Take a fresh look at your lifestyle.

పివికి భారతరత్న ప్రకటించాలి

వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం
నెక్లెస్‌ ‌రోడ్‌కు పివి జ్ఞానమార్గ్‌గా పేరు
శత జయంతి సభలకు రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం: సీఎం కేసీఆర్‌ ‌వెల్లడి

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు సీఎం కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ ‌రోడ్‌కు పివి జ్ఞానమార్గ్‌గా పేరు పెట్టాలనీ, అలాగే, పివి మెమోరియల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. పివి శత జయంత్రి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ‌శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీ‌నివాసగౌడ్‌, ‌పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటి అధ్యక్షుడు •కేకే, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ ‌శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌కమిటీ సభ్యులు రమణాచారి, దేవులపల్లి ప్రభాకరరావు, టంకశాల అశోక్‌, ‌పివి ప్రభాకరరావు, వాణీదేవి, కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ పివి నరసింహారావు తెలంగాణ అస్థిత్వ ప్రతీక• అనీ, దేశంలో అనేక సంస్కరణలు చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ పివి అనీ, అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామనీ, వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో పివికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానం చేస్తామని తెలిపారు. అలాగే, అసెంబ్లీలో పివి తైల వర్ణ చిత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామనీ, భారత పార్లమెంటులో
కూడా ఏర్పాటు చేయాలనీ, హైదరాబాద్‌లో పివి నెలకొల్పిన సెంట్రల్‌ ‌యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించారు.

ప్రజలకు కేవలం భూమి మాత్రమే ఉత్పత్తి సాధనమనీ, ఉపాధి మార్గం అయిన సమయంలో సీఎంగా ఉన్న పివి తన ప్రతిభతో అత్యంత సాహసోపేతంగా భూ సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. దీని ఫలితంగానే నేడు తెలంగాణలో 93 శాతం మంది చిన్న , సన్నకారు రైతులున్నారనీ, పేదల చేతికి భూమి వచ్చిందని గుర్తు చేశారు. పివి ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే నేడు దేశం ఆర్థికంగా నిలదొక్కుకుందనీ, అలాంటి గొప్ప వ్యక్తిని అద్భుతమైన పద్దతుల్లో స్మరించుకోవాలని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రస్తుతం కొరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ? అనే విషయాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కాగా ఈ సమావేశంలో పివి పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఆ గ్రామాలను సందర్శించి తగిన ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి శ్రీనివాసగౌడ్‌ను ఆదేశించారు.  పివి పేరు మీద విద్యా వైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ ఏసిన వారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదించాలనీ, అవార్డుకు సంబంధించిన నగదు బహుమతిని తెలంగాణ ప్రభుత్వం అందించాలని నిర్ణయించారు.  పివి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ ‌క్లింటన్‌, ‌బ్రిటన్‌ ‌మాజీ అధ్యక్షుడు జాన్‌ ‌మేజర్‌, ‌కామెరూన్‌ ‌వంటి వారిని భారత దేశానికి ఆహ్వానించి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా చేయాలని సూచించారు. అలాగే, పివి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా స్వయంగా సీఎం కేసీఆర్‌ ‌భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తారు. దేశ రాజధాని డిల్లీతో పాటు వివిధ ప్రాంతాలలో పివి విగ్రహాలను నెలకొల్పడానికి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా,  పివి ఆధ్మాత్మిక కోణాన్ని ఆవిష్కరించేలా ఆయన రచించిన పుస్తకాలను, పివి మీద ప్రచురితమైన పుస్తకాలను సీఎం కేసీఆర్‌కు పివి కుమార్తె వాణిదేవి అందించారు.

Leave a Reply