
భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఇంటర్వ్యూ
చమట చుక్కలు, న్యూఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు చితకబాదిన తర్వాత డిసెంబర్ 20వ తారీఖున భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ జామా మసీదు ప్రాంగణంలో, చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని పెద్ద ధర్నా కార్యక్రమాన్ని చేశారు. ఆరోజు రాత్రి ఢిల్లీ పోలీస్ చంద్రశేఖర్ ఆజాద్ ను అరెస్టు చేసింది. గురువారం సాయంత్రం బెయిలుపై రిలీజ్ చేసింది.. 24 గంటల లోపు ఢిల్లీ విడిచి సహారన్పూర్ కి వెళ్లిపోవాలన్న కండిషన్ పైన చంద్రశేఖర్ ఆజాద్ బెయిల్ దొరికింది. ఈ బెయిల్ ఇస్తూ చంద్రశేఖర్ ఆజాద్ పై పలు ఆంక్షలు విధించారు. ఆయన ఎటువంటి నిరసన ధర్నా కార్యక్రమాలలో పాల్గొనరాదని ఆంక్షలు ఉన్నాయి. విడుదలైన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ పలు ప్రార్థనా స్థలాలను సందర్శించారు. జామా మస్జిద్ వెళ్లి ప్రార్థనలు చేశారు. దళిత మందిరాలకు వెళ్లారు. గురుద్వారాకి వెళ్లారు. సాయంత్రం సహారన్పూర్ కి బయలుదేరి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ లో ప్రముఖ దళిత నాయకుడుగా పాలకపక్షం బిజెపికి మాత్రమే కాకుండా విపక్షంలో ఉన్న మాయావతికి కూడా సవాల్ విసిరేలాగా ఎదుగుతున్నారు. మాయావతి బిజెపి బి టీం అని చంద్రశేఖర్ ఆజాద్ పలుమార్లు విమర్శిస్తూ వస్తున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఎదుగుదల ఉత్తర భారతదేశంలో కొత్త దళిత నాయకత్వం ఆవిర్భావం అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఆయన పలు అంశాలపై ఇచ్చిన ఇంటర్వ్యూ
ప్రశ్న:- సవరించిన పౌరసత్వం చట్టాన్ని చీకటి చట్టం అని మీరు అభివర్ణిస్తున్నారు కానీ కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా దీనివలన దేశంలో ఉన్న పౌరులకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్తున్నారు.
చంద్రశేఖర్ ఆజాద్:- అవును హోమ్ మినిస్టర్ చెబుతున్న మాటల్లో వాస్తవం ఉంది. కేవలం సవరించిన పౌరసత్వ సవరణ చట్టం వలన ప్రమాదం లేదు. అందుకని ఎన్ఆర్సి, ఎన్పిఆర్ల ప్రస్తావన లేకుండా కేవలం సిఎఎని అమలు చేయండి. మూడు దేశాలలో పీడనకు గురవుతున్న వారు ఎవరైనా ఉంటే కచ్చితంగా వారికి శరణు ఇవ్వండి. పౌరసత్వం ఇవ్వండి. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో కూడా భారతదేశం పీడనకు గురవుతున్న వారికి ఇచ్చింది. భారతదేశ గొప్పతనం ఇదే. పీడితులకు భారతదేశం ఎప్పుడు కూడా అండగా నిలిచింది. ఈ విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ హోమ్ మినిస్టర్ పదే పదే చెప్పారు. సవరించిన పౌరసత్వ చట్టం తర్వాత ఎన్ఆర్పి, ఎన్ఆర్సి అమలు చేస్తామని. ఇది ఎంత మాత్రం అంగీకారం కాదు. అస్సాంలో చూశాము. 19 లక్షల మంది ఎన్ఆర్సి వలన పౌరసత్వం కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాలలో భారీగా చొరబాటుదారులు వచ్చి చేరారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తత్ఫలితంగా ఎన్ఆర్సీ చేశారు. అక్కడ పద్నాలుగున్నార లక్షల ఎస్టి, ఎస్సీ, ఓబిసి ప్రజలు తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. నాలుగున్నర లక్షల ముస్లింలు తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. చాలామంది డిటెన్షన్ క్యాంపులో ఉన్నారు. ఈ డిటెన్షన్ క్యాంపులో ఉన్న వారిని ప్రభుత్వం ఏం చేయనున్నదో చెప్పాలి. డిటెన్షన్ క్యాంపులో మగ్గుతున్న వారి పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. వీరి జీవితాలు ఏం కానున్నాయి ప్రభుత్వం తెలపాలి అని అడుగుతున్నాం.
ప్రశ్న :– ప్రధాన మంత్రి స్వయంగా చెబుతున్నారు. డిటెన్షన్ క్యాంపులు కట్టలేదని
చంద్రశేఖర్ ఆజాద్ :– పచ్చి అబద్ధం చెబుతున్నారు. ప్రభుత్వం పచ్చి అబద్ధం ఆడుతున్నది. కర్ణాటకలో డిటెన్షన్ క్యాంప్ కట్టారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాజ్యం కూడా వచ్చింది. నేను చదివాను ఈ వ్యాజ్యంకి సంబంధించిన వివరాలు పత్రికల్లో స్పష్టంగా వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో డిటెన్షన్ క్యాంపులు ప్రభుత్వం కట్టనున్నదని. ఇలా ప్రతిసారి అబద్దాలు చెప్తే ఎలా..? వీరికి అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెబుతూ ఉండటం. వీరు చెప్పిన అబద్ధాలు చాలానే ఉన్నాయి. వీరి అబద్ధాల చిట్టా చెబుతా.. ఒకసారి వినండి. రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి.? నా చుట్టూ ఉన్న వాళ్లంతా కూడా నిరుద్యోగంతో బాధ పడుతున్న వారే. సబకా సాత్ సబకా వికాస్ అన్నారు. ఈరోజు దేశంలో ఉన్న ముస్లింలు, అల్పసంఖ్యాకులు, దళితులు అసురక్షిత భావనతో కొట్టుమిట్టాడుతున్నారు. ధరలు తగ్గిస్తాం అన్నారు. ఉల్లిపాయ ధర 200 రూపాయల వరకు వెళ్ళింది. రూపాయి పతనం మన కళ్ళ ముందే ఉంది. దేశ గౌరవం పడిపోతున్న చందాన రూపాయి విలువ పడిపోతున్నది. నోట్ల రద్దు వల్ల ఇంత నష్టం జరుగుతున్నది మనం కళ్ళముందే ఉంది. 15 లక్షలు రూపాయలు ఎక్కడ ఉన్నాయి. చెప్పేవన్నీ అబద్ధాలు అయినప్పుడు.. భయపడొద్దు.. ప్రమాదం లేదు.. అని చెబుతూ ఉంటే ఎవరు నమ్ముతారు? ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంది.
ప్రశ్న:- చాలా ఆంక్షలతో కూడిన బెయిల్ మీకు దొరికింది. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఆందోళన కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తారు..?
చంద్రశేఖర్ అజాద్ :- ఈ దేశ రాజ్యాంగం నాకు శక్తిని ఇస్తుంది. దానిని వాడుకుంటాను. రాజ్యాంగం ఇచ్చే శక్తి ముందు అన్ని కష్టాలు సామాన్యం అయిపోతాయి. రాజ్యాంగం శక్తి ముందు ప్రభుత్వం కూడా మరుగుజ్జు. నా పని నేను చేస్తూనే ఉన్నాను. అంతా ప్రజా కోర్టు ముందు ఉంది. నా పని చేయడంలో నాకు ఇబ్బందులు తలెత్తితే, రాజ్యాంగం ద్వారా నా పని నేను కొనసాగిస్తాను. నాపై పెట్టిన ఆంక్షలకు సంబంధించి కోర్టుకి వెళ్ళనున్నాను. కోర్టుకి తెలియజేస్తాను. నాపై మీకు ఇచ్చిన సమాచారం అసత్యాలతో నిండి ఉంది అని కోర్టు ముందు పెడతా.. వాస్తవాలను కోర్టు ముందు పెడతాను. నా మాట కోర్ట్ వింటుంది అని నమ్ముతున్నాను. నేను కోర్టుకు చెబుతాను. నేను సామాన్య పౌరుడనని నా హక్కు హరించ వద్దని కోర్టుని కోరుకుంటా.. దళిత సమాజం బిడ్డని కోర్టుకు చెప్పుకుంటాను. నా ఆరోగ్య పరీక్షలు ఢిల్లీలోనే జరుగుతున్నాయి. ఢిల్లీలో నా కుటుంబం కూడా ఉంది. షాహీన్ బాగ్ లో నా తల్లి సమానులైన వారు నా చెల్లెలు సమానులు అయిన వారు ఉద్యమం చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్లొద్దని ఆంక్షలు పెడితే ఎలా..? వారి దగ్గరకు వెళ్లి వారి మాటలు వినాలని అనుకుంటున్నాను. నా గురించి ఢిల్లీలో ఉన్న ముస్లిం ప్రార్థన స్థలాలలో ప్రార్థనలు జరిగాయి. వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటున్నా.. వారిని కలవద్దు అంటే ఎలా.. ఢిల్లీ తుగ్లకా బాద్ లో నిరసన దీక్ష చేసాను.. అరెస్ట్ చేశారు. 65 రోజులు జైలులో నాతో పాటు 92 మంది అరెస్ట్ అయ్యారు. వీరితో కలిసి జీవించాను. వీళ్ళతో కల వద్దు అంటే ఎలా నాపై పెట్టిన ఆంక్షలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కొనసాగించటం కుదరదు. నాపై పెట్టిన కొనసాగితే మనం నిరంకుశ పాలనలో ఉన్నట్లు.
ప్రశ్న:- మీరు రోడ్లపైన ఆందోళనలు చేస్తున్నారు అయితే ఎన్నికల రాజకీయం లోకి ఎప్పుడు వస్తారు
చంద్రశేఖర్ ఆజాద్ :- నేను రోడ్లపై చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు పోరాటం చాలా అవసరమైనది. నేను ఎవరి గురించి పోరాడుతున్నానో వారిని రక్షించుకోవటం, వారిని సంఘటిత పరచడం అత్యంత అవసరమైన పని. ఆ పని ప్రస్తుతం చేస్తున్నాను. ఎన్నికల రాజకీయం చిన్న విషయం. అది రెండవ దశ. తగు సమయం వచ్చినప్పుడు ఎన్నికలు ఎన్నికల రాజకీయాలు పని మొదలు పెడతాము. ప్రస్తుతం మేము చేస్తున్న రోడ్డుమీద పోరాటం అతి ముఖ్యమైనది.
ప్రశ్న:- ఉత్తరప్రదేశ్ దళిత నాయకురాలు మాయవాతితో మీ సంబంధాలు అంత బాగా లేవు ఎందుకని..? మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి..?
చంద్రశేఖర్ ఆజాద్:- మాయావతితో మాకు ఉన్న సంబంధాలు చాలా బాగున్నాయి. మాయావతిని పూర్తిగా గౌరవిస్తాను. ఆమెను నా మేనత్తగా భావిస్తాను. ఆమె గురించి అగౌరవంగా నేను ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎప్పుడూ మాట్లాడను కూడా. ఆమె నా గురించి ఏం మాట్లాడినా తల్లిదండ్రులు, చిన్నాన్న చిన్నమ్మ, మేనమామ మేనత్త, కోప పడితే ఎలా భావిస్తామో అలానే భావిస్తాను. నాకు తెలిసినంతవరకు మాయావతి అత్యధికంగా ప్రేమించేది నన్నే.. మీరు ఎప్పుడైనా కలిసినపుడు ఈ విషయాన్ని ఆమెని అడిగి తెలుసు కోవచ్చు. అని సెటైర్ విసురుతూ ముగించారు.
Tags: Bhim Army Chief, Chandrashekhar Azad, Interview, mayavati, pm modi