎన్నికల్లో వొచ్చిన స్థానాలకన్నా ఎక్కువే వొస్తాయని గట్టి నమ్మకంతో ఉండింది. కాని, విధి వక్రించి గత స్థానాలకు సగం స్థానాలనే ఆ పార్టీ గెలుచుకోవడమన్నది కేవలం ఆ పార్టీకే కాకుండా రాజకీయ విశ్లేషకులందరినీ ఆశ్చర్యపర్చింది.”

‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత టిఆర్‌ఎస్‌కు ఎన్నికలంటేనే భయం పట్టుకుంది. దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా విజయం సాధించడంతో ఆ ప్రభావం గ్రేటర్‌పై పడవొద్దన్న ఉద్దేశ్యంగా తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోయింది. ప్రతిపక్షాలేవీ గ్రేటర్‌ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో తమకే విజయం సిద్ధిస్తుందని అధికార పార్టీ ఊహించింది. కాని, ఆ పార్టీ అంచనాలన్నీ తల్లక్రిందులైనాయి. గత ఎన్నికల్లో వొచ్చిన స్థానాలకన్నా ఎక్కువే వొస్తాయని గట్టి నమ్మకంతో ఉండింది. కాని, విధి వక్రించి గత స్థానాలకు సగం స్థానాలనే ఆ పార్టీ గెలుచుకోవడమన్నది కేవలం ఆ పార్టీకే కాకుండా రాజకీయ విశ్లేషకులందరినీ ఆశ్చర్యపర్చింది. గతంలో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన బిజెపి అనూహ్య విజయం సాధించి, రెండవ శ్రేణిలో నిలిచింది. ఇప్పుడు రాష్ట్రంలో మరో రెండు మున్సిపల్‌ ఎన్నికలు సమీపంలో ఉన్నాయి.

గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌తో పాటు, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలను నిర్వహించాల్సిఉంది. ఈ రెండు కార్పొరేషన్‌ ‌పాలక వర్గాల కాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. అయితే జీహెచ్‌ఎం‌సి విషయంలో తీసుకున్నట్లే ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంది అధికారపార్టీ. కాని, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వెనుకాడుతోంది. జిహెచ్‌ఎం‌సి ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ రెండు కార్పొరేషన్‌లలోని తమ పార్టీ శ్రేణులతో ఆ శాఖ మంత్రి కెటిఆర్‌ ‌దీర్ఘ సమాలోచనలు చేసినప్పటికీ ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేపోతున్నారు. భారతీయ జనతాపార్టీకి మొదటినుండి వరంగల్‌లో అంతో ఇంతో పట్టు ఉంది. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పదవిని గతంలోనే ఒకసారి దక్కించుకున్న చరిత్ర బిజెపికి ఉన్నది. అంతేకాకుండా జెయింట్‌ ‌కిల్లర్‌గా పివి నర్సింహారావు టాంటివాడిని ఓడించి దక్షిణ భారత్‌నుండి ఏకైక ఎంపి స్థానాన్ని పొందిన చరిత్ర కూడా ఇక్కడ బిజెపికి ఉంది. గతంలో ఎంఎల్‌ఏ ‌స్థానాలను కూడా గెలుచుకోవడం ద్వారా బిజెపి వరంగల్‌లో బలమైన క్యాడర్‌ను కలిగి ఉందన్నది స్పష్టం. జీహెచ్‌ఎం‌సీ ఫలితాల ప్రభావం రాజకీయంగా చైతన్యవంతమైన వరంగల్‌పైన తప్పకుండా పడుతుంది.

ఇలాంటి పరిస్థితిలో తక్షణం ఎన్నికలు పెట్టాలా వొద్దా అన్న సంశయంలో అధికారపార్టీ ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఈ విషయంలో వరంగల్‌, ‌ఖమ్మం జిల్లాలకు చెందిన ఆ పార్టీ నాయకులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. బిజెపి ఈ జిల్లాల్లో పూర్తిస్థాయిలో బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలని కొందరు అభిప్రాయపడగా, జీహెచ్‌ఎం‌సీ ప్రభావం తప్పకుండా ఉంటుంది కాబట్టి కొద్దికాలం వాయిదా వేయడం మంచిదన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. మార్చ్‌లో ప్రస్తుత పాలకమండలి కాలవ్యవధి పూర్తి కానుంది. ఆ తర్వాత కొంతకాలం ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగించి, ఈ నగరాల్లో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ది పనులు చేసిన తర్వాత వోట్ల కోసం ప్రజల ముందుకు వెళ్ళడం భావ్యంగా ఉంటుందన్న ఆలోచన కూడా లేకపోలేదు. వాస్తవంగా గత అయిదేళ్ళ కాలంగా ఈ రెండు జిల్లాల్లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందేమీలేదు. ఎలాగూ ఎన్నికలు వొస్తున్నాయన్న ఉద్దేశ్యంగా చివరి సంవత్సరం కొన్ని పనులకు శ్రీకారం చుట్టారు. అవి కూడా చాలావరకు నత్తనడకన సాగుతున్నట్లు ఆయా జిల్లాల్లోని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.

ఉదాహరణకు వరంగల్‌ ‌నగరాభివృద్ధికి ఏటా మూడు వందల కోట్లను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రకటించారు. గత మూడు సంవత్సరాలుగా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలుస్తున్నది. కాని, వరంగల్‌ ‌నగరంలో పెద్దగా జరిగిన అభివృద్ధి మాత్రం ఏమీలేదు. నగరంలో ఎక్కడ చూసినా గతుకుల రోడ్లు, మురికి కాలువలు దర్శనమిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌ ‌తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన నగరంగా వరంగల్‌కు పేరుంది. కాని, ఇక్కడి నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గత ఆరేండ్లలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఏమాత్రం అభివృద్ధి చెందలేకపోయింది. ఉన్న ఒక్క ఆజంజాహి మిల్లు మూతపడిన తర్వాత ఆ స్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పిన టెక్స్‌టైల్‌ ‌పార్క్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ అనీ, బోగీల తయారీ అని, బోగీల మరమ్మతు ఫ్యాక్టరీ అనడమేగాని ఇంతవరకు ఇక్కడి నాయకత్వం దేన్నీ సాధించలేకోయింది.

పెరుగుతున్న జనభాకు తగ్గట్లుగా రవాణా సౌకర్యం చేస్తామంటూ మెట్రో రైలు కోసం గత ఏడాదిగా కొనసాగుతున్న చర్చలు ఇంకా కార్యరూపానికి రావడంలేదు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో లాగానే ఇక్కడ కూడా తాజాగా కురిసిన వర్షాల కారణంగా నగర రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్లపై పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో ఇండ్లు నీటమునగటంతో , ఇంట్లో సామగ్రి అంతా తడిసిపోయి• ఆర్థికంగా తీవ్ర నష్టపోయారు. అయినా వారిని ఆదుకున్న నాధుడు లేడు. జీహెచ్‌ఎం‌సీలో ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చినట్లు ఇక్కడ ఎలాంటి సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు పెడితే అధికార పార్టీ ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వొస్తుందన్నది తెలియంది కాదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదావేయడమే సరైందిగా ఆ పార్టీ నాయకులు కొందరు అదిష్టానానికి సలహా ఇస్తున్నారు. కాగా, గ్రేటర్‌ ‌జోరులో ఉన్న బిజెపి మాత్రం ఎన్నికలెప్పుడొచ్చిన పొటీకి సిద్ధమే అన్నట్లు తమ క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితిలో వరంగల్‌, ‌ఖమ్మం స్థానాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో కసరత్తు చేస్తోంది.

Leave a Reply