ఇప్పటికే రూ. 1000 కోట్లు మంజూరు, అవసరమైతే మరిన్ని నిధులు
వైద్య పరికరాల కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీబీనగర్ ఎయిమ్స్‌లో నెల రోజుల్లోగా ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ భవనాలను వెంటనే ఎయిమ్స్‌కు అప్పగించాలని సూచించారు. శనివారం కేంద్ర మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించి అక్కడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఎయిమ్స్‌లో ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయి ? ఎలా తీర్చి దిద్దాలి అనే అంశాలపై ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఎయిమ్స్‌ను సందర్శించి ఇక్కడి వైద్య సిబ్బందితో సమీక్ష చేశామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఎయిమ్స్ సేవలను ఇతర రాష్ట్రాలలో కూడా అందించాలన్న ప్రధాని మోదీ ఆశయంలో భాగంగా తెలంగాణలో యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.
ముందు 50 ఎకరాలు మాత్రమే ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందనీ, ఇటీవలలే 160 ఎకరాలు ఎయిమ్స్‌కు అదనంగా కేటాయించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ భవనాలను త్వరగా ఎయిమ్స్‌కు అప్పగించాలనీ, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను కోరారు. గత ఏడాది 50 మంది విద్యార్థులతో మెడికల్ కళాశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైందనీ, రెండో ఏడాదికి 63 ఏడాదికి జాయిన్ అయ్యారని చెప్పారు. ఎయిమ్స్‌లో 750 మెడికల్, 200 పారా మెడికల్, 300 మంది పీజీ విద్యార్థులు చదువుకునేలా తీర్చిదిద్దుతామనీ, ఇప్పటికే 150 మంది నర్సులను నియమించామని చెప్పారు.
ఆయుష్ విభాగానికి సంబంధించిన యోగ, ప్రాణాయామ వంటివి ఎయిమ్స్‌లో ఏర్పాటు చేయనున్నామనీ, బ్యాంక్, పోస్టాఫీస్, డిపార్ట్మెంటర్ స్టోర్, వైద్య సిబ్బంది నివాస సముదాయాలు వంటి మౌలిక వసతులన్నీ ఎయిమ్స్ ప్రాంగణంలో కల్పించనున్నట్లు చెప్పారు.ఎయిమ్స్‌లో సిబ్బంది నియామకాలు, పరికరాలు వంటివి ఇంకా రావాల్సి ఉందనీ, ఎయిమ్స్‌ను రీసర్చ్ సెంటర్లా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎయిమ్స్‌కు సంబంధించిన నిర్మాణాలన్నింటినీ త్వరలోనే పూర్తి చేసి మరో రెండు మూడేళ్లలో ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వెల్లడించారు.