Take a fresh look at your lifestyle.

భూతాపోన్నతి విజృంభణ ధనిక దేశాల పుణ్యమే..

(అక్టోబర్‌ 31 ‌నుండి నవంబర్‌ 12 ‌వరకు కాప్‌ 26 ‌పర్యావరణ సదస్సు)
మనిషి తన అవసరాలు పెరిగే కొలది ప్రకృతి అందించిన సహజ వనరులును మితి మీరి వినియోగించడం మొదలు పెట్టిన నాటి నుండి పర్యావరణంలో సమ తూకం దెబ్బతినడం ఆరంభం అయ్యింది. జీవ వైవిద్యానికి ముప్పు మొదలయ్యింది. ఎన్నో జీవరాసులు అంతరించిపోయాయి..మరెన్నో అంతరించిపోయే జాబితాలోకి చేరుతున్నాయి. అభివృద్ధి పేరిట బొగ్గుపులుసు వాయువును ఉత్పత్తిచేసే బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను విస్తృతంగా వాడటంవల్ల కాలుష్యం పెరిగి భూమి వేడెక్కిపోతోంది. ఫలితంగా వాతావరణం అనూహ్య మార్పులకు లోనవుతోంది. రుతువులు కూడా క్రమం తప్పుతున్నాయి. పారిశ్రామికీ కరణ పేరిట బొగ్గు, ఇంధనాల వాడకం ఎక్కువైపోయింది. వాటివల్ల వాతావరణంలో ఉద్గారాలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. ఇది భూతాపానికి ప్రధాన హేతువుగా నిలచింది.ఫలితంగా వాతావరణంలో మార్పులు సంభవించి దాని ప్రభావానికి ప్రపంచం అంతా నష్టపోతోంది. అంతేకాదు ఈ విపత్తుకు మానవ తప్పిదాలూ తోడవుతున్నాయి.

ఆధునిక జీవనశైలితో సౌకర్యాలు విలాస వస్తువుల వాడకం పెరిగి కర్బన వాయువుల ఉత్పత్తి అపరిమితమై భూమి వేడెక్కిపోతోంది.ఈ1992లో రియో డిజెనీరోలో నిర్వహించిన ధరిత్రి సదస్సులో వాతావరణంలో మార్పులు, భూతాపంపై వివిధ దేశాలు చర్చించాయి. భూతాపం తగ్గించడానికి కొన్ని నిర్దిష్టచర్యలు చేపట్టాలని నిర్ణయించాయి.ఆ తరువాత ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పు ఆధ్వర్యంలో కాప్‌ ‌సదస్సులు నిర్వహిస్తూ పర్వ్యవరణాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలపై చర్చలు జరుపుతూ ప్రపంచ దేశాలకు భూతాపం వలన వాతావరణంలో ఏర్పడే మార్పులను కట్టడి చేసేందుకు లక్ష్యాలను తెలియచేస్తూ రావడం జరిగింది.పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం, ప్రతి భూభాగం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంగీకరించి సంతకం చేసిన ఒక అంతర్జాతీయ ఒప్పందమే కాప్‌.ఇప్పటి వరకు ఈ కాప్‌ ‌సదస్సులు 25 పూర్తి చేసుకుని 26 వ సదస్సులో అడుగు పెట్టాం.25 సదస్సులలో సాధించిన ఘనత మాత్రం ఏమీ కనిపించడం లేదు.సదస్సులు చర్చలు తీర్మానాలు తప్ప ఆచరణలో మాత్రం సాధించింది అత్యల్పమే.

ఇక సదస్సుల పరంపరలో జరపబోయే 26 వ సదస్సును గత సంవత్సరమే నిర్వహించవలసి ఉన్నప్పటికీ కోవిడ్‌ ‌మహమ్మారి తీవ్రత కారణంగా దీనిని 2021 కు వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ సదస్సు గ్లాస్గో నగరంలో అక్టోబర్‌ 31 ‌నుండి నవంబర్‌ 12 ‌వరకు జరపడానికి ఏర్పాట్లు చేశారు.ఈ సదస్సులో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరిపి భవిష్యత్‌ ‌నిర్ణయాలు తీసుకోనున్నారు.ఇప్పటి వరకు జరిగిన సదస్సులలో భూతాపాన్ని తగ్గించి వాతావరణంలో ఏర్పడే మార్పులను కట్టడి చేయడం కోసం వివిధ దేశాల మధ్య సమన్వయం కోసం ఎన్నో చర్చలు నిర్ణయాలు అంగీకారాలు జరిగినా కూడా భూతాపాన్ని నేటికి కూడా కట్టడి చేయలేక పోయాం.ఈ శతాబ్ది చివరికి భూమి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వదశకంటే రెండు డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరిగితే అడ్డుకోలేని విపత్కర వాతావరణ మార్పులు తప్పవని శాస్తవ్రేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తున్నారు.2015 లో జరిగిన పారిస్‌ ‌లో జరిగిన సదస్సులో దీనిపై విస్తృతంగా చర్చలు జరిపి ఈ శతాబ్దాంతానికి (2100) ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌ను మించనీకుండా కట్టడి చేయాలని, 1.5 డిగ్రీలకన్నా తక్కువకే నిలువరిస్తే మరింత మంచిదని ఆరేళ్ల కింద పారిస్‌లో (2015) భాగస్వామ్య దేశాలన్నీ ఒప్పందానికి వచ్చాయి. అయితే పారిస్‌ ఒప్పందాల విషయంలో వివిధ దేశాల ఇచ్చిన హామీల అమలు, ఫలాలు, వైఫల్యాలు,భవిష్యత్‌ ‌లో ఎదురయ్యే సవాళ్లు మరియు అవకాశాలను భాగస్వాముల సదస్సు’ (కాప్‌26)‌లో చర్చించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి అంతర్గత ప్రభుత్వ నివేదిక భూతాపం విషయమై ఏర్పడే ప్రమాదకర ధోరణలు ఎంతటి ప్రమాదానికి దారి తీయనుందో వివరించింది.భూతాపం విస్తృతి కారణంగా జీవకోటి ఎదుర్కొనే విపత్తులను రెడ్‌ ‌కోడ్‌ ‌పేరిట వివరంగా పేర్కొంది.ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చర్చ జరపడానికి ఈ కాప్‌ 26 ‌వేదికను సభ్యదేశాలు ఉపయోగించుకొనున్నాయి.

సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం నెట్‌ ‌జీరో ఎమిషన్స్ ‌కానుంది.నెట్‌ ‌జీరో ఎమిషన్స్నెట్‌ ‌జీరో అంటే కర్బన ఉద్గారాలను శూన్య స్ధితికి తీసుకు వెళ్లే లక్ష్యం. ఇది పర్యావరణ రక్షణకు ఎంతైనా ఉపయోగపడుతుందని పర్యావరణ వేత్తల ఆశాజనకంగా ఉన్నారు ఈ సదస్సులో ప్రధానంగా చర్చించే అంశం కర్బన ఉద్గారాలను 2050 నాటికి శూన్య స్ధితికి చేర్చడం. దీనిపై ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించి కర్బన ఉద్గారాలను అరికట్టేలా చర్యలు చేపట్టడం.దీనికి శిలాజ ఇంధనాలు దహనం వలన వాతావరణంలో ఏర్పడిన కర్బన
ఉద్గారాలను సహజ స్థాయికి పరిమితం చేయాలి.అప్పుడు కర్బన ఉద్గారాల ‘శూన్య స్థితి’ ఏర్పడుతుంది.దీనినే నెట్‌ ‌జీరో ఎమిషన్స్ ‌లేదా నెట్‌ ‌న్యూట్రాలిటీ అని పిలుస్తున్నారు.వాతావరణంలో ఈ కర్బన ఉద్గారాలు తీవ్రత పెరగటానికి వాతవరణంలోనికి విడిచి పెట్టె గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువులే ప్రధాన కారణం.వాతావరణంలో ఈ వాయువుల సాంద్రత పెరిగే కొలదీ కర్బన ఉద్గారాలు అధికమై భూతాపం పెరగడంతో పాటు పర్యావరణంలో సమతూకం లోపించి ప్రకృతిలో గల సమస్త జీవ కోటికి ముప్పు వాటిల్లే పరిస్ధితి ఏర్పడింది.అందుచేత ఈ కర్బన
ఉద్గారాలు అదుపు చేయాలి.వీటిని శూన్య స్ధితికి తీసుకు రావడం అంటే కర్బన వ్యర్దాలు విడుదల కాకుండా చేయడం కాదు.వాటి విడుదల ఆపివేస్తే మొత్తం అభివృద్ధి కుంటు పడిపోతుంది.అందుచేత కర్బన్‌ ఉద్గారాలు విడుదల అయినప్పటికీ ఆ ఉద్గారాలను గ్రీన్‌హౌస్‌ ‌వాయువులను చెట్లు మరియు అడవులు గ్రహించే విధంగా అటవీ విస్తీరాన్ని ఎక్కువ చేయడం లేదా భవిష్యత్‌ ‌సాంకేతికతలను ఉపయోగించి వాతావరణం నుండి కార్బన్‌ ‌డయాక్సైడ్‌ను భౌతికంగా తొలగించడం ద్వారా భర్తీ చేయబడే స్థితినే కార్బన్‌ ‌న్యూట్రాలిటీ లేదా నికర సున్నా ఉద్గారాలు అంటారు.అయితే ఈ గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువులను కొన్ని దేశాలు మాత్రమే అధికంగా విడుదల చేస్తూ ఉంటే దాని ఫలితాన్ని మాత్రం అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి.అయితే దీనిని కట్టడి చేసే బాధ్యతను మాత్రం అన్ని దేశాలకు అప్పగించడం సమంజసం కాదంటూ వర్ధమాన దేశాలు నుండి అభ్యంతరాలు వెలువడుతున్నాయి.

ప్రపంచంలో పారిశ్రామిక విప్లవాన్ని సాధించిన దేశాలు వేగవంతమైన పారిశ్రామికీకరణ ద్వారా వాతావరణంలో అత్యధిక గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువుల విడుదలకు కారణం అయ్యాయి.అటువంటి అభివృద్ధి చెందిన దేశాలు నేడు వేదికపైకి వచ్చి ఉమ్మడిగా భూతాపాన్ని తగ్గించడానికి కర్బన ఉద్గారాల సున్యత కు అందరికి పిలువు ఇవ్వడం సహేతుకం కాదనే వాదన బలపడుతు వస్తూ ఉంది.వాస్తవంగా చూస్తే ఈ వాదన కూడా హేతుబద్ధమైనదే.కాబట్టి ఈ విపత్తుకు అది నుండి కారణ భూతం అయిన దేశాలు దానిని కట్టడి చేసేందుకు అయ్యే వ్యయంలో కూడా అధిక మొత్తాలను భరించాలని వర్ధమాన దేశాల డిమాండ్‌.అయితే ఈ విషయమై అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవంలో అవి నిలువుకోలేక పోయాయి.వీటిని పక్కన పెట్టి వర్ధమాన దేశాలకు లక్ష్యాలు నిర్ణయించి నికర సూన్య కర్బన ఉద్గారాలు సాదించాలని పేర్కొనడం సహేతుకం కాదు.ఈ విషయమై అమెరికా 2050 నాటికి చైనా 2060 నాటికి నెట్‌ ‌న్యూట్రాలిటీ సాదిస్తాం అని ప్రకటించాయి అయితే భారత్‌ ‌మాత్రం టార్గెట్‌ ‌ను ఇప్పటి వరకు ప్రకటించలేదు.కారణం ఏమిటంటే భూతాప ఉద్గారాలను తగ్గించే బాధ్యతను భారత్‌ ‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి తోసేయడం నైతికంగా తప్పని భారత్‌ ‌వాదిస్తూ ఉంది. సంపన్న దేశాల లాగే తమ తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి కార్బన్లను మండించే హక్కు నిరుపేద దేశాలకు ఉంటుందని భారత్‌ ‌వాదన.ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో ముందుకు వేడుతున్న వర్ధమాన దేశాల ప్రయోజనాలను అరికట్టే దిశగా లక్ష్యాలను తమపై రుద్దకూడదని వర్ధమాన దేశాలు అభిప్రాయ పడుతున్నాయి.

ఉద్గారాల తగ్గింపు అనేది అత్యంత ఆవశ్యకమే దానిలో సందేహం లేదు.అయితేబాధ్యత వర్ధమాన దేశాలదే కాదు అందరిదీ.అందునా ఎక్కువ బాధ్యత తప్పనిసరిగా అభివృద్ధి చెందిన దేశాలే తీసుకోవాలి.పారిశ్రామిక విప్లవాన్ని ప్రథమంగా సాధించిన ధనిక దేశాలు ఇప్పటి వరకు సహజ వనరులు అన్నింటినీ విచ్చల విడిగా వాడి కర్బన ఉద్గారాలు విడిచిపెట్టి ఒక స్ధితికి చేరుకున్న తరువాత ఇప్పుడు వాటి కట్టడికి వర్ధమాన దేశాలు బాధ్యత వహించాలి అనడం సమంజసమా?భూతాపం అనేది ప్రపంచానికే సవాలు.. కానీ అది వర్ధమాన దేశాలకు చెందిన పాపం కాదు.దానికి ప్రధాన కారకులు అభివృద్ధి చెందిన దేశాలే అని చాటి చెప్పడానికి వర్ధమాన దేశాలు సిద్ధం అవుతున్నాయి.ఈ విషయమై ప్రపంచ దేశాల మధ్య యుద్ధప్రాతిపదికన సమగ్ర, నిష్పాక్షిత ఒప్పందానికి రావాలి.దానికి కాప్‌ 26 ‌సదస్సును ఉపయోగించు కోగలితే ప్రయోజనం దక్కుతుంది.అంటే ఇక్కడ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో పూర్తి మినహాయింపు ఇవ్వాలని వర్ధమాన దేశాలు కోరడం లేదు.ఎక్కువ బాధ్యతను ధనిక దేశాలు చేపట్టాలని వాటి డిమాండ్‌.

‌కర్బన ఉద్గారాల సున్యత కు సంబంధించి ఆధునిక సాంకేతికతను వర్ధమాన దేశాలకు అందించడంలో సంపన్నదేశాలు వాటికి పూర్తిస్థాయిలో తోడ్పడవలసిన అవసరముంది. ఇది ఆ దేశాల కర్తవ్యం కూడా. దీనికి భిన్నంగా కార్బన్‌ ఉద్గారాలు మితిమీరిపోతున్నాయని వర్థమాన దేశాలను తప్పుపడితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదు.అభివృద్దే ధ్యేయంగా ఇప్పటి వరకు శిలాజ ఇంధనాలు ను మితి మీరి వాడి అభివృద్ధి సాధించిన సంపన్న దేశాలు లాగే వర్ధమాన దేశాలకు కూడా అభివృద్ధి ముఖ్యమనే సత్యాన్ని గుర్తించాలి.ఎందుకంటే పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానం తరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత జరిగిన వాతావరణ నష్టమే బాగా ఎక్కువ. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేసినచేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతివనరుల దోపిడీకి లెక్కేలేదు.దీనిని దృష్టిలో ఉంచుకుని పేద దేశాలపై నెపం వేయడం లక్ష్యాలు నిర్ణయించడం కాకుండా సుస్ధిర అభివృద్ధి సాధనకు సంపన్న దేశాలు ఆధునిక సాంకేతికతను పేద దేశాలకు అందివ్వాలి.దానితో పాటుపునరుత్పాదక వనరుల వినియోగించుకోవడం లో పరిజ్ఞానాన్ని పేద దేశాలకు అందిస్తూ దానికయ్యే వ్యయంలో భాగంగా ధనిక దేశాలు ఒక నిధిని ఏర్పాటు చేయాలి.ఈ లక్ష్యాల సాధనకు సహకరించవలసిన బాధ్యతను కాప్‌ 26 ‌సదస్సులో రూపకల్పన జరిగినప్పుడే వర్ధమాన దేశాలకు న్యాయం జరగడంతో పాటు రాబోయే తరాల వారి ప్రయోజనాలను కాపాడగలిగిన వారం అవుతాము.

రుద్రరాజు శ్రీనివాసరాజు..
లెక్చరర్‌..
ఐ.‌పోలవరం
9441239578.

Leave a Reply