Take a fresh look at your lifestyle.

భూదాన్‌ ‌భూములది..

బహుళ కోట్ల భూ కుంభకోణం..!
అఖిల భారత సర్వ సేవ సంఘ్‌ ఆరోపణ
హైకోర్ట్ ‌సిట్టింగ్‌ ‌జడ్జిచే విచారణకు డిమాండ్‌

‌తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల విలువైన భూదాన్‌ ‌భూములది బహుళ కోట్ల భూ కుంభకోణం అని అఖిల భారత సర్వ సేవ సంఘ్‌ ‌జాతీయ అధ్యక్షులు చందన్‌ ‌పాల్‌ ఆరోపించారు. భూదాన్‌ ‌భూములను రక్షించి – భూదాన్‌ ‌యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి – భూమిలేని నిరుపేదలకు పంచాలని డిమాండ్‌ ‌చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌, ఇం‌దిరాపార్క్, ‌ధర్నా చౌక్‌లో తెలంగాణ సర్వోదయ మండలి, సర్వ సేవ సంఘ్‌ ‌తెలంగాణ ఆధ్వర్యంలో వందలాదిమంది భూమిలేని నిరుపేదలతో  ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సర్వ సేవ సంఘ్‌ ‌తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షులు ఆర్‌. ‌శంకర్‌ ‌నాయక్‌ అధ్యక్షత వహించగా చందన్‌ ‌పాల్‌ ‌ముఖ్య అతిథిగా, అఖిల భారత సర్వ సేవ సంఘ్‌ ‌జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరంగా చంద్ర మోహాపాత్ర, గౌరవ అతిథిగా, సంఘ్‌ ‌జాతీయ ట్రస్టీ షేక్‌ ‌హుస్సేన్‌, ‌కార్యవర్గ సభ్యులు జివివిఎస్డిఎస్‌. ‌ప్రసాద్‌, ‌సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్‌ అజీజ్‌ ‌పాషా, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహ రావు, సిపిఐ హైదరాబాద్‌ ‌జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ ఆత్మీయ అథితులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చందన్‌ ‌పాల్‌ ‌మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు భూ పంపిణి కోసం ఏప్రిల్‌ 1951‌లో మహాత్మాగాంధీ శిష్యుడు ఆచార్య వినోబా భావే భూదాన్‌ ఉద్యమం, ‘రక్తరహిత విప్లవం’  తెలంగాణలోని భూదాన్‌ ‌పోచంపల్లిలో ప్రారంభించారని ఆనాడు ఈ ఉద్యమానికి ఆకర్షితులై ధనవంతులైన జమీందార్లు, భూస్వాములు రాష్ట్రంలో సుమారు లక్ష డెబ్భై వేల ఎకరాలు ఆచార్య వినోబా భావేకు విరాళంగా ఇచ్చారని గుర్తు చేసారు. సర్వ సేవ సంఘ్‌ ‌సూచనలతో భూదాన్‌ ‌యజ్ఞ బోర్డులు ఏర్పాటు చేసి భూదాన్‌ ‌భూములు పంపిణి చేసే బాధ్యతలు  రాష్ట్ర ప్రభుత్వాలకు ఆచార్య  వినోబా భావే అప్పగించారని అయన తెలిపారు. ఆనాటి, అనంతరం ప్రభుత్వాలు 20 శాతం భూదాన భూములను పేదలకు పంపిణి చేసి వొదిలేశారని, మిగితా 80 శతం భూదాన భూములు ప్రభుత్వాల ఉదాసీనతతో కొంత మిగిలి ఉన్నా చాల వరకు ఈ భూములు అన్యాక్రాంతమయ్యాయని అయన ఆవేదన వ్యక్తం చేసారు. భూదాన భూముల కుంభకోణాలను చాల మీడియా సంస్థలు వెలుగులోకి తెచ్చాయని, తెలంగాణ సర్వోదయ మండలి స్వయంగా భూదాన భూములపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను పరిశీలించి ప్రభుత్వాలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అయన తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తక్షణమే స్పందించి భూదాన్‌ ‌యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి, భూదాన భూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంచాలని చందన్‌ ‌పాల్‌ ‌డిమాండ్‌ ‌చేసారు. గౌరంగా చంద్ర మోహాపాత్ర మాట్లాడుతూ భూదాన్‌ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలు తమ విధానాలు అనుసరిస్తున్నాయని, భూమిలేని వారిని గుర్తించి భూదాన భూములు పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు తీవ్రమైన ప్రయత్నాలు ఏమి చేయడంలేదని .విమర్శించారు. షేక్‌ ‌హుస్సేన్‌ ‌మాట్లాడుతూ భూదాన్‌ ‌భూములు భూదాన్‌ ‌లబ్ధిదారులకు ఉపయోగపడడంలేదని తెలిపారు. ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కోట్ల విలువైన భూదాన్‌ ‌భూములు ఎక్కడ ఉన్నవి, భూదాన్‌ ‌భూమిని ఎవరు ఉపయోగించుకుంటున్నారన్నది తెలుసుకోకుండా ప్రభుత్వాలు ఎలా పాలనా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణాలో భూదాన భూఅక్రమణలపై హైకోర్ట్ ‌సిట్టింగ్‌ ‌జడ్జ్‌తో విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని అయన డిమాండ్‌ ‌చేసారు. జివివిఎస్డిఎస్‌. ‌ప్రసాద్‌ ‌మాట్లాడుతూ భూదాన్‌ ‌భూముల అక్రమాలు ఎంత చెప్పినా తక్కువేనని అందిన కాడికి భూబకాసురుల భోంచేస్తున్నారని, భూమిని స్వాహా చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

భూదాన్‌ ‌భూముల అక్రమాలపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.‌కె. సిన్హా నేతృత్వంలోని టాస్క్ ‌ఫోర్స్ ‌కమిటీ నివేదికను అమలు చేసి భూదాన్‌ ‌భూములను రక్షించాలని అయన డిమాండ్‌ ‌చేసారు. అజీజ్‌ ‌పాషా మాట్లాడుతూ గత ప్రభుత్వాల, నేటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వెలాది ఎకరాల భూదాన భూములు స్థానిక ల్యాండ్‌ ‌మాఫియా చేరల్లో చిక్కుకున్నాయని వెల్లడించారు. పంపిణీ చేయని భూదాన్‌ ‌భూమిలో 80  శాతం ఇప్పటికే ఆక్రమణకు గురై భారీగా రియల్‌ ఎస్టేట్‌ ‌దందాలు నడుస్తున్నాయని అయన తెలిపారు. కెసిఆర్‌ ‌ప్రభుత్వం  భూదాన్‌ ‌చట్టం యొక్క కొత్త నిబంధనలు తెచ్చి పేదల కోసం ఉద్దేశించిన భూదాన్‌ ‌భూమిని లాక్కోవడానికి అనుమతిచ్చిందని అజీజ్‌ ‌పాషా విమర్శించారు. డిజి నరసింహారావు మాట్లాడుతూ 5,344 కోట్ల విలువైన 10,000 ఎకరాల భూదాన భూమిని ప్రైవేట్‌ ‌వ్యక్తులు మరియు భూ ఆక్రమణదారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆక్రమించి సొమ్ము చేసుకున్నారని చెప్పారు. భూదాన్‌ ‌భూములు రక్షించడంలో..భూమి పంపిణీని చేయడంలో ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని అయన ఆరోపించారు. ఈటి నరసింహ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ ‌చట్టం, 1908 సెక్షన్‌ 22-ఎ ‌ప్రకారం నిషేధించబడిన భూములు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మరియు ప్రైవేట్‌ ‌వ్యక్తులు కుమ్మక్కై వందలాది ఎకరాల భూదాన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని మండిపడ్డారు.

భూదాన్‌ ‌చట్టాన్ని ఉల్లంఘించి హైదరాబాద్‌, ‌రంగారెడ్డి జిల్లాలోని భూదాన్‌ ‌భూములను ప్రభుత్వమే పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కబ్జాదారులపై కఠిన చెర్యలు తీసుకొని, వాటిని రక్షించి పేదలకు పంచేవరకు సిపిఐ నిర్విరామంగా ఉద్యమాలు నిర్వహిస్తుందని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్‌. ‌శంకర్‌ ‌నాయక్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో ‘భూదాన్‌’ ‌భూముల గుట్టు ఎందుకు బైటపడలేదని ప్రశ్నించారు. జాడ తెలియకుండా పోయిన 74,496 ఎకరాల భూదాన్‌ ‌భూముల్లో చాలా వరకు హైదరాబాద్‌ ‌నగరానికి ఆనుకుని ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి, మెదక్‌ ‌జిల్లాల పరిధిలోనే ఉన్నాయని, భూ రికార్డులు ఉన్న ప్రభుత్వం భూదాన్‌ ‌భూముల దొంగలపై కఠిన క్రిమినల్‌ ‌చర్యలు తీసుకొని ఎందుకు తిరిగి స్వాధీనపరుచుకోవడంలేదని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం భూదాన్‌ ‌చట్టం కొత్త నిబంధనలను తీసుకవచ్చి భూకబ్జాలను ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. భూమిలేని పేదలకు భూ పంపిణీ కోసం ఆచార్య వినోబా భావే ప్రారంభించిన ఉద్యమ స్ఫూర్తికి తూట్లు పొడిస్తే ఊరుకునేదిలేదని, భూదాన్‌ ‌యజ్ఞ బోర్డును వెంటనే ఏర్పాటుచేసి, ఆక్రమణకు గురైన భూదాన్‌ ‌భూములను తిరిగి స్వాధీనపరుచుకొని పేదలకు పంచేవరకు తెలంగాణ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భూమిలేని నిరుపేదలతో కలసి పెద్దఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని శంకర్‌ ‌నాయక్‌ ‌ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాలో తెలంగాణ సర్వోదయ మండలి నేత చందు నాయక్‌ ‌తొలుత స్వాగతం పలకగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రవీంద్ర చారి వందన సమర్పణ చేసారు. మండలి నేతలు ఏ. యాదిరెడ్డి, ఎస్‌. ‌యాదయ్య, బి. మురళి, షేక్‌ ‌మహమూద్‌, ‌రాజు నాయక్‌, అమీనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply